Abn logo
Jul 15 2021 @ 14:50PM

Hyderabad లో దొంగలు బాబోయ్‌.. దొంగలు..

  • పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో వరుస దొంగతనాలు
  • ఒకే రోజు మూడు అపార్ట్‌మెంట్లలో చోరీ
  • ఏటీఎం దోచుకునేందుకు విఫలయత్నం

హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో వరుస దొంగతనాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. మూడు అపార్ట్‌మెంట్లలో దొంగతనాలు జరగడంతో పాటు ప్రధాన కూడలి సుచిత్రా చౌరస్తాలోని ఓ బ్యాంకు ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు. దొంగలు అపార్ట్‌మెంట్లలో తాళం వేసి ఉన్న ఫ్లాట్లనే టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. దొంగలను పట్టుకోవడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. 


5 ఫ్లాట్లలో... 

స్ర్పింగ్‌ ఫీల్డ్‌ కాలనీ చంద్రాస్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నెంబర్‌ 502కు నాలుగు నెలలుగా తాళం వేసి ఉంది. అందులోకి ప్రవేశించిన దొంగలు రూ. 80 వేల నగదును అపహరించారు. పక్కనే ఉన్న విందు కాలనీ పృథ్వీహోమ్స్‌లోని 110 ఫ్లాట్‌లోకి చొరబడి 8 తులాల బంగారంతో పాటు రూ. 80 వేల నగదును దోచుకెళ్లారు. ఫృథ్వీ అపార్ట్‌మెంట్‌లోని 102, 502 ఫ్లాట్స్‌ తాళాలు పగలగొట్టారు. అవి ఖాళీగా ఉండడంతో  దోచుకునేందుకు ఏమీ దొరకలేదు. అలాగే, సుచిత్రా సమీపంలోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఏటీఎంలోకి చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. వారి ప్రయత్నం విఫలం కావడంతో వెనుదిరిగారు. బ్యాంకు అధికారులు గుర్తించి స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరుస దొంగతనాలతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్త...

ఊళ్లకు వెళ్తున్న వారు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచొద్దు. పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో గస్తీని పెంచుతాం. ప్రజలు ఎవరూ భయపడవద్దు. నిరంతరం పోలీసులు గస్తీ కాస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. - సీఐ రమే‌ష్‌, పేట్‌ బషీరాబాద్‌.

హైదరాబాద్మరిన్ని...