‘పట్టు’ కోల్పోతోంది!

ABN , First Publish Date - 2021-01-21T06:50:03+05:30 IST

సాగుభారమై అప్పులపాలవుతున్న రైతన్నలకు భరోసా అందాలంటే సంప్రదాయ పంటలను వీడి లాభసాటి సాగుపై దృష్టిపెట్టే విధంగా వారికి అవగాహన కల్పించాలి.

‘పట్టు’ కోల్పోతోంది!
సాగులో ఉన్న మల్బరీతోట

తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభదాయకంగా పట్టు సాగు

అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం

ప్రోత్సాహకాలు కూడా అంతంతమాత్రమే

అప్పులు చేసి షెడ్డుల నిర్మాణం

ఆందోళనలో ఔత్సాహిక రైతులు

ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణం

సాగును వదిలేస్తున్న రైతులు


సెరీకల్చర్‌ విభాగ నిర్లక్ష్యానికి తోడు నిధుల విషయంలో ప్రభుత్వ ఉదాసీనత తోడై జిల్లాలో మల్బరీ సాగు తిరోగమన దిశలో సాగుతోంది. గతంలో సాగు చేసే రైతుల సంఖ్య ఎంతో కొంత వృద్ధి నమోదయ్యేది. కానీ ప్రస్తుతం జిల్లాలో పట్టు పరిశ్రమలో కొనసాగుతున్న రైతుల సంఖ్య సుమారు 864మంది మాత్రమే. గతంలో ఈ సంఖ్య 1100 దాకా ఉండేది. జిల్లాలో భూగర్భజలాలు కూడా గతం కన్నా మెరుగైన స్థితిలోనే ఉన్నాయి. ఇక్కడి నేలలు పట్టుపురుగుల పెంపకానికి, వాటి పోషణకు అవసరమైన మల్బరీ ఆకుల నిర్వహణకు కూడా సానుకూలమైనవి. చేయాల్సిందల్లా రైతులకు పట్టు పరిశ్రమపై అవగాహన కల్పించి, ప్రభుత్వం నుంచి అందే రాయితీలను సకాలంలో అందించడమే. ఆచరణలో ఈ రెండూ లోపించి జిల్లాలో పట్టుపరిశ్రమ వైపు కొత్త రైతులు మొగ్గుచూపించడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు పోనూ తక్కువ ఖర్చుతో ఈ పంటను సాగు చేయవచ్చు. పట్టు సాగు వల్ల రైతులకు సంవత్సరం పొడవునా ఉపాధి లభించే అవకాశం ఉండటంతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చు. కానీ సర్కారు ఆ పరిశ్రమను గాలికొదిలేసింది.


ఒంగోలు(జడ్పీ), జనవరి 20: సాగుభారమై అప్పులపాలవుతున్న రైతన్నలకు భరోసా అందాలంటే సంప్రదాయ పంటలను వీడి లాభసాటి సాగుపై దృష్టిపెట్టే విధంగా వారికి అవగాహన కల్పించాలి. కానీ జిల్లాలో ఆ విధంగా కృషిచేయాల్సిన ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని వదిలేసినట్లు కనిపిస్తోంది. వారికి ఆసరాగా నిలవాల్సిన కొన్నిశాఖలు పూర్తిగా పనిచేయడం మానేశాయి. అందులో ప్రధానమైంది పట్టు పరిశ్రమ. జిల్లాలో అసలు సెరీకల్చర్‌ శాఖ పనిచేస్తుందా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. ఔత్సాహిక రైతులకు అవగాహన కల్పించి సాగును పెంచాల్సిన అధికారులు ఆ దిశగా తీసుకుంటన్న చర్యలు మృగ్యమయ్యాయి. దీంతో కొత్తవారు సాగులోకి రావడం అటుంచి ఇప్పటివరకు పెంపకంలో ఉన్న వారు కూడా దూరమవుతున్నారు. ఇందుకు తాజా గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇదేమని అధికారులను అడిగితే సాగు కష్టమని చెబుతున్నారు. అలాగే కొత్తవారు ఎవరూ ముందుకురావడం లేదనే సమాధానమివ్వడం గమనార్హం.


రైతులకు సిరుల పంట

ఎకరా విస్తీర్ణంలో మల్బరీ సాగు చేస్తే దాదాపు 800 లెయిమ్స్‌కు ఆకు లభిస్తుంది. 2,40,000 పురుగులను పెంచుకోవొచ్చు. ఖర్చులు పోను ప్రతినెలా రూ.20వేల నుంచి రూ.25వేల వరకూ లాభాలను గడించవచ్చు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన షెడ్డు నిర్మాణానికి రూ.1.30లక్షలను అందిస్తారు. మూడేళ్ల కాలపరిమితితో ఖర్చుల కోసం తొలి ఏడాది రూ. 50వేలు, రెండో సంవత్సరం రూ.44,269, మూడో ఏడాది కూడా అదే మొత్తాన్ని రైతులకు ప్రభుత్వం ఇస్తుంది. ఎస్సీ, సన్న, చిన్నకారు రైతులకు రెండెకరాల మల్బరీ సాగుకు, పట్టు పురుగుల పెంపకానికి రూ.3.22లక్షలను ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. మల్బరీ మొక్కలను ఒకసారి నాటితే పదేళ్ల దాకా దిగుబడి పొందవచ్చు. మల్బరీ తోటను రెండు లేదా మూడు భాగాలుగా సాగుచేస్తే సంవత్సరానికి పది పంటలు కూడా తీసే వీలుంది. ఇక గూళ్ల నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి. బీవీ పట్టుగూళ్లపై కిలో రూ.75,  సీ, బీ గూళ్లపై కిలో రూ.40 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.


జిల్లాలో సెరీకల్చర్‌ అంతంతమాత్రమే

సాధారణంగా ఎర్ర ఇసుకనేలలు పట్టుపురుగుల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి నేలలు ఎక్కువగా గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 2,000 ఎకరాల్లో 864మంది రైతులు మాత్రమే పట్టును సాగు చేస్తున్నారు. జిల్లాలో పట్టు పరిశ్రమపై మార్గనిర్దేశం చేయడానికి ఏర్పాటుచేసిన సాంకేతిక సేవా కేంద్రాలు అలంకారప్రాయంగా మిగిలాయి. ఈ కేంద్రాలను చీమకుర్తి, తాళ్లూరు, గిద్దలూరులో గతంలో ఏర్పాటుచేశారు. మోడల్‌ మల్బరీ ఫామ్‌ను  పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి అధిక దిగుబడినిచ్చే రకరకాల మల్బరీ మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు గతంలో సరఫరా చేసేవారు. ప్రస్తుతానికి జిల్లావ్యాప్తంగా దీనికి సంబంధించి పురోగతి నిస్తేజంగా ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు కూడా సకాలంలో విడుదల కాకపోవడంతో కొత్త రైతులు మొగ్గుచూపడం లేదు. వందలమంది రైతులు గతంలో సొంత ఖర్చులతో షెడ్లు నిర్మించారు. మొక్కలు నాటారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు సరిగ్గా అందలేదు. వాటి కోసం ఎదురుచూసి విసిగిపోయి సాగునే వదిలేశారు.


ప్రోత్సాహకాల పెంపుతోపాటు నిధుల విడుదలపై దృష్టిపెట్టాలి

షెడ్డుల నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రభుత్వం విడుదల చేయాల్సిన గ్రామీణ ఉపాధి హామీ నిధులు పెండింగ్‌ ఉండిపోయాయి. అంతేకాక ప్రభుత్వం అందించే సబ్సిడీలను కూడా పెంచితే మరికొంతమంది రైతులు మల్బరీసాగుకు ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయి. పట్టు సాగు అనేది గ్రౌండ్‌వాటర్‌ సమృద్ధిగా ఉన్నచోట అనుకూలంగా ఉంటుంది. యంత్రాంగం దృష్టిసారించి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించినట్లయితే జిల్లాలో సాగు విస్తీర్ణం సంఖ్య పెరుగతుంది.


కరోనాతో కష్టాలు

జిల్లాలో పరిమితంగా సాగు చేస్తున్న రైతాంగానికి సైతం కరోనాతో కష్టాలు చుట్టుముట్టాయి. కరోనా వల్ల నిన్నమొన్నటి వరకు పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాల గురించి సమాచారం అందించే యంత్రాంగం లేకపోవడంతో వారి వెతలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికి ప్రోత్సాహకాలు అందించడంతోపాటు, జిల్లావ్యాప్తంగా అనువైన నేలలున్న చోట అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా మరి కొంతమందిని పట్టుపురుగుల పెంపకం వైపు మళ్లించవచ్చు.


భూగర్భజలాలే సమస్య

పి.రాజ్యలక్ష్మి, జిల్లా సెరీకల్చర్‌ ఆఫీసర్‌

ప్రధానంగా మల్బరీ సాగులో 365రోజులు భూగ్భజలం అందుబాటులో ఉండాలి. దీంతోపాటు వీటి సాగు కోసం సంవత్సరం పొడవునా కష్టించాల్సి ఉంటుంది. అందువల్ల కూడా ఎక్కువమంది ముందుకు రావడం లేదు. మల్బరీ మొక్క ఒక్కసారి నాటితే పదేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. జిల్లాలో రాయితీలు ఏవీ పెండింగ్‌ లేవు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను మార్గదర్శకాల ప్రకారం నిర్మించని షెడ్డుల విషయంలో మాత్రమే ప్రభుత్వం ఆపింది. రైతులకు అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం.





Updated Date - 2021-01-21T06:50:03+05:30 IST