సేవకులే ఉన్నతులు

ABN , First Publish Date - 2021-03-26T05:40:28+05:30 IST

ఏసు ప్రభువు, తన శిష్యులు పన్నెండు మందితో జెరూసలేమ్‌ వెళ్తున్నాడు. అవి మానవునిగా ఈ భూలోకంలో

సేవకులే ఉన్నతులు

ఏసు ప్రభువు, తన శిష్యులు పన్నెండు మందితో జెరూసలేమ్‌ వెళ్తున్నాడు. అవి మానవునిగా ఈ భూలోకంలో ఏసు ప్రభువు ఆఖరి రోజులు. యాకోబు, యోహాను అనే సోదరులు కూడా ఆయన శిష్యుల్లో ఉన్నారు. పరిస్థితులు మారబోతున్నాయని వారు గ్రహించారు. ఏసు ప్రభువు నెలకొల్పే కొత్త రాజ్యంలో కచ్చితంగా మంచి స్థానాన్ని సంపాదించాలనుకున్నారు. 


‘‘మేం అడిగినదేదీ నీవు కాదనకూడదు’’ అని ఏసు ప్రభువును కోరారు. ‘‘మీకోసం నేను ఏం చెయ్యాలో చెప్పండి’’ అన్నాడు ఏసు.  ‘‘నీ రాజ్యంలో... మేము నీ కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు కూర్చొనే అవకాశం కల్పించు’’ అని వారు అడిగారు. ‘‘మీరు కోరింది నెరవేర్చడం నా చేతుల్లో లేదు. ఆ స్థానాలు ఎవరి కోసం సిద్ధపరిచి ఉన్నాయో వారే కూర్చుంటారు’’ అని ఆయన సమాధానం ఇచ్చాడు. 


ఈ విషయం తెలిసి, మిగిలిన శిష్యులందరూ యాకోబు, యోహానుల మీద ఆగ్రహించారు. ఇది గమనించిన ఏసు ప్రభువు అందరినీ దగ్గరకు పిలిచాడు.‘‘పరిపాలన నిర్వహించేవారు ప్రజల మీద అధికారం చెలాయిస్తారు. వాళ్ళ మీద... వారి పైన ఉండేవాళ్ళు పెత్తనం చేస్తారు. ఈ సంగతి మీకు తెలుసు. కానీ మీరు అలా ఉండకూడదు. మీలో ఎవరైనా గొప్పగా ఉండాలనుకుంటే... అతను మీకు సేవకుడిగా వ్యవహరించాలి. అలాగే మిగిలిన వారందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకొనే వ్యక్తి మిగిలిన అందరికీ దాసుడుగా ఉండాలి. మానవ కుమారుడు సైతం ఇతరులతో సేవలు చేయించుకోవడానికి ఇక్కడకు రాలేదు. ఇతరులకు సేవ చెయ్యడానికి వచ్చాడు. ఎంతో మందికి విమోచన కలిగించడానికి... మూల్యంగా తన ప్రాణాలను ప్రతిఫలం చెల్లించడానికి వచ్చాడు’’ అని చెప్పాడు. 




అత్యున్నతమైన దేవుని రాజ్యంలో స్థానాల కోసం పాకులాడడం అవివేకం. హోదాలూ, ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి సన్నిహితంగా ఉండడం, పెత్తనాలు చెలాయించే అధికారాలు కలిగి ఉండడం ఇవేవీ దైవానికి దగ్గర చేయలేవు. ఇలాంటి ఆలోచనలు మాని, నిస్వార్థ సేవ చేసేవారే గొప్పవారనీ, అలాంటి సేవకులకే దేవుడి రాజ్యంలో గొప్ప స్థానం దక్కుతుందనీ ఏసు ప్రభువు స్పష్టం చేశాడు. 


Updated Date - 2021-03-26T05:40:28+05:30 IST