Abn logo
Sep 23 2021 @ 23:42PM

ప్రజలకు సేవలందించండి

భీమిలి ఎంపీపీ వాసురాజుకు బీ-ఫారం అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

భీమునిపట్నం, సెప్టెంబరు 23: ప్రజా ప్రతినిధులందరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలందించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో తొలిసారిగా స్థానిక సంస్థలలో అధికార పీఠాన్ని వైసీపీ అధిష్టించనున్నదని ఆనందం వ్యక్తం చేశారు. గురువారం మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆయా మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, జెడ్పీటీసీలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులకు పార్టీ బీ-ఫారాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులు తానెక్కడికో వెళ్లిపోతానని అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను భీమిలిలోనే ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీపీలు దంతులూరి శివ సూర్యనారాయణరాజు (వాసురాజు), బాలి శారదా ప్రియాంక, కంటుబోతు రాంబాబు, ఉపాధ్యక్షులు బోని బంగారునాయుడు, కోరాడ మంజులకు ఆయన బీ-ఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, తదితరులు పాల్గొన్నారు.