సర్వీసు కోటాపై నాన్చుడు

ABN , First Publish Date - 2021-09-17T09:31:45+05:30 IST

గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వైద్యులు సర్వీస్‌ కోటా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

సర్వీసు కోటాపై నాన్చుడు

మరో నెల రోజుల్లో నీట్‌ ఫలితాలు

ఆపై 2 వారాల్లో ఎన్టీఆర్‌ పీజీ భర్తీ

ఈ లోపు కోటాపై సర్కారు తేల్చితేగ్రామీణ వైద్యులకు ప్రయోజనం

2017లో రాష్ట్రంలో కోటా రద్దు

కుదరదు ఇవ్వాల్సిందేనన్న సుప్రీం

అయినా ఏడాదిగా ఎదురుచూపులే

(అమరావతి- ఆంధ్రజ్యోతి): గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వైద్యులు సర్వీస్‌ కోటా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఏడాది నుంచి డీఎంఈ, ప్రభుత్వం చుట్టూ వైద్యుల సంఘం, కొంత మంది వైద్యులు తిరుగుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన కరువయింది. రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల మంది వైద్యులు ప్రభుత్వ సర్వీ్‌సలో పని చేస్తున్నారు. వీరందరూ పీజీ పూర్తి చేసేందుకు సర్వీస్‌ కోటా ఎంతో ఉపయోగపడుతుంది. 2017 వరకూ రాష్ట్రంలో సర్వీస్‌ కోటా అమలులో ఉంది. ఆసమయంలో సుమారు రాష్ట్రంలో 1500 పీజీ సీట్లు అందుబాటులో ఉండేవి. అందులో 30 శాతం సీట్లు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించిన వైద్యులకు కేటాయించేవారు. 2017లో నీట్‌ రావడంతో ఏపీలోని మెడికల్‌ పీజీ సీట్లలో 50 శాతం నేషనల్‌ పూల్‌లోకి ఇవ్వడంతో సర్వీస్‌ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై జాతీయ స్థాయిలో ప్రభుత్వ వైద్యులంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు సర్వీస్‌ కోటాను అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు కూడా స్పెషాలిటీ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. అక్కడ పని చేసే వైద్యులు స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేయడం వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.


కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా సర్వీస్‌ కోటా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం అక్కడ కాలేజీల్లో ఉన్న మెడికల్‌ పీజీ సీట్లలో 50 శాతం సీట్లు సర్వీస్‌ కోటా వైద్యులకు కేటాయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వీస్‌ కోటా అమలు చేస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన ఏడాది గడిచినా ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. మరోవైపు మరో నెల రోజుల్లో పీజీ నీట్‌ ఎంట్రన్స్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత రెండు వారాల్లో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ మెడికల్‌ పీజీ సీట్లు భర్తీ ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ లోగా సర్వీస్‌ కోటా అమలు చేయకపోతే మాత్రం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే 2017 నుంచి సర్వీస్‌ కోటా అమలు చేయకపోవడంతో వందల పీజీ సీట్లు సర్వీస్‌ కోటా వైద్యులు నష్టపోయారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా సర్వీస్‌ కోటా అమలు చేయకపోతే చాలా మంది వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు.


50 శాతం సీట్లు ఇవ్వాలి...

2017 కంటే ముందు రాష్ట్రంలో ఏటా సర్వీ్‌సలో ఉన్న సుమారు 700 మందికిపైగా వైద్యులు మెడికల్‌ పీజీ ఎంట్రన్స్‌ పరీక్షలు రాసేవారు. ఆ సమయంలో 1500 సీట్లలో 30 శాతం అంటే సుమారు 450 పీజీ సీట్లు సర్వీస్‌ కోటా వైద్యులకు అందుబాటులో ఉండేవి. కాబట్టి వందల మంది సర్వీస్‌ వైద్యులు పీజీ ఎంట్రన్స్‌ పరీక్షకు హాజరయ్యేవారు. 2017లో సర్వీస్‌ కోటా రద్దు అయిన తర్వాత పీజీ ఎంట్రన్స్‌ రాసే వైద్యుల సంఖ్య 200కు తగ్గిపోయింది. సర్వీస్‌ కోటా రద్దు కావడంతో చాలా మంది స్పెషలిస్ట్‌ కోర్సుల వైపు చూసేవాళ్లు కాదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్పెషాలిటీ సేవలు కూడా దూరం అయ్యాయి. మరోవైపు 200 మంది ఎంట్రన్స్‌ రాసినా కేవలం 10 మంది లేదా 15 మంది సర్వీస్‌ వైద్యులకు మాత్రమే కౌన్సెలింగ్‌లో పీజీ సీట్లు వచ్చేవి. మిగిలిన వారంతా నిరాశతో మళ్లీ పీహెచ్‌సీల్లో విధులు నిర్వహించేందుకు వెళ్లిపోయేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1900 మెడికల్‌ పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 50 శాతం నేషనల్‌ పూల్‌కు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ కేటాయిస్తుంది. అంటే సుమారు 950 సీట్లు నేషనల్‌ పూల్‌కి ఇస్తున్నారు. మిగిలిన 950 సీట్లల్లో 50 శాతం అంటే 475 సీట్లు సర్వీస్‌ కోటా వైద్యులకు కేటాయించాలని ప్రభుత్వ వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఈ ఏడాది మాత్రం సర్వీస్‌ కోటా అమలులోకి వస్తుందని సుమారు 600 మంది సర్వీస్‌ వైద్యులు మెడికల్‌ పీజీ ఎంట్రన్స్‌ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో చాలామంది అర్హత సాధిస్తారని ప్రభుత్వ వైద్యుల సంఘం ధీమాతో ఉంది. కానీ ప్రభుత్వం సర్వీస్‌ కోటా అమలు చేస్తేనే వారందరికి సీట్లు వస్తాయని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం సర్వీస్‌ కోటాకు సంబంధించిన ఫైల్‌ డీఎంఈ, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతోంది. సచివాలయం నుంచి రెండుసార్లు ఫైల్‌ వెనక్కి వచ్చింది. డీఎంఈ అధికారులు కూడా సర్వీస్‌ కోటాపై ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఫైల్‌ సచివాలయం, డీఎంఈ చుట్టూ తిరుగుతోంది. మరో నెల రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉంటే సుమారు 500 మంది సర్వీస్‌ వైద్యులు స్పెషాలిటీ కోర్సులకు దూరం అవుతారు. 


సర్వీసు వైద్యులకు నష్టం జరగదు

‘‘సుప్రీంకోర్టు తీర్పుని అధ్యయనం చేస్తున్నాం.  సర్వీస్‌ కోటా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నాం.  సర్వీస్‌ కోటా వైద్యులకు నష్టం లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది’’

             - రాఘవేంద్రరావు, డీఎంఈ

Updated Date - 2021-09-17T09:31:45+05:30 IST