సేవా భావమే బీజేపీ ఆచరణ

ABN , First Publish Date - 2020-07-07T06:08:13+05:30 IST

రాజకీయాలను సేవ చేసే మాధ్యమంగానే చూడాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిశ్చితాభిప్రాయం. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలంటే ప్రజలను దోచుకోవడం, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడడం, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడడం అనే...

సేవా భావమే బీజేపీ ఆచరణ

కరోనా సమయంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమను తాను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంటే, బిజెపి కార్యకర్తలు వీధుల్లోకి వెళ్లి తమ గురించి ఆలోచించకుండా పేదలకు, అవసరమైన వారికి  సేవలందించారు. భారతీయ జనతా పార్టీ అనేది ఎన్నికల్లో గెలిచేందుకు ఏర్పడిన సంస్థ కాదని, సమాజం కోసం పనిచేసే సాధనమని ప్రధాని మోదీ చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన సమగ్ర మానవతా వాదం, అంత్యోదయ సిద్ధాంతమే ఇవాళ బిజెపి, మోదీ ప్రభుత్వ కార్యాచరణలకు ప్రాతిపదికగా ఉన్నాయనేది సుస్పష్టం.


రాజకీయాలను సేవ చేసే మాధ్యమంగానే చూడాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిశ్చితాభిప్రాయం. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలంటే ప్రజలను దోచుకోవడం, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడడం, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడడం అనే అభిప్రాయంగా చలామణి అయింది. కానీ నరేంద్ర మోదీ రాజకీయాల నిర్వచనాన్నే మార్చి వేశారు. ఇటీవల స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా హీ సంఘటన్ (పార్టీ ఉన్నదే సేవ కోసం) అని నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ ప్రజలకు నిజమైన సేవలు అందించడమే రాజకీయాల లక్ష్యం కావాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ స్వంత ప్రయోజనాలకోసం అధికారాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నిస్వార్థ సేవకై ప్రతి బిజెపి కార్యకర్త ప్రతిజ్ఞ చేయాలని, ప్రజలకోసం అంకిత భావంతో పనిచేయడం ఒక విలువగా మనం స్వీకరించాలని ఆయన అన్నారు. లాక్ డౌన్ సందర్భంగా కోట్లాది బిజెపి కార్యకర్తలు ప్రజల్లోకి చొచ్చుకుపోయి జరిపిన సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. తాము చేసిన సేవా కార్యక్రమాలను రికార్డు చేసి డిజిటల్ రూపంలో భద్రపరచాలని. అవి భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతాయని మోదీ అన్నారు. 


నిజానికి కరోనా సమయంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమను తాను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంటే బిజెపి కార్యకర్తలు వీధుల్లోకి వెళ్లి తమ గురించి ఆలోచించకుండా పేదలకు, అవసరమైన వారికి సేవలందించారు. భారతీయ జనతా పార్టీ అనేది ఎన్నికల్లో గెలిచేందుకు ఏర్పడిన సంస్థ కాదని, సమాజం కోసం పనిచేసే సాధనమని నరేంద్రమోదీ చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. నిజానికి బీజేపీ ఏనాడో ‘నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లేటర్’ (దేశం ప్రథమం, పార్టీ ద్వితీయం, వ్యక్తి చివర) అన్న నినాదాన్ని చేపట్టింది. ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ఈ నినాదానికి మరింత సార్థకత చేకూర్చేందుకు ‘సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా సుఖ్, సబ్ కీ సమృద్ధీ’ అన్న భావనతో ప్రభుత్వ పాలనను సాగించారు. బిజెపి కార్యకర్తలు ఏడు రకాల ‘ఎస్’ లతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. అవి సేవాభావం, సంతులనం, సంయమనం, సమన్వయం, సకర్తాత్మకత, సద్భావం, సంవాద్ అని ఆయన ఉల్లేఖించారు. కార్యకర్త అన్న వాడు సేవాభావమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, ఒక మంచి భావనతో, అందరితో సమన్వయం, సమాచార సంబంధాలు పెట్టుకుంటూ ముందుకు సాగాలని ప్రధానమంత్రి భావం.


నిజానికి ఏ పార్టీ సిద్ధాంతమైనా దాని కార్యాలయాల్లో కానీ, కరపత్రాల్లో కానీ ఉండదు. వెబ్ సైట్లలోనూ, సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉంటే సరిపోదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వారి మధ్య ఉండి వారికి తగిన సహాయం అందిస్తూ తామున్నామనే విశ్వాసాన్ని అందించినప్పుడే ఆ పార్టీ ఉనికికి అర్థం ఏర్పడుతుంది. భారతీయ జనతా పార్టీలో ఇలా క్రింది స్థాయి నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఉన్న వారికే అంచెలంచెలుగా ఎదిగే అవకాశం లభిస్తుంది. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకప్పుడు సాధారణ కార్యకర్తగా ప్రజల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సంస్థను బలోపేతం చేస్తూ అంచెలంచెలుగా పైకి ఎదిగిన వారే. అటల్ బిహారీ వాజపేయి నుంచి మోదీ వరకూ తమకంటూ ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా, విలువలను పాటిస్తూ ప్రజలకు ప్రయోజనం కలిగించే అనేక పథకాలను, సేవా కార్యక్రమాలను అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ వారసత్వమో, పలుకుబడి, ధన బలం, కుల బలం ఉంటే నాయక స్థాయికి ఎదిగేందుకు వీలు కలుగుతుంది. కానీ బిజెపిలో అటువంటి దుస్థితి లేదు. చాలా పార్టీల్లో కోట్లాది రూపాయలను అర్జించి, సంపదను వెనకేసుకుని పైకి ప్రజలకోసం మొసలి కన్నీళ్లు కార్చేవారు కనపడతారు. ఆ సంపద అంతా వారు ప్రజలను దోపిడీ చేసి సంపాదించిందే. కాని భారతీయ జనతా ఎంత సంపన్నుడు పార్టీలో చేరినా ఆ మరుక్షణం నుంచీ పార్టీ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి సేవా కార్యక్రమాలలో పాల్గొనవలిసిందే.


పార్టీ జాతీయ అధ్యక్షుడుగా జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పార్టీని పూర్తిగా సామాజిక సంక్షేమ సంస్థగా మార్చారనడంలో అతిశయోక్తి లేదు. ఆకొన్నవారికి అన్నం అందించడం అన్న ప్రచారాన్ని ఆయన స్వయంగా చేపట్టి అవసరం ఉన్న వారందరికీ ఆహారాన్ని అందించాల్సిందిగా ఆయన పార్టీ కార్యకర్తలకు ప్రేరణ కలిగించారు. రోజు కూలీ మీద బతికేవారు, కూలీలు, వలస కార్మికుల మధ్య గడిపి వారి అవసరాలను చూడమని కోరారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీలు వలస కార్మికులు అధోగతి పాలయ్యారంటూ ప్రభుత్వంపై బురద చల్లేందుకు పూనుకున్నారు. వలస కార్మికులు కష్టాలు పాలయ్యేందుకు పూర్తిగా మోదీ సర్కారే కారణమంటూ దుష్ప్రచారం సాగించారు. కాని ఈ విమర్శలను ఏవీ పట్టించుకోకూడదని, వెంటనే అవసరంలో ఉన్న వారిని ఆదుకునేందుకు రంగంలోకి దిగమని జగత్ ప్రకాశ్ నడ్డా హుందాగా పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ఒకర్నొకరు ప్రోత్సహించుకున్నారు. కేవలం ఒకే ఒక ట్వీట్‌తో రంగంలోకి దిగి ప్రజలకు మందులు, రేషన్ సరఫరా చేసిన వారు, రక్తాన్ని దానం చేసిన వారు ఎందరో. దాదాపు 22.18 కోట్ల రేషన్ కిట్లను, 5.04 కోట్ల మాస్కులను పార్టీ కార్యకర్తలు అందించడం సాధారణమైన విషయం కాదు. 57.94 లక్షల కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయగా, వృద్దులు, అస్వస్థతతో ఉన్న వారిని ఆదుకునేందుకే 8.23 లక్షలమంది అంకిత భావంతో పనిచేశారు. కరోనా యోధులకు కృతజ్ఞతలు చెబుతూ 4.79లక్షలమంది సంతకాల సేకరణ చేశారు. దేశంలోని 13,796 మండలాల్లో 907 జిల్లాల్లో 13.17 లక్షలకు పైగా బూతుల్లో సేవా కార్యక్రమాలు ఉధృతంగా జరిగాయి.


భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని, ముస్లింల వ్యతిరేక పార్టీ అని కుహనా లౌకిక వాదులు తరుచూ విమర్శిస్తుంటారు. కాని ఈ కరోనా సమయంలో బిజెపి కార్యకర్తలు కుల, మతాలకు అతీతంగా ప్రజలకు అంకిత భావంతో సేవలందించారని ఎంతమందికి తెలుసు? ముంబైలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా బిజెపి-ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు స్థానిక పరిపాలనా యంత్రాంగంతో కలిసి పనిచేశారు. తమ కుటుంబ సభ్యులను కూడా తమ సేవాకార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారు. బిజెపి కార్యకర్తకు సంబంధించి మొత్తం ప్రపంచమే ఒక కుటుంబం లాంటింది (వసుధైవ కుటుంబకం).బిజెపి లక్ష్యాలకు ఆకర్షితమైనందువల్లే అది ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా సారథ్యంలో 18 కోట్ల మందితో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా చరిత్ర సృష్టించింది.


భారతీయ జనతా పార్టీ సిద్ధాంత కర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన సమగ్ర మానవతా వాదం, అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగానే ఇవాళ బిజెపి కానీ, నరేంద్రమోదీ ప్రభుత్వం కానీ కార్యాచరణ సాధిస్తున్నదన్నవిషయం సుస్పష్టం. అవసరమైన వారికి ఉచిత రేషన్, అణగారిన వర్గాలకు నైపుణ్యాలు అందించడం, స్టాండ్ అప్, స్టార్ట్ అప్ ఇండియా, ముద్రా యోజనల ద్వారా ఇవాళ మోదీ ప్రభుత్వం పేదవాడి కంటినీరు తుడిచేందుకు, ఆకలిని తీర్చేందుకు చేయగలిగినంత కృషి చేస్తున్నది. కరోనా సమయంలోనే కాదు, బిజెపి నిరంతరం విశ్రమించకుండా మానవ సేవే మాధవ సేవగా భావించాలని ప్రధానమంత్రి ఉద్భోదించారు. ఇది నిరంతర ప్రక్రియగా భావించాలని అన్నారు. ఫలితాల గురించి ఆలోచించకుండా పనిచేస్తూ ఉండడమే బిజెపి కర్తవ్యం. ఫలితాలను ప్రజలు నిర్ణయిస్తారు.



వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2020-07-07T06:08:13+05:30 IST