సేవలకు గుర్తింపేది?

ABN , First Publish Date - 2021-08-02T07:48:02+05:30 IST

ఉస్మానియా వర్సిటీలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్‌.. ఇటీవల కరోనా బారినపడి మరణించారు.

సేవలకు గుర్తింపేది?

ఉస్మానియా వర్సిటీలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్‌.. ఇటీవల కరోనా బారినపడి మరణించారు. ఆయనకు భార్యతోపాటు రెండేళ్ల కుమార్తె ఉన్నారు. కరోనాతో మరణించినప్పటికీ.. కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కుటుంబానికి వర్సిటీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. చివరకు అంత్యక్రియల ఖర్చులు కూడా ఇవ్వలేదు. పదేళ్లుగా అందించిన సేవలకు కనీస గుర్తింపూ దక్కలేదు. ఓయూ పరిధిలో వివిధ కారణాలతో 8 మంది కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మరణించగా.. ఏ ఒక్కరికీ ఆర్థిక సాయం అందలేదు.


ఉస్మానియా వర్సిటీలోని ఎడ్యుకేషన్‌ విభాగంలో పని చేసిన కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సులోచన జేమ్స్‌.. ఇటీవల రిటైర్‌ అయ్యారు. సుమారు 18 ఏళ్ల పాటు సేవలందించిన ఆమెకు ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు. కనీసం శాలువా కప్పి సన్మానించిన వాళ్లే లేరు. ఇక మీ సేవలు చాలని చెప్పి అవమానకరంగా పంపేశారు. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేస్తే రూ.3.50లక్షలు అందజేస్తున్నారు. కానీ, వందేళ్ల వైభవం కలిగిన ఉస్మానియా వర్సిటీలో ఎలాంటి సాయం అందించకుండా నిర్దాక్షిణ్యంగా గెంటేస్తున్న పరిస్థితి నెలకొంది.


వర్సిటీల్లో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల దీనావస్థ

ఎన్నేళ్లు చేసినా పదోన్నతులు ఉండవు 

పీఆర్సీ వచ్చినా వీరి వేతనాలు పెరగలేదు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో రెగ్యులర్‌ బోధన సిబ్బందికి సమానమైన అర్హతలు కలిగి ఉండి, వారి కంటే ఎక్కువ సమయం పని చేస్తున్నా.. కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అగచాట్లు తప్పడం లేదు. ఏళ్ల పాటు పని చేసినా వీరి సేవలకు గుర్తింపు లభించడం లేదు. చివరకు ఉద్యోగ విరమణ నాడు వీరికి శాలువా కప్పి, సన్మానించే వారు కూడా ఉండడం లేదు. అకస్మాత్తుగా మరణిస్తే కనీసం ఆర్థిక సాయం కూడా అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉస్మానియా కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మగాంధీ, ఫైన్‌ఆర్ట్స్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, ట్రిపుల్‌ ఐటీ బాసర వర్సిటీల్లో మొత్తం 1,815 మంది కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు.


చారిత్రక నేపథ్యం కలిగిన ఉస్మానియా వర్సిటీలో ఎన్నో ఏళ్లుగా ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంంతో రెగ్యులర్‌ బోధన సిబ్బంది సంఖ్య తగ్గుతూ.. కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు ఉస్మానియాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లతో కలిపి 1,284 మంది రెగ్యులర్‌ టీచింగ్‌ సిబ్బంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 249కి తగ్గిపోయింది. కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సంఖ్య 491కి పెరిగింది. వీరిలో చాలా మంది బోధన వృత్తితో పాటు ఇన్విజిలేషన్‌, పేపర్‌ వాల్యూయేషన్‌, పేపర్‌ సెట్టింగ్‌ వంటి విధులతో పాటు ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, హాస్టల్‌ వార్డెన్లు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


పని చేస్తున్నా.. దక్కని గౌరవం

పలు వర్సిటీల్లోని రెగ్యులర్‌ ప్రొఫెసర్లు ఎక్కువగా అడ్మినిస్ర్టేషన్‌ పోస్టులకే పరిమితమవుతున్నారు. వారానికి 16 తరగతులు బోధించాలని నిబంధనలునా.. 10 తరగతులు కూడా తీసుకోవడం లేదు. ఈ భారమంతా కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లపైనే పడుతోంది. 25ఏళ్లు పని చేసినా.. కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు కనీస గౌరవం దక్కడం లేదు. మరోవైపు, ప్రభుత్వం ఇటీవల పీఆర్‌సీ తీసుకొచ్చిన నేపథ్యంలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను 30శాతం మేర పెంచుతూ జీవో జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వేతనం రూ.37వేల నుంచి రూ.58వేలకు పెరగ్గా, జూనియర్‌ కాలేజీల్లోని కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు రూ.54వేలకు పెరిగింది. కానీ, వర్సిటీల్లో పని చేసే కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల వేతనాలు నయా పైసా పెరగలేదు. కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ప్రారంభ వేతనం ఇంకా రూ.43,790గానే ఉంది. కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఇచ్చే వేతనంపై ఏటా 3శాతం పెంచాలని 2018లో జీవో 11 జారీ కాగా.. చాలా వర్సిటీల్లో ప్రారంభ వేతనంపై మాత్రమే పెంచుతున్నారు. ట్రిపుల్‌ ఐటీ బాసర, తెలంగాణ వర్సిటీలో మాత్రమే ప్రస్తుతం అందజేస్తున్న వేతనంపై 3శాతం పెంచుతున్నారు.  


ఎలాంటి బెనిఫిట్స్‌ అందడం లేదు

నేను 26 ఏళ్లుగా కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నా. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా యూనివర్సిటీలు అమలు చేయడం లేదు. యూజీసీ నిబంధనలను సైతం పాటించడం లేదు. ఉద్యోగ విరమణ చేసినా, మరణించినా.. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టుల ఖాళీల భర్తీకి నిర్వహించే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నుంచి మమ్మల్ని మినహాయించాలి. ఇంటర్వ్యూలో 30శాతం వెయిటేజ్‌ కల్పించాలి. 

- ధర్మతేజ, యూనివర్సిటీల కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు

Updated Date - 2021-08-02T07:48:02+05:30 IST