బకాయిల సంగతి తేల్చండి

ABN , First Publish Date - 2022-01-28T04:27:13+05:30 IST

ఉపాధి హామీ పథకంలో బిల్లుల బకాయిలపై పీడీ కూర్మారావును ప్రజాప్రతినిధులు నిలదీశారు. గురువారం కవిటిలో జడ్పీ చైర్‌పర్సన్‌ పి.విజయ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త పి.సాయిరాజ్‌ మాట్లాడుతూ బిల్లుల బకాయిల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

బకాయిల సంగతి తేల్చండి
పీడీ కూర్మారావును నిలదీస్తున్న సాయిరాజ్‌

- ఉపాధి హామీ బిల్లుల పెండింగ్‌పై నిలదీత

కవిటి, జనవరి 27: ఉపాధి హామీ పథకంలో బిల్లుల బకాయిలపై పీడీ కూర్మారావును ప్రజాప్రతినిధులు నిలదీశారు. గురువారం కవిటిలో జడ్పీ చైర్‌పర్సన్‌ పి.విజయ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త పి.సాయిరాజ్‌ మాట్లాడుతూ బిల్లుల బకాయిల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాలా (లల్లు) మాట్లాడుతూ 2019- 22 మధ్య కాలంలో బకాయి ఉన్న ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ చైర్మన్‌ నర్తు రామారావు మాట్లాడుతూ.. ‘అప్పు చేసి కార్యకర్తలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. కొంతమంది బంగారం తనఖా పెట్టి సీసీ రోడ్లు, భవనాలు నిర్మించారు. బిల్లులు ఇవ్వకపోతే ఎలా?’ అని నిలదీశారు. ప్రభుత్వ పథకాలన్నీ బాగున్నా.. ఉపాఽధి పనులకు బిల్లులు రాక కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలని కోరారు. సోంపేట ఎంపీపీ ఎన్‌.దాసు మాట్లాడుతూ చేసిన పనులకు సంబంధించి ఎం-బుక్‌ రికార్డు చేయడానికి అధికారులు మామూళ్లు అడగడం అన్యాయమన్నారు. హౌసింగ్‌ బిల్లుల్లో 90 రోజుల పేమెంట్స్‌ సైతం పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పనులు మంజూరైనప్పుడు అధికారులు రూపొందించిన అంచనాలకు, పనులు చేసిన తర్వాత వచ్చిన బిల్లులకు వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పారు. బిల్లుల బకాయిలు త్వరగా చెల్లించాలని కోరారు. దీనిపై పీడీ కూర్మారావు స్పందిస్తూ.. ‘జిల్లాలో 2019-22 మధ్య కాలంలో రూ.130 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫిబ్రవరి 15 నాటికి బకాయిలు పూర్తిగా చెల్లిస్తాం’ అని తెలిపారు. మండలాల వారీగా అంచనాలు సిద్ధం చేసి పంపించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ఎం-బుక్‌ రికార్డింగ్‌కు లంచం అడగడం నేరమని, అటువంటి పనులు చేపట్టరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీలు కె.పద్మ, బి.పుష్ప, దేవదాసు రెడ్డి, ఎన్‌.దాసు, జడ్పీటీసీ యు.నారాయణమ్మ, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T04:27:13+05:30 IST