Philadelphia లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారులు సహా 13 మంది సజీవ దహనం!

ABN , First Publish Date - 2022-01-06T18:49:20+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

Philadelphia లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారులు సహా 13 మంది సజీవ దహనం!

ఫిలడెల్ఫియా: అగ్రరాజ్యం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల ఓ భవనంలో చెలరేగిన మంటల్లో  ఏడుగురు చిన్నారులు సహా 13 మంది సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలడెల్ఫియాలోని ఫెయిర్​మౌంట్​ ప్రాంతంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగిందని ఫిలడెల్ఫియా పబ్లిక్ హౌసింగ్ అథారిటీ(పీహెచ్ఏ) సీఈఓ కెల్విన్ జెర్మియ తెలిపారు. భవనంలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో నివాసం ఉంటున్న ఫ్యామిలీకి బయటపడేందుకు వీలు పడలేదని, దాంతో భారీ ప్రాణనష్టం సంభవించిందని తెలిపారు. 


రెండో అంతస్తులో సుమారు 18 మంది వరకు నివసిస్తుండగా, వారిలో పనుల నిమిత్తం ముగ్గురు బయటకు వెళ్లారు. మిగిలిన 15 మందిలో 13 మంది ప్రమాదంలో చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కెల్విన్ పేర్కొన్నారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని 50 నిమిషాల్లోనే మంటలను అదుపు చేసినట్లు చెప్పారాయన. ప్రమాదం సంభవించిన భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్​లు ఉన్నా.. ఏ ఒక్కటీ పనిచేయలేదని కెల్విన్ తెలిపారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ కొనసాగుతుందున్నారు. కాగా, ప్రమాదంలో ఏడుగురు పిల్లలు మృతి చెందడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక మేయర్ జిమ్ కెన్నీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-06T18:49:20+05:30 IST