జూలై నుంచి ఏడు కొత్త ప్యాకేజీలు

ABN , First Publish Date - 2021-06-22T06:16:12+05:30 IST

కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జూలై మొదటివారంలో ఏడు కొత్తప్యాకేజీలను ప్రవేశపెడుతున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఈడీ ఏఎల్‌ మల్‌రెడ్డి తెలిపారు.

జూలై నుంచి ఏడు కొత్త ప్యాకేజీలు
మల్‌రెడ్డి

 దేవలోక్‌ ప్రదేశంలో 7స్టార్‌ హోటల్‌కు సన్నాహాలు 

ఏపీ టూరిజం ఈడీ ఏఎల్‌ మల్‌రెడ్డి 


తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 21: కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జూలై మొదటివారంలో ఏడు కొత్తప్యాకేజీలను ప్రవేశపెడుతున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఈడీ ఏఎల్‌ మల్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని పర్యాటకశాఖ అతిథి గృహంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే తిరుపతి లోకల్‌, నాన్‌లోకల్‌, శ్రీకాళహస్తి, కాణిపాకం, ఆలయాలతోపాటు కలుపుకొని నాలుగు ప్యాకేజీలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. వీటికి అదనంగా తిరుమల- పొద్దుటూరు.. తిరుమల- కావలి.. తిరుమల- మదనపల్లె.. కాణిపాకం- శ్రీకాళహస్తి, తిరుపతిలోకల్‌.. తలకోన, హార్సిలీహిల్స్‌, తరిగొండ, వాయల్పాడు, చంద్రగిరికోట.. టీటీడీ లోకల్‌-నాన్‌లోకల్‌..  టీటీడీ నాన్‌లోకల్‌- శ్రీకాళహస్తి ప్యాకేజీలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. వోల్వో మల్టీ ఎక్సైల్‌ బస్సుల్లో రవాణాతోపాటు సులభంగా శ్రీవారి దర్శనం, ఇతర ఆలయ సందర్శనలో భాగంగా టీటీడీ ఏపీటీడీసీకి 1000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కేటాయించడంతో పర్యాటకులకు బాగా ఉపయోగపడుతుందన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 18వ తేది నుంచి తిరుపతిలోని విష్ణునివాసం, ఆయుర్వేద ఆస్పత్రిలో ప్రతి రోజు 1,400మందికి ఆకలి తీర్చుతున్నట్లు చెప్పారు. త్వరలో పద్మావతి నిలయంలో యాత్రికులకు వసతి, భోజనసేవలను ప్రారంభిస్తామన్నారు. పూర్తిస్థాయిలో పర్యాటక ప్యాకేజీలు ప్రారంభమైతే సంస్థ ఆదాయం పెరుగుతుందని మల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ సంస్థలో కొవిడ్‌ విపత్కర సమయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి రోజూ రూ.వంద ప్రోత్సాహం, కరోనా సోకి దురదృష్టవశాత్తు మృతి చెందితే వారి కుటుంబీకులకు రూ.2లక్షలతో భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. రుయాస్పత్రికి ఎదురుగా ఉన్న టూరిజం భవనాన్ని పునఃప్రారంభిస్తామని, టెండర్లు కూడా ఖరారైనట్లు తెలిపారు. దేవలోక్‌ ప్రదేశంలోనూ 7స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  కరోనాతో ఇవన్నీ ఆలస్యమవుతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజినల్‌ మేనేజర్‌ గిరిధర్‌రెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:16:12+05:30 IST