70 మంది పిల్లలకు అమ్మ!

ABN , First Publish Date - 2021-11-24T09:22:17+05:30 IST

ఎక్కడో ఇటలీలో పుట్టి, కేరళను సేవా గమ్యంగా ఎంచుకున్న సిస్టర్‌ ఫాబియోలా ఫాబ్రీ ఇప్పుడు 70 మంది పిల్లలకు ‘అమ్మ’, అణగారిన వర్గాలకు చెందిన, ...

70 మంది పిల్లలకు అమ్మ!

ఎక్కడో ఇటలీలో పుట్టి, కేరళను సేవా గమ్యంగా ఎంచుకున్న సిస్టర్‌ ఫాబియోలా ఫాబ్రీ ఇప్పుడు 70 మంది పిల్లలకు ‘అమ్మ’, అణగారిన వర్గాలకు చెందిన, అనాథలైన బాలలకు ఆశ్రయం కల్పించి, వారిలో జీవితం పట్ల ఆశను, భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగిస్తున్నారు.


ఫాబియోలా ఫాబ్రీ బాల్యమంతా ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో గడిచింది. నలుగురు తోబుట్టువుల్లో చిన్నదైన ఆమె తండ్రికి గారాలపట్టి. చదువు పూర్తయ్యాక, ‘సిస్టర్‌’గా మారతానని ఆమె చెప్పినప్పుడు, కుటుంబం నిర్ఘాంతపోయింది. ‘‘స్నేహితులన్నా, సోషల్‌లైఫ్‌ అన్నా ఇష్టపడే నువ్వు ‘సిస్టర్‌’గా మారతావా? అది సాధ్యమేనా?’’ అని అడిగారు తండ్రి. కానీ తన నిర్ణయం నుంచి ఆమె వెనక్కి తగ్గలేదు. ‘‘చిన్ననాటి నుంచీ నాకు సిస్టర్‌ కావాలనే కోరిక ఉండేది. దీనికి కారణం మా అమ్మ. నాలో ఆధ్యాత్మిక భావాలు పెరగడానికి ఆమె దోహదం చేసింది. ఒక రోజు మదర్‌ థెరెసా సేవల్ని వివరించే చిత్రం ఒకటి చూశాను. కొన్ని పుస్తకాలు చదివాను. అవి నా కోరికను మరింత బలపరిచాయి. కుటుంబాన్ని ఒప్పించాను. ఇటలీలోని ‘అపోస్థలిక్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ కన్సొలేటా’లో చేరాను. సేవా కార్యక్రమాల్లో భాగంగా పదిహేనేళ్ళ కిందట కేరళ వచ్చాను. కొచ్చి చుట్టుపక్కల ఉన్న అనేక మురికివాడల్లో తిరిగాను. పేద కుటుంబాలను కలిశాను. వాళ్ళు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి ఆవేదన చెందాను’’ అని చెప్పారు ఫాబ్రీ. 


ఆ పిల్లను చూశాక...

మొదట్లో ఆమె జీసస్‌ యూత్‌ వాలంటీర్స్‌తో పని చేసేవారు. రైల్వే స్టేషన్లు, వీధుల్లో కనిపించిన అనాథ పిల్లలకు సాయం చేసేవారు. ‘‘ఒక రోజు రోడ్డు మీద చాలా బలహీనంగా, దాదాపు అస్తిపంజరంలా ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ఆమె తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతోంది. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కదిలించింది. ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి, చికిత్స చేయించాను. ఇలాంటి వారి కోసం ఏదైనా చెయ్యాలని అప్పుడే అనిపించింది’’ అని చెప్పారామె. 


దేవుడిచ్చిన మరో జన్మ

ఈ ఆలోచనల్లో ఉండగానే, ఆమె హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన తలనొప్పితో మొదలై, క్రమంగా శరీరం మొత్తం అచేతనంగా మారిపోవడానికి దారితీసింది. మాట, చూపు, స్పర్శ, కదలిక అన్నీ దెబ్బతిన్నాయి. అనేక పరీక్షల తరువాత ఆమెకి ‘గులియన్‌ బారి సిండ్రోమ్‌’ అనే సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారు. అది భయానకమైన అనుభవం. విపరీతమైన నీరసం, ఒంటరితనం, బయట ప్రపంచంతో సంబంధాలన్నీ తెగిపోయాయి. కానీ నా విషయంలో దేవుడికి వేరే ఆలోచనలున్నట్టున్నాయ్‌. క్రమంగా కోలుకున్నాను. నా అనారోగ్యం మొత్తం మారిపోయింది. ఆర్తులకు సేవ చెయ్యడానికి దేవుడు ఇచ్చిన మరో జన్మగా దీన్ని భావించాను. అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి చర్చి వర్గాల అనుమతి తీసుకున్నాను. 2005లో ‘ఆశ్వాస భవన్‌’ ప్రారంభించాను’’ అని నాటి రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. స్థానికులతో సులువుగా సంభాషించడం కోసం మలయాళ భాషను ఆమె క్షుణ్ణంగా నేర్చుకున్నారు కూడా. 

మేమంతా ఒక కుటుంబం...

‘ఆశ్వాస భవన్‌’లో ఇప్పుడు సుమారు 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో పిల్లల దగ్గర నుంచి టీనేజర్ల వరకూ ఉంటారు. వారికి ఆహారాన్ని, వసతిని, ప్రేమను, సంరక్షణను ఫాబ్రీ అందిస్తున్నారు. ఆ పిల్లలను తల్లిలా సాకుతున్నారు. వాళ్ళు ఆమెను ‘అమ్మ’ అని పిలుస్తారు. ‘‘నేను ఊహించిన దానికన్నా వేగంగా మా ఆశ్వాస భవన్‌ కుటుంబం వృద్ధి చెందింది. మొదట్లో దగ్గర్లో ఉన్న పిల్లలను మేమే గుర్తించి చేర్చుకొనేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వ సంస్థల ద్వారా ఎక్కువమంది వస్తున్నారు’’ అంటున్నారామె.. పిల్లల వయసు ఆధారంగా ఈ కేంద్రాన్ని మూడు విభాగాలుగా మార్చారు. ఫౌండ్లింగ్‌ హోమ్‌లో శిశువుల నుంచి అయిదేళ్ళ వరకూ, గర్ల్స్‌ హోమ్‌లో ఆరు నుంచి పద్ధెనిమిదేళ్ళ బాలికలు, బాయెస్‌ హోమ్‌లో ఆరు నుంచి పద్ధెనిమిదేళ్ళ బాలురు ఉంటారు. పాఠశాలలకు, కాలేజీలకు వెళ్ళే పిల్లలకు లంచ్‌ బాక్సులు, రవాణా సదుపాయాలను ఈ కేంద్రం కల్పిస్తోంది. క్రీడల్లో, కళల్లో వారిని ప్రోత్సహిస్తోంది. 


ప్రతి బిడ్డ ఒక మిస్టరీ...

‘‘స్థానిక ట్రస్ట్‌ ద్వారా సిబ్బంది జీతాలు, పిల్లల స్కూలు ఫీజులు, వైద్య ఖర్చులు అందుతున్నాయి. మిగిలిన మొత్తాన్ని విరాళాల ద్వారా సమకూర్చుకుంటున్నాం’’ అని చెబుతున్న యాభై రెండేళ్ళ ఫాబ్రీ 2013లో భారత పౌరసత్వం పొందారు. ఫాబ్రీ సేవలను గుర్తించిన కేరళ క్యాథలిక్‌ బిషప్స్‌ కౌన్సిల్‌ (కెసిబిసి) ఆమెను ఘనంగా సత్కరించింది. ‘‘ఈ దేశాన్ని నా కార్యస్థానంగా దేవుడు నిర్దేశించాడు. మనకు ఎప్పుడు ఏది అవసరమైనా దాన్ని మనం ఊహించని మార్గంలో ఆయన సమకూరుస్తాడన్నది నా విశ్వాసం. ముఖ్యంగా పిల్లల మధ్య గడపడం నాకెంతో శక్తిని ఇస్తోంది. వారికి మనం ప్రేమ పంచాలి, భయం, ఒంటరితనం లాంటివి లేకుండా చూడాలి. ఆశను, భవిష్యత్తు పట్ల నమ్మకాన్నీ, సేవా తత్పరతను వారిలో నింపాలి. ఇది మా లాంటి సంస్థలే కాదు... ప్రతి కుటుంబం పాటించాలి. అప్పుడే సమాజంలో, ప్రపంచంలో శాంతి నెలకొంటుంది’’ అంటున్నారు ఫాబ్రీ.



Updated Date - 2021-11-24T09:22:17+05:30 IST