Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 17 2021 @ 17:27PM

జమ్మూ-కశ్మీరులో కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు శాసన సభ ఎన్నికలు త్వరలో జరుగుతాయనే ఊహాగానాల నడుమ కాంగ్రెస్‌ పార్టీలోని తమ పదవులకు 20 మంది సీనియర్ నేతలు రాజీనామా చేశారు. వీరంతా ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామాలు సమర్పించినవారిలో మాజీ మంత్రులు జీఎం సరూరీ, వికార్ రసూల్, డాక్టర్ మనోహర్ లాల్ శర్మ ఉన్నారు. వీరితోపాటు జుగల్ కిశోర్ శర్మ, గులాం నబీ మోంగ, నరేశ్ గుప్తా, మహమ్మద్ అమిన్ భట్, సుభాశ్ గుప్తా, అన్వర్ భట్, అనియతుల్లా రాథేర్ కూడా తమ పదవులకు రాజీనామాలు  సమర్పించారు. 

జీఎన్ మోంగ, వికార్ రసూల్ మీడియాతో మాట్లాడుతూ, తాము తమ పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. జమ్మూ-కశ్మీరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి జీఏ మిర్‌ను మూడేళ్ళ కాలానికి నియమిస్తున్నట్లు తమకు గతంలో చెప్పారని, ఇప్పటికి ఏడేళ్ళు అవుతున్నా, ఆయనను మార్చడం లేదని అన్నారు. జమ్మూ-కశ్మీరులో కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చకపోతే తాము పార్టీ పదవులను నిర్వహించబోమని పార్టీ అధిష్ఠానానికి తెలిపామన్నారు. 20 రోజుల క్రితమే దీనికి సంబంధించిన లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించినట్లు చెప్పారు. 


Advertisement
Advertisement