హెచ్1బీ నిబంధనల్లో ట్రంప్ మార్పులు.. కోర్టు మెట్లెక్కిన సంస్థలు!

ABN , First Publish Date - 2020-10-20T19:28:54+05:30 IST

హెచ్1బీ వీసా విధానంలో ట్రంప్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కఠిన నిబంధనలను వ్యతిరేకిస్తూ అమెరికాలోని ప్రముఖ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికా ఛాంబర్ ఆప్ కామర్స్, నేషనల్ అసోసి

హెచ్1బీ నిబంధనల్లో ట్రంప్ మార్పులు.. కోర్టు మెట్లెక్కిన సంస్థలు!

వాషింగ్టన్: హెచ్1బీ వీసా విధానంలో ట్రంప్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కఠిన నిబంధనలను వ్యతిరేకిస్తూ అమెరికాలోని ప్రముఖ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికా ఛాంబర్ ఆప్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ (ఎన్ఏఎమ్) సహా ఇతర సంస్థలు.. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొలంబియా డిస్ట్రిక్ కోర్టులో సోమవారం రోజు పిటిషన్ దాఖలు చేశాయి. హెచ్1బీ వీసా విధానంలో కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నాయి. అమెరికాకు గతంలో కంటే ఇప్పుడే విదేశీ నిపుణుల అవసరం ఎక్కువగా ఉందని వెల్లడించాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే.. అమెరికా వ్యాప్తంగా ఉన్న చాల పరిశ్రమలు దెబ్బతింటాయని.. ఉద్యోగాల సృష్టికి ఆటంకం ఏర్పడుతుందని కోర్టుకు విన్నవించాయి. కొత్త నిబంధనలు అమలులోకి రాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. 


కాగా.. ఎన్నికల వేళ ఇమిగ్రేషన్ వీసాలపై ట్రంప్ సర్కార్ సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయం తెలిసిందే. ‘అమెరికన్ల ప్రయోజనాలను కాపాడే’ నెపంతో విదేశీ నిపుణులకు అడ్డుకట్ట వేశారు. హెచ్1బీ వీసా విధానంలో కఠిన నిబంధనలను చేర్చారు. ఈ క్రమంలో అంతర్గత భద్రతాసేవల విభాగం (డీహెచ్‌ఎస్).. ఏటా జారీ చేసే హెచ్1బీ వీసాల సంఖ్య తగ్గిపోయేలా ‘స్పెషల్ ఆక్యుపేషన్’ నిర్వచనాన్ని మార్చేయడంతోపాటు ఆన్‌సైట్ వర్క్ గడువును ఏడాదికి కుదిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా కొత్త నిబంధనలు 60రోజుల తర్వాత అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో పలు సంస్థలు ట్రంప్ సర్కార్‌ను ఛాలెంజ్ చేస్తూ కోర్టుకెక్కాయి. 

Updated Date - 2020-10-20T19:28:54+05:30 IST