Advertisement
Advertisement
Abn logo
Advertisement

నల్లతామర పురుగుతో మిరపకు తీవ్ర నష్టం

ముసునూరు, నవంబరు 30: నాటిన చేతులే తొలిగిస్తే.. అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి ఉద్యాన, వ్యవసాయ అధికారులు స్పందించారు.  నూజివీడు ఉద్యానశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసులు, మామిడి పరిశోధన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ జి.శ్రావంతి, మండల వ్యవసాయ అఽధికారి బండారు శివశంకర్‌ మంగళవారం గుడిపాడులో మిరప, పొగాకు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిరపలో నల్లతామర పురుగు ఉండటం వల్ల తెగులు ఆశించిందని, పొగాకులో అధిక వర్షాల వల్ల నాపకట్టు, బొంత తెగుళ్ల వచ్చినట్లు వారు గుర్తించారు. ఈ సందర్భంగా గతంలో ఎప్పుడు చూడని తెగుల వల్ల మిరప పంటలు తీవ్రంగా నష్టపోయాయని, ఈ వైరెస్‌ నివారణకు అనేక మందులు పిచికారి చేసిన ఉపయోగం లేకుండా పోయిందని రైతులు అధికారులకు వివరించారు. ఇప్పటికి వరకు కౌలు, పెట్టుబడితో కలిపి ఎకరానికి రూ. 60వేలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టిన మిరప కాయలు కోసే దశలో వైరెస్‌ వల్ల పూత, పింద పూర్తిగా రాలిపోవటంతో చేసేది లేక తోటలను దున్నివేస్తున్నామని రైతులు వాపోయారు. అలాగే పొగాకు మొక్కలకు సైతం నాపకట్టు తెగులు రావటంతో మొక్కలు చనిపోతున్నాయని, దీంతో తోటలను దున్నివేస్తున్నామని, ఎకరానికి కౌలు, పెట్టుబడి కలిపి రూ. 65వేలు ఖర్చు అయిందని రైతులు అధికారులకు వివరించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఏడీ శ్రీనివాస్‌కు వినత పత్రం అందజేశారు. 


    సమగ్ర నివేదిక పంపుతాం 

- శ్రీనివాసులు, ఏడీ, హార్టీకల్చర్‌

 మిరప పంటలకు నూతనంగా నల్లతామర పురుగు  ఆశించి, పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సీనియర్‌ శాస్త్రవేత్తలతో పంటలను పరిశీలిస్తున్నాం. ఈ వైరెస్‌ నివారణకు చేయిదాటిపోవటంతో పలుచోట్ల పంటలను దున్నివేస్తున్నారు. మండలంలో 600 నుంచి 700 ఎకరాల్లో మిరప సాగైయింది. అన్ని గ్రామాల్లో  పరిస్ధితి ఈ విధంగానే ఉంది. ఎకరానికి రూ.60 నుంచి 70వేల వరకు రైతు నష్టపోయారు. అలాగే పొగాకు రైతు వర్షాలకు తీవ్రంగా నష్టపోయాడు. క్షేత్రస్థాయిలో పరిస్ధితిపై సమగ్ర నివేదికను కమిషనర్‌కు పంపిస్తాం.Advertisement
Advertisement