అన్నదాతకు భరోసా దక్కేనా?

ABN , First Publish Date - 2020-10-17T06:41:28+05:30 IST

సమృద్ధిగా వర్షాలు కురిశాయని పంట చేతికి వస్తుందని అశలు నింపుకున్న అన్నదాతలను వాయుగుండం వారి ఆశలను నిలువునా ముంచేసింది

అన్నదాతకు భరోసా దక్కేనా?

భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం

పరిహారంపై రైతుల్లో అయోమయం

పంట నష్టం సర్వేలో అధికారులు... పరిశీలనలో ప్రజాప్రతినిధులు 

జిల్లాలో రెండు రోజుల్లోనే 6,390 ఎకరాల్లో పంట నష్టం 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సమృద్ధిగా వర్షాలు కురిశాయని పంట చేతికి వస్తుందని అశలు నింపుకున్న అన్నదాతలను వాయుగుండం వారి ఆశలను నిలువునా ముంచేసింది. ఈ సీజన్‌లో సగటు వర్షాల కంటే అత్యధికంగా కురవడంతో పంటలు నీటిపాలయ్యాయి. జిల్లాలో అల్పపీడన ప్రభావంతో వరుసగా కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లోనే పంట నష్టం వాటిల్లింది. ఇటీవల కురిసిన వర్షానికి 6,390 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ నష్టం ఇంకా ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మండలాల్లో రైతులు వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని అందోళన చెందుతున్నారు. పరిహారం ఏ మేరకు వస్తుందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. 


నేలవాలిన వరి... నల్లబడిన పత్తి 

జిల్లాలో రైతులు నియంత్రిత సాగు లక్ష్యంగా ముందడుగు వేశారు. భూగర్భ జలాలు ఆశాజనకంగా మారడంతో 2.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అత్యధికంగా లక్షా 37 వేల 520 ఎకరాల్లో వరి, 97,839 ఎకరాల్లో పత్తి పంట వేసుకున్నారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతుండడంతో రైతులు వరి కోతలు, పత్తి ఏరడం వైపు దృష్టి పెట్టిన క్రమంలోనే వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వాయుగుండం ప్రభావంతో 135 గ్రామాల్లో 5,671 ఎకరాల్లో వరి పంట, 819 ఎకరాల్లో పత్తి, దెబ్బతిన్నట్లు అంచనాలు వేశారు. 4,171 మంది రైతులు నష్టపోయారు.  పంట నష్టంలో ఎల్లారెడ్డిపేట మండలంలో 17 గ్రామాల్లో 576 ఎకరాల్లో వరి, 115 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది.


గంభీరావుపేట మండలంలో ఎనిమిది గ్రామాల్లో వరి 495 ఎకరాలు, పత్తి 60 ఎకరాలు, తంగళ్లపల్లిలో 13 గ్రామాల్లో వరి 665 ఎకరాలు, పత్తి 70 ఎకరాలు, చందుర్తిలో 11 గ్రామాల్లో వరి 230 ఎకరాలు, పత్తి 20 ఎకరాలు, కోనరావుపేటలో 14 గ్రామాల్లో వరి 420 ఎకరాలు, పత్తి 30 ఎకరాలు, ముస్తాబాద్‌ పది గ్రామాల్లో వరి 850 ఎకరాలు, పత్తి 110 ఎకరాలు, వేములవాడలో 8 గ్రామాల్లో వరి 117 ఎకరాలు, పత్తి 165 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 13 గ్రామాల్లో వరి 274 ఎకరాలు, ఇల్లంతకుంట మండలంలో 21 గ్రామాల్లో వరి 825 ఎకరాలు, రుద్రంగిలో రెండు గ్రామాల్లో వరి 250 ఎకరాలు, పత్తి 200 ఎకరాలు, సిరిసిల్లలో 5 గ్రామాల్లో వరి 254 ఎకరాలు, బోయినపల్లిలో ఏడు గ్రామాల్లో వరి 614 ఎకరాలు, వీర్నపల్లిలో ఆరు గ్రామాల్లో వరి 61 ఎకరాలు, పత్తి 48 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 


రైతులూ అధైర్య పడవద్దు... ఆదుకుంటాం

గంభీరావుపేట: అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై సమగ్రంగా సర్వే చేయించి, ఆదుకుంటామని, రైతులు అధైర్య పడద్దని రాష్ట్ర టెస్కాబ్‌ చెర్మన్‌ కొండూరు రవీందర్‌రావు హామీ ఇచ్చారు. గంభీరావుపేట మండలం నాగంపేట, దమ్మన్నపేట. మల్లుపల్లె, జగదాంబతండ తదితర గ్రామాల్లో శుక్రవారం రవీందర్‌రావు పర్యటించి, పంట నష్టాలను పరిశీలించారు.  గ్రామాల వారీగా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి, నివేదికను జిల్లా అధికారులకు అందజేయాలన్నారు. గ్రామాల్లో వరి పంట దెబ్బతిన్న పొలాల వద్దకు వెళ్ళి, రైతుల నుండి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు.  ఎంపీపీ వంగ కరుణాసురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయలక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు హైమద్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచ్‌ బాలరాజు, ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు రాజేందర్‌ ఉన్నారు.  


ఇల్లంతకుంట: రైతులారా అధైర్యపడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ భరోసా నిచ్చారు. మండలంలోని పెద్దలింగాపూర్‌, అనంతగిరి, తిప్పాపూర్‌ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈసందర్బంగా రసమయి మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలపరిషత్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జడ్పీవైస్‌ చైర్మెన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, ఏఎమ్‌సీ చైర్మెన్‌ వేణురావు, సెస్‌డైరెక్టర్‌ అయిలయ్య, ఫ్యాక్స్‌చైర్మెన్‌ తిరుపతిరెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచ్‌లు గొడిశెల జితేందర్‌గౌడ్‌, పల్లె నర్సింహ్మరెడ్డి, దమ్మని లక్ష్మిలక్ష్మణ్‌, ఎంపీటీసీలు స్వప్నకర్ణాకర్‌రెడ్డి, పర్శరాం, పుష్పలత, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ పాల్గొన్నారు.


కోనరావుపేట: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల రైతులను ఆదుకుంటామని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం పరిశీలించారు. ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సెస్‌ డైరెక్టర్‌ దేవరకొండ తిరుపతి, సింగిల్‌విండో చైర్మన్‌లు బండ నర్సయ్య, రామ్మోహన్‌రావు, మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఏఓ వెంకటరామవ్వ తదితరులు పాల్గొన్నారు.


ఎల్లారెడ్డిపేట: మండలంలోని బొప్పాపూర్‌లో దెబ్బతిన్న పంటలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం  జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుగోలు చేసి ఆదుకుంటామన్నారు. ఎంపీపీ రేణుక, ఏఎంసీ ఛైర్మన్‌ నర్సింహారెడ్డి, ప్యాక్స్‌ ఛైర్మన్‌ కృష్ణారెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ శంకర్‌, నాయకులు కృష్ణహరి, చంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కిషన్‌, నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-10-17T06:41:28+05:30 IST