ఇలాగే వదిలేస్తారా?

ABN , First Publish Date - 2021-04-12T08:24:23+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ కమ్ముకొస్తుండటంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ముందస్తు జా గ్రత్తలు తీసుకుంటున్నాయి. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

ఇలాగే వదిలేస్తారా?

  • కరోనా కట్టడిలో తీవ్ర నిర్లక్ష్యం
  • ఇతర రాష్ట్రాల్లో చర్యలు కట్టుదిట్టం
  • మన రాష్ట్రంలో నిబంధనలు గాలికి 
  • ప్రభుత్వ నిర్లిప్తతతో కేసులు పైపైకి 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కరోనా సెకండ్‌ వేవ్‌ కమ్ముకొస్తుండటంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ముందస్తు జా గ్రత్తలు తీసుకుంటున్నాయి. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మాస్క్‌తో పాటు భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్తాయి లాక్‌డౌన్‌ అమలు చేయలేరు. వైరస్‌ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చే యడంతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచాల్సి ఉంది. మాస్క్‌ పెట్టుకోకపోతే జరిమానా వేస్తామన్నారు. అది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. బస్సులు, బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుంపులుగా ఉంటున్నా వారిని నియంత్రించడం లేదు.


ఇతర రాష్ట్రాల్లో ఇలా... 

తెలంగాణలో రోజుకు సగటున 1,500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్క్‌ తప్పనిసరి చేశారు. మాస్క్‌ లేకుండా బయటకొచ్చేవారిపై విపత్తు చట్టప్రకారం జరిమానా లు విధిస్తున్నారు. మంత్రులు, అధికారులు మాస్క్‌లు ధరిస్తున్నారు. విద్యాసంస్థలను మూసివేశారు. ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతిచ్చారు. కరోనాపై నిర్లక్ష్యం వద్దని, రాష్ట్రంలోకి వచ్చేవారికి ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఒడిసాలోనూ మాస్క్‌ తప్పనిసరి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం నిబంధన అమలు చేస్తున్నారు. తమిళనాడులో మతపరమైన, ధార్మిక సమావేశాలు రద్దుచే శారు. గతంలో కరోనాకు కేంద్ర బిందువుగా ఉన్న కోయంబేడు మార్కెట్‌లో రిటైల్‌ వ్యాపారాలను నిలిపివేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో 50శాతం ఆక్యుపెన్సీ అనుమతిస్తున్నారు.


కర్ణాటకలో తొలినుంచి కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మాస్క్‌తో పాటు భౌతిక దూరం పాటించనివారిపై చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరుతో పాటు మరో 10నగరాల్లో రాత్రి 10నుంచి ఉదయం 5గంటల వర కు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేరళ కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చేవారిని కనీసం 10 రోజులు క్వా రంటైన్‌లో ఉంచుతోంది. మాస్క్‌ తప్పనిసరి చేయడంతో పాటు కరోనా కట్టడి నిబంధనల అమలుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. మహారాష్ట్రలో బీచ్‌లను మూసివేశారు. లాక్‌డౌన్‌ విధించడానికి సర్కారు సన్నహాలు చేసుకుంటోంది.  


మరి ఏపీలో.... 

మాస్క్‌ తప్పనిసరి నిబంధన అమలు కావడంలేదు. అసలు మాస్క్‌ పెట్టుకోకపోయి నా అడిగేవారు లేరు. బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, కూరగాయల మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో జనం గుంపులుగా తిరుగుతున్నా రు. పాఠశాలల సమయాల్లో కోత విధించారు. ఒక్కపూట బడి అన్నారు. ఆచరణలో అది పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు సాయంత్రం వరకు నడుస్తున్నాయి. విద్యార్థులకు లక్షణాలు కనిపించినా గుట్టుగా ఉంచుతున్నారు. పాఠశాలల్లో కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తున్నారో, లేదో అని తనిఖీ చేస్తున్న సందర్భాలు ఎన్నో అధికారులకే తెలియాలి.


రాష్ట్రంలో రోజూ సగటున 3వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 3,495 కొత్త కేసులు వెలుగుచూశాయి. యాక్టివ్‌ కేసులు 20వేలు దాటేశాయి. బయటినుంచి రాష్ట్రంలోకి వస్తున్నవారికి పరీక్షలు నిర్వహించి, లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌ చేయాల్సి ఉంది. కానీ కరోనా ఉన్నవారు స్వేచ్ఛగా రాష్ట్రంలోకి వచ్చి, వెళ్తున్నారు. పరీక్షల నిర్వహణతో పాటు వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 


రాష్ట్రాలలో కరోనా నియంత్రణ.. ఆంక్షల తీరు

Updated Date - 2021-04-12T08:24:23+05:30 IST