శభాష్‌.. రుద్ర రచన!

ABN , First Publish Date - 2022-09-20T07:55:35+05:30 IST

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ...

శభాష్‌.. రుద్ర రచన!

  • అనాథాశ్రమంలో ఉంటూ ఇంజినీరింగ్‌ పూర్తి.. 
  • 4 ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక
  • రుద్ర రచనను అభినందించిన కేటీఆర్‌
  • గతంలో ఆర్థికసాయం అందించిన మంత్రి


హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, అనాథాశ్రమంలో ఉంటూ ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేసింది ఆ యువతి. అంతేకాదు.. ఒకేసారి నాలుగు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికై ఔరా అనిపించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆమెను అభినందించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం తండ్రియాలకు చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాలసదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్‌ లోని స్టేట్‌ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్‌ పూర్తి చేసింది. ఈసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు సంపాదించింది. అయితే, రుద్ర రచన ఆర్థిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కేటీఆర్‌.. ఆమెను ప్రగతి భవన్‌ పిలిపించుకొని 2019లో ఆర్థిక సాయం అందించారు. ఇటీవల జరిగిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో రుద్ర రచన నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించింది. ఈ సందర్భంగా ఆమె సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి, తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్‌కు రాఖీ కట్టింది. జీవితంలో ఎదురైన కష్టాలను సవాల్‌గా స్వీకరించి, నాలుగు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన రచన యువతకు ఆదర్శమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో సివిల్‌ సర్వెంట్‌ కావాలన్న రుద్రరచన లక్ష్యానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-09-20T07:55:35+05:30 IST