సృజనాత్మక సంవేదనలకు సంకెళ్ళా!?

ABN , First Publish Date - 2021-05-06T06:04:53+05:30 IST

కొవిడ్‌ సందర్భంలో వ్యక్తికీ, సమూహానికి మధ్య ఆంక్షలు తీవ్రమైన వేళ నిషిద్ధ రాజముద్రలు కూడా వెంటాడుతున్నాయి....

సృజనాత్మక సంవేదనలకు సంకెళ్ళా!?

కొవిడ్‌ సందర్భంలో వ్యక్తికీ, సమూహానికి మధ్య ఆంక్షలు తీవ్రమైన వేళ నిషిద్ధ రాజముద్రలు కూడా వెంటాడుతున్నాయి. అనేక సామాజిక, సాంస్కృతిక నిషేధాలున్న ప్రపంచం మనది. వాటికి వ్యతిరేకంగా సాగుతున్న పెనుగులాటకు ఆధునిక రాజ్యం ఆలంబనగా నిలుస్తుందా? లేక అదే కొత్త నిషేధాలను తీసుకొస్తుందా? మనకు సామాజిక నిషేధాల పట్ల ఉన్న ఉమ్మడి అవగాహనలు, వైఖరులు రాజ్య నిషేధాల మీద ఉన్నాయా? 


ఎప్పుడు ఏ మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని దుఃఖ సన్నివేశంలో విరసం మరోసారి నిషేధానికి గురైంది. ఈసారి ఒంటరిగా కాదు. పదిహేను సంఘాల సరసన ఈ గౌరవం దక్కించుకుంది. మనుషులు కలవడానికి, కలిసి ఆలోచించడానికి వీల్లేని కరోనా కాలంలో ఈ నిషేధం ఏ ఒంటరి భావోద్వేగాలను పలుకుతున్నది? ఏ అర్థాలను వినిపిస్తున్నది? మహాద్భుతమైన సామూహిక భవిష్యత్తు గురించి స్వప్నాలు చిట్లిపోతున్నాయని కవిత్వం రాసేవాళ్లు మన చుట్టూ ఉన్నారు. కానీ ఈ విషాద ఉద్విగ్న స్థితి కూడా అనేకానేక వర్ణ ఛాయల్లో తొణికిసలాడుతూ రేపటికి సిద్ధమవుతున్నది. మన చుట్టూ సాగుతున్న పెనుగులాటకు ప్రతిక్రియగా ఈ నిషేధం వచ్చిందని చెప్పవలసిన కలనేత కాలమిది. అయినా సరే ఈ రెండోసారి నిషేధంతో, దాని పూర్వ రంగ పరిణామాలతో మన కలలేమైనా చెదిరిపోతున్నాయా? అని ఎవరైనా అడగవచ్చు. నిజంగానే ఈ నిషేధం రాజ్య కర్కశత్వానికి తాజా ఉదాహరణ మాత్రమే. ఇది కేవలం భిన్నాభిప్రాయ స్వరాలను నొక్కడంగా చూసి వదిలేద్దామా? లోతుల్లోకి తొంగి చూస్తే ఈ నిషేధం ఏ స్వప్నాలనూ దెబ్బతీయడం లేదు. సరికదా, అచంచలమైన నమ్మకాన్ని ప్రోది చేస్తున్నది. 


‘యూరప్‌ను కమ్యూనిజం అనే భూతం ఆవహించిందని’ కమ్యూనిస్టు ప్రణాళికలోని తొలి వాక్యం చెప్పినట్లు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మావోయిస్టు ‘భూతం’ భయపెడుతోంది. మార్క్స్, ఏంగెల్స్ ఒక చారిత్రక సత్యాన్ని అత్యద్భుత మంత్ర వాస్తవ నుడికారంతో చెప్పారు. పూర్తి భిన్నమైన స్థితిలోనే కావచ్చు, ఇప్పుడు ఈ పోలిక మన దేశానికి బాగా సరిపోతుంది. అందుకే ఈ నిషేధం, మనమంతా జీవిస్తున్న ఈ కాలపు పరమ అసంబద్ధ, అధి వాస్తవ, వికృత, అమానవీయ సందర్భాన్ని కూడా ఎత్తి చూపుతోంది. ఈ నిషేధంతో అందరినీ భయంలోకి, మౌనంలోకి, పరాయితనంలోకి తోసేద్దామని ప్రభుత్వం అనుకుంటోంది కానీ, ఈ నిషేధపు చీకట్లలోని వెలుగు రేఖలకు అది డిస్ట్రర్బ్‌ అయిపోతోంది. తెలంగాణలో విరసం సహా పదహారు సంఘాల నిషేధం ద్వారా ప్రభుత్వం అన్నిటినీ చట్టం పరిధిలోకి తీసుకువెళ్లాలనుకుంటోంది. అందరినీ మావోయిస్టు వ్యూహం- ఎత్తుగడల్లోకి కుక్కి నిషేధాల మాటున భావజాల యుద్ధాన్ని అంతిమ దశకు చేర్చాలని ప్రభుత్వం అనుకుంటోంది. 


2005లో విరసాన్ని నిషేధించినప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉన్నది. ఈ పదిహేనేళ్లలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం తీవ్రమైంది. సంస్కృతి, రాజకీయార్థికం కలిసిన పాలకుల వ్యూహం ఇప్పుడు దేశమంతా విస్తరిస్తోంది. తెలంగాణలో ప్రజాసంఘాల నిషేధం అందులో ఒకటి మాత్రమే. దండకారణ్యంలో వైమానిక దాడుల దగ్గరి నుంచి, మూడు వ్యవసాయ చట్టాల దాకా ఈ వ్యూహంలో ఎన్నో ఉన్నాయి. ఎత్తుగడ ఏమంటే విరసం తదితర ప్రజాసంఘాల మీద హింసారోపణలు చేయడం. యాభై ఏళ్ల సాహిత్య సాంస్కృతిక ఆచరణను బోనెక్కించి హింసోన్మాదం అనడం. హింస పెచ్చరిల్లిపోయిన ఈ వ్యవస్థలో ఇది ఎంత మామూలు విషయం! 


ఇదంతా మనకెందుకు? వాళ్ల తలనొప్పి అని మేధావులు అనుకొనేలా చేయడమే ఈ ఎత్తుగడ విజయం. ప్రతి సమూహం తనదైన వైఖరులు తీసుకోవడం మంచిదే కావచ్చుకానీ పాలకులకు ఒక వ్యూహం ఎత్తుగడలు ఉన్నాయని తెలియపోవడమే అసలు సమస్య. ఇది చాలా సులభంగా అవతలివాళ్లకు పరిష్కార మార్గమైపోయింది. తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది విప్లవ రచయితల సంఘాన్ని మాత్రమే కాదు. మనుషులకు ఉండగల అన్ని తాత్విక వైఖరులను, మనుషులకే సాధ్యమయ్యే కాల్పనిక వ్యక్తీకరణలను. సహజంగానే దీన్ని విరసం దగ్గరే ప్రభుత్వం ఆరంభించింది. ఇప్పటికే అది అనేక దశలను దాటి నిషేధం దగ్గరికి చేరింది. యాభై ఏళ్లుగా తన దృక్పథం, సృజన, ధిక్కారం వల్ల సాహిత్య మేధో రంగాల్లోనే ఎన్నో ఆరోపణలకు, అపప్రథలకు, అపోహలకు లోనైన విప్లవ రచయితల సంఘానికి ఇది గర్వకారణమే. వేర్వేరు ఆచరణ రూపాల వల్ల మౌలికంగా విరసం తెలుగు సమాజాల్లో తీవ్రమైన భావజాల యుద్ధాన్ని నిర్వహిస్తోందనడానికి ఫాసిస్టు సందర్భంలో రెండోసారి నిషేధానికి గురి కావడం ఒక ఉదాహరణ మాత్రమే. మావోయిస్టు వ్యూహం-–ఎత్తుగడలు సమస్య కాదు. ఈ అణచివేతలోని, విధ్వంసంలోని పాలక వ్యూహం చాలా ప్రమాదకరమైనది. అందులో దీర్ఘకాలిక పథకం ఉంది. అది విరసం దగ్గరే ఆగిపోదు. అన్ని ప్రగతిశీల దృక్పథాలు, విశ్వాసాలుగల వాళ్లందరినీ బహిష్కృత మానవులుగా ప్రకటించడానికి రంగాన్ని సిద్ధం చేశారు. విప్లవ, ప్రగతిశీల కళా సాహిత్యాలపట్ల ఆందోళనతోనే రాజ్యం ఈ భావజాల యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. మానవ సమాజం మీద, మానవ నాగరికత మీద, ప్రజలు నిర్మించుకున్న సాంస్కృతిక ప్రపంచం మీద దాడి చేయబోతున్నది. ఆలోచన, సృజన అనే మానవ ప్రక్రియల పునాదుల్లోకి వెళ్లిపోతున్నది. కళాత్మక వ్యక్తీకరణలను హింస అని బరితెగించి చెప్పడమే గాక దాన్ని చట్టపరిధిలోకి తీసుకు వెళ్ళుతున్నది. ఒకసారి సృజనాత్మక సంవేదనలు చట్టాల సంకెళ్లలోకి వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి. ఇదెంత తీవ్ర వైరుధ్యంగా మారుతుంది? 


యాభై ఏళ్లుగా విరసం ప్రయాణమంతా వైరుధ్యాల మధ్యే సాగింది. వైరుధ్యాల అవగాహనే విరసం భవిష్యత్తుకు భరోసా. కాబట్టి ఈ రెండో నిషేధం ఊహించనిది ఏమీ కాదు. విరసం మొదటిసారి నిషేధానికి గురైనప్పుడే రాబోయే పరిస్థితులను వివరించింది. దీన్ని ఎదుర్కోడానికి సిద్ధంగానే ఉంది. విపత్తు సమాజానిదీ, సాహిత్య మేధో రంగాలదీ కదా. మరి అక్కడి సమాయత్తం ఎలా ఉంది? ఎలా ఉండాలి? సరిహద్దులు లేని ఆలోచనలకు మనం ఇప్పటికైనా సిద్ధమా? 

పాణి

Updated Date - 2021-05-06T06:04:53+05:30 IST