స్వతంత్రతకు సంకెళ్లు

ABN , First Publish Date - 2021-11-17T06:16:44+05:30 IST

మరో పదిహేను రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉండగా, నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులతో కీలక నిర్ణయాలు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ సంచాలకుల పదవీ కాలపరిమితిని ఐదేళ్ళకు...

స్వతంత్రతకు సంకెళ్లు

మరో పదిహేను రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉండగా, నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులతో కీలక నిర్ణయాలు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ సంచాలకుల పదవీ కాలపరిమితిని ఐదేళ్ళకు పెంచుతూ ప్రభుత్వం చేసిన నిర్ణయం విపక్షాల విమర్శలకు గురవుతోంది. మరీ ముఖ్యంగా, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవి నేటితో ముగియబోతుండగా ఈ ఆర్డినెన్సు రావడం అనుమానాలకు తావిస్తున్నది. ఆయన రెండేళ్ళ పదవీకాల పరిమితి గత ఏడాదిలో ముగిసినప్పుడు మోదీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. అందుకు వీలుగా 2018నాటి నియామక ఉత్తర్వులను రెండేళ్లకు కాక మూడేళ్ళకు వర్తించేట్టుగా వెనక్కుపోయి సవరించింది. ఆ తరువాత ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం ముందుకు పోయినప్పుడు, ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనలేదు కానీ, 2021నవంబరు 17 తరువాత మిశ్రా ఆ పదవిలో కొనసాగడానికి వీల్లేదని ఆదేశించింది. ఇప్పుడు కేంద్రం ఆర్డినెన్సుతో మిశ్రా ఆ పదవిలో కొనసాగడానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఇలా వమ్ముచేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 


న్యాయస్థానాల్లో దీనిని సవాలు చేయనిదే మోదీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణులకు అడ్డుకట్టవేయలేమని విపక్షాలకు కాంగ్రెస్ హితబోధ చేస్తున్నది. ఇప్పటివరకూ రెండేళ్ళకు మాత్రమే పరిమితమైన పదవీకాలం ఇకపై ఐదేళ్ళకు విస్తరించడమే కాక, ఏడాదికొకసారి చొప్పున మూడుసార్లు గడువు పొడిగించుకొనేందుకు ఈ ఆర్డినెన్సుల ద్వారా పాలకులకు అవకాశం ఏర్పడింది. ఈ సంస్థలకు అధిపతులుగా ఉంటున్నవారిని తమ నియంత్రణలో పెట్టుకోవడానికి ప్రభుత్వం దీనిని తాయిలంలాగా వాడబోతున్నదనీ, ప్రతిపక్ష నాయకులను ఎంతగా వేధిస్తే అన్ని ఎక్స్ టెన్షన్లు పొందవచ్చునని కేంద్రం ఊరిస్తున్నదని విపక్షాల విమర్శ. ఈ సంస్థల అధిపతుల ఉద్యోగ కాలాన్ని పెంచడం దేశ ప్రయోజనాల రీత్యా అవసరమన్న బీజేపీ నాయకుల వాదనే నిజమనుకుంటే పార్లమెంటులో చర్చించి ఆ చట్ట సవరణలేవో చేస్తే సరిపోయేది. కానీ, శీతాకాల సమావేశాలు మరో పదిహేనురోజుల్లో మొదలుకాబోతున్న తరుణంలో ఈ ఆర్డినెన్సు దారి ఎంచుకుంటే మిశ్రాను కాపాడుకురావడంతో పాటు ఇంకా ఎన్నెన్నో దురుద్దేశాలున్నాయన్న అనుమానాలు రాకపోవు. ఆర్డినెన్సులు చేయాల్సింది అసాధారణ పరిస్థితుల్లోనే అని సుప్రీంకోర్టు చెబితే, దాని శాసనాలను, ఆదేశాలను తిరగదోడడానికి కూడా పాలకులు అదే మార్గాన్ని ఎంచుకొని న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారు. వినీత్ నారాయణ్ కేసు సందర్భంలో ఈ సంస్థల అధిపతులకు రెండేళ్ళ కనీస కాలపరిమితిని విధిస్తూ ప్రలోభాలు, ప్రభావాలు, ఆకర్షణలకు అతీతంగా వారు ఉండాలన్న సుప్రీంకోర్టు సదాశయాన్ని ఈ ఆర్డినెన్సులు వమ్ముచేస్తున్నాయి. కీలకస్థానాల్లో ఉన్న ఈ అధికారులను తమ అధీనంలోకి తెచ్చుకొనేందుకు ఈ చర్య పాలకులకు ఉపకరిస్తుందన్న విమర్శ కాదనలేనిది. సీబీఐ, ఇడిలు గతంలో కంటే ఎక్కువగా పాలకుల చేతిలో ఆయుధాలుగా మారిన విషయం తెలిసిందే. అధికారపక్ష నేతలను కాపాడుకురావడం, విపక్ష నాయకులను వేటాడటమే కర్తవ్యంగా వాటి వ్యవహారం సాగుతున్నది. ఇక, ఆయా సంస్థల అధిపతుల కనీస పదవీకాలం విషయంలోనే న్యాయస్థానం పట్టుదలగా ఉన్నదనీ, గడువు పొడిగింపు విషయంలో కాదన్నది నిజమే. సుప్రీంకోర్టు ప్రధానోద్దేశం అధికారంలో ఉన్నవారి దయాదాక్షిణ్యాలమీదనో, కోపతాపాలమీదనో ఆధారపడి ఈ సంస్థల అధిపతుల పదవీకాలం ఉండకూడదన్నది. ఇప్పుడు వారి పదవీవిరమణతో నిమిత్తం లేకుండా, ఏ యేటికాయేడు పదవీకాలాన్ని పొడిగించగలిగే అధికారం ప్రభుత్వం దఖలుపరుచుకున్నప్పుడు ఆ సదాశయం నెరవేరదు. ఈ కీలకమైన సంస్థల అధిపతులను ఒకేమారు ఐదేళ్ళపాటు కొనసాగేట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఎవరికీ ఏ అభ్యంతరం ఉండేది కాదేమో. ఏడాదికోమారు పొడిగింపు అధికారం పాలకుల చేతుల్లో ఉన్నందునే ఈ అనుమానాలు, కోర్టుకెక్కాలన్న ఆలోచనలు.

Updated Date - 2021-11-17T06:16:44+05:30 IST