దుమ్మురేపిన షఫాలీ

ABN , First Publish Date - 2021-06-18T09:14:35+05:30 IST

అరంగేట్ర మ్యాచ్‌లోనే షఫాలీ వర్మ (152 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96), స్మృతి మంధాన (78) అర్ధ శతకాలతో రాణించడంతో.. ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో ఏకైక టెస్టులో భారత్‌ ఒక దశలో దీటుగానే బదులిచ్చింది.

దుమ్మురేపిన షఫాలీ

త్రుటిలో సెంచరీ మిస్‌ ఫ మంధాన హాఫ్‌ సెంచరీ 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 187/5

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు


బ్రిస్టల్‌: అరంగేట్ర మ్యాచ్‌లోనే షఫాలీ వర్మ (152 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96), స్మృతి మంధాన (78) అర్ధ శతకాలతో రాణించడంతో.. ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో ఏకైక టెస్టులో భారత్‌ ఒక దశలో దీటుగానే బదులిచ్చింది. అయితే, ఆఖర్లో వరుస వికెట్లు కోల్పోయి డీలా పడింది. రెండో రోజైన గురువారం ఆటముగిసేసరికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లకు 187/5 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌ (4), దీప్తి (0) క్రీజులో ఉన్నారు. హీథర్‌ నైట్‌ (2/1) రెండు వికెట్లు పడగొట్టింది. అంతకుముందు 269/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ 396/9 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. సోఫియా (74 నాటౌట్‌) రాణించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు భారత్‌ 209 పరుగుల వెనుకంజలో ఉంది. 


ఆరంభం నుంచే జోరు..:

భారత ఇన్నింగ్స్‌లో టీనేజ్‌ ఓపెనర్‌ షఫాలీ ఆట హైలైట్‌ కాగా.. మరో ఓపెనర్‌ స్మృతి కూడా ఆమెకు సహకరిస్తూనే పటిష్ఠ పునాది వేసింది. 13వ ఓవర్‌లో స్కివర్‌ బౌలింగ్‌లో షఫాలీ సిక్స్‌ బాదడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో టీమిండియా టీ సమయానికి వికెట్‌ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. మూడో సెషన్‌లో 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రాస్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో షఫాలీ అవుటైంది. దీంతో తొలి వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ఇంగ్లండ్‌ బౌలర్లు పుంజుకోవడంతో భారత్‌ వరుసగా వికెట్లును కోల్పోయింది. స్కివర్‌ బౌలింగ్‌లో మంధాన పెవిలియన్‌ చేరగా.. పాండే డకౌటైంది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (2)ను ఎక్లిస్టోన్‌, పూనమ్‌ (2)ను నైట్‌ వెనక్కిపంపారు. 


సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 396/9 డిక్లేర్డ్‌ (హీథర్‌ నైట్‌ 95, సోఫియా డంక్లీ 74, బ్యూమాంట్‌ 66, అన్యా ష్రబ్‌సోల్‌ 47, స్నేహ్‌ రాణా 4/131, దీప్తి శర్మ 3/65).


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:

187/5 (షఫాలీ వర్మ 96, స్మృతి మంధాన 78, పూనమ్‌ రౌత్‌ 2, మిథాలీ రాజ్‌ 2, హర్మన్‌ప్రీత్‌ 4, హీథర్‌ నైట్‌ 2/1).

1 టెస్టుల్లో భారత్‌పై అత్యధిక స్కోరు (396) నమోదు చేసిన మహిళల జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు.

2 లాలా అమర్‌నాథ్‌ (1952) తర్వాత అతిపెద్ద వయస్సు (38 ఏళ్ల 204 రోజులు)లో టెస్టు వికెట్‌ తీసిన పేసర్‌ జులన్‌ గోస్వామి. 

Updated Date - 2021-06-18T09:14:35+05:30 IST