May 15 2021 @ 20:16PM

విజయ్‌తో లైవ్‌లో డ్యాన్స్ చేయించిన హీరో ఎవరో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో.. ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మాస్టర్’. ఈ చిత్రం 2021 సంక్రాంతికి విడుదలై.. మంచి విజయాన్నే అందుకుంది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను భారీగా కాకుండా చిన్న ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడడానికి స్టేజ్ ఎక్కగానే ‘వాతి కమింగ్’ మ్యూజిక్ ప్లే అవడం, దానికి విజయ్ స్టెప్ వేయడం.. ఆ తర్వాత సంగీత దర్శకుడు అనిరుధ్‌ని, సహనటుడు శాంతను స్టేజ్‌పైకి పిలిచి వారిని కూడా డ్యాన్స్ చేయమని విజయ్ అడగడం వంటివి జరిగాయి. స్టేజ్‌పై విజయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆడిటోరియం అదిరిపోయింది. విజయ్ సేతుపతి కూడా లేచి క్లాప్స్ కొట్టాడు. అయితే ఇలా విజయ్ స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం మొదటిసారేం కాదు. అంతకు ముందు ‘తుపాకి’ చిత్ర టైమ్‌లో కూడా విజయ్ స్టేజ్‌పై డ్యాన్స్ చేశాడు. కాదు కాదు ఓ స్టార్ హీరో అతనితో డ్యాన్స్ చేయించాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అనుకుంటున్నారు కదా..!

ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్. 2013వ సంవత్సరంలో చెన్నైలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌కు షారూఖ్ అతిథిగా హాజరయ్యారు. 2012లో విజయ్ నటించిన ‘తుపాకి’ చిత్రానికి అవార్డ్ వచ్చింది. ఆ అవార్డును షారూఖ్ చేతుల మీదుగా విజయ్‌ అందుకోవాలి. అయితే అవార్డ్ ఇవ్వడానికి స్టేజ్ పైకి వచ్చిన షారూఖ్.. విజయ్‌ని డ్యాన్స్ చేయాల్సిందిగా కోరాడు. విజయ్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. కానీ షారూఖ్ వదలలేదు. చివరికి అంత పెద్ద హీరో అడగడంతో కాదనలేక విజయ్.. డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతకు ముందెన్నడూ విజయ్ అలా లైవ్‌లో డ్యాన్స్ చేయలేదు. విజయ్ డ్యాన్స్ చేస్తుంటే.. షారుఖ్ కూడా ఆయనని అనుకరిస్తూ.. డ్యాన్స్ చేశారు. వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే.. ఇక అక్కడ వాతావరణం ఎలా ఉండి ఉంటుందో.. అర్థం చేసుకోవచ్చు. హోరెత్తిపోయిందంటే నమ్మాలి మరి. ఆ అవార్డ్ పంక్షన్ తర్వాత మళ్లీ విజయ్ లైవ్‌లో డ్యాన్స్ చేసింది ‘మాస్టర్’ ప్రీ రిలీజ్ వేడుకలోనే. విశేషం ఏమిటంటే.. ఈ వేడుకలో ఆయనని ఎవరూ డ్యాన్స్ చేయమని అడగలేదు. ఆ పాట మ్యూజిక్కే అతనితో స్టేజ్ మీద డ్యాన్స్ చేయించింది. అది విషయం.