విశ్వాసమే ఆమె ఆయుధం!

ABN , First Publish Date - 2020-09-30T06:06:49+05:30 IST

వయస్సు కొందరికి అనుభవాన్ని నేర్పుతుంది. మరికొందరిలో పోరాట పటిమను మేల్కొలుపుతుంది. నేతలుగా మారుస్తుంది. దాదాపు తొమ్మిది నెలల క్రితం దేశాన్ని కుదిపివేసిన పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న బిల్కిస్‌ బానో ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా టైమ్స్‌ పత్రిక విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బానోకు కూడా స్థానం దక్కింది...

విశ్వాసమే ఆమె ఆయుధం!

వయస్సు కొందరికి అనుభవాన్ని నేర్పుతుంది. మరికొందరిలో పోరాట పటిమను మేల్కొలుపుతుంది. నేతలుగా మారుస్తుంది. దాదాపు తొమ్మిది నెలల క్రితం దేశాన్ని కుదిపివేసిన పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న బిల్కిస్‌ బానో ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా టైమ్స్‌ పత్రిక విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బానోకు కూడా స్థానం దక్కింది. దాదీ ఆఫ్‌ షాహిన్‌బాగ్‌గా పేరుపొందిన 82 ఏళ్ల బానో మరో సారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.


ఒక చేతిలో జాతీయ జెండా.. మరో చేతిలో జపమాల.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు.. బిల్కిస్‌ బానో అనగానే ఈ చిత్రమే అందరికీ గుర్తుకొస్తుంది.  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిరసనల్లో బిల్కిస్‌ బానోది ఒక ప్రముఖ పాత్ర. తాము నమ్మిన సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియచెప్పటానికి వేల మంది మహిళలు షాహిన్‌బాగ్‌లో ధర్నా చేసేవారు. వీరిలో ప్రపంచం దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది బిల్కి్‌సబానోనే! ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌కు చెందిన బిల్కస్‌ బానో భర్త 11 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఆ తర్వాత ఆమె  తన కొడుకులు, మనవళ్లతో కలిసి షాహిన్‌బాగ్‌లో నివసిస్తోంది. ‘‘నేను చదువుకోవడానికి స్కూల్‌కు వెళ్లలేదు. ఖురాన్‌ మాత్రం చదువుతాను. నేను నమ్మిన సిద్ధాంతమే నాకు సంకల్పబలాన్ని ఇస్తోంది’’ అనే బానో- ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చేరుతుందని ఎవరూ ఊహించలేదు. ‘‘మా పోరు ఏ వ్యక్తిని ఉద్దేశించినది కాదు. ప్రభుత్వ నిర్ణయం తప్పు.. నేను ఇప్పటికీ ఆ మాటపైనే ఉన్నా. నిర్ణయం వెనక్కి తీసుకుంటేనే దేశానికి మంచి జరుగుతుంది’’ అంటారు బానో. తనతో పాటు ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో స్థానం సంపాదించుకున్న ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేయటం ఆమె వ్యక్తిత్వానికి ఒక ఉదాహరణ. 


‘‘నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు. నేను జన్మనివ్వకపోయినా అతను నా కొడుకే. దేవుడు అతడికి ఆయురారోగ్యాలు, సంతోషాన్ని ఇవ్వాలి’’ అంటారు బానో. తనకు టైమ్స్‌ గౌరవం దక్కడం ఆనందంగా ఉందనే బానో.. తానెప్పుడు ఇలాంటి సత్కారం లభిస్తుందని ఊహించ లేదంటారు. ‘‘దేవుడు ఎవరికి ఎలా గుర్తింపునిస్తాడో తెలియదు. అంతా దైవ కృప’’ అనే బానో అందరికీ మరింత స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుందాం.

Updated Date - 2020-09-30T06:06:49+05:30 IST