షహీన్‌బాగ్ నిరసనల్లో కీలక మలుపు..?

ABN , First Publish Date - 2020-02-23T00:43:27+05:30 IST

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న షహీన్‌బాగ్ నిరసనలకు పరిష్కారం కనుగొనేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తుల బృందం..

షహీన్‌బాగ్ నిరసనల్లో కీలక మలుపు..?

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న షహీన్‌బాగ్ నిరసనలకు పరిష్కారం కనుగొనేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తుల బృందం నిరసనకారులతో నాలుగో రోజైన శనివారంనాడు కూడా చర్చలు జరిపింది. అదే సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిరసనల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు గతంలో ఓ రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తాజాగా నిరసనకారులు తొలగించారు. రోడ్డును తెరిచారు.


డిసెంబర్‌లో షహీన్‌బాగ్ వద్ద సీఏఏ వ్యతిరేక ఆందోళన మొదలైనప్పటి నుంచి నొయిడా-కాలింది కుంజ్ రోడ్డు మూసేశారు.  చర్చల సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆ రోడ్డును పోలీసులే దిగ్బంధం చేశారని, ట్రాపిక్ రాకపోకలను సుగమం చేస్తూ దానిని తెరవవచ్చని నిరసనకారులు మధ్యవర్తులతో అన్నట్టు చెబుతున్నారు.


కాగా, రోడ్ నెంబర్-9 తెరుచుకోవడంపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, ఉవాళ ఉదయం కొందరు నిరసనకారులు రోడ్డును తెరిచారని, ఆ తర్వాత మరో గ్రూపు రోడ్డును మూసేసిందని, తిరిగి ఒక గ్రూపు ఒక చిన్న భాగాన్ని తెరిచిందని చెప్పారు. రోడ్డు తెరిచే విషయంలో నిరసనకారుల సమ్మతి ఉందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదన్నారు.


ఇదిలా ఉండగా, షహీన్‌బాగ్ నిరసనకారులు పలు డిమాండ్లను మధ్యవర్తుల ముందు ఉంచినట్టు తెలుస్తోంది.  నిరసన స్థలంలో కాల్పుల నేపథ్యంలో పోలీస్ ప్రొటక్షన్ కల్పించడంతో పాటు, జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్లపై కేసులు ఉపసంహరించుకోవాలని కూడా కోరినట్టు సమాచారం. అక్రమంగా రోడ్లు దిగ్బంధం చేయడంతో లక్షలాది మంది ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, దుకాణాలు మూతపడ్డాయని, పరిస్థితిని చక్కదిద్దేందుకు తక్షణం ఆదేశాలివ్వాలని ఇటీవల దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల మధ్యవర్తుల ప్యానల్‌ను నియమించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

Updated Date - 2020-02-23T00:43:27+05:30 IST