దిశ చట్టం ఉంటే నిందితులను ఉరితీయాలి

ABN , First Publish Date - 2020-11-30T05:42:36+05:30 IST

రాష్ట్రంలో దిశ చట్టం అమలులో ఉంటే షాహిదా హత్యా ఘటనలో నిందితులను 15 రోజుల్లో ఉరి తీయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

దిశ చట్టం ఉంటే నిందితులను ఉరితీయాలి
చాపిరిలో బాధిత కుటుంబంతో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న గఫూర్‌

షాహిదా కేసును సీబీఐకి అప్పగించాలి

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌ 

బాధితులకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

కళ్యాణదుర్గం, నవంబరు 29: రాష్ట్రంలో దిశ చట్టం అమలులో ఉంటే షాహిదా హత్యా ఘటనలో నిందితులను 15 రోజుల్లో ఉరి తీయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హత్యకు గురైన యువతి షాహిదా కుటుంబసభ్యులను ఆదివారం వారు మండలంలోని చాపిరి గ్రామంలో పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నా దిశ చట్టం ఎంతమంది నిందితులను శిక్షించిందని ప్రశ్నించారు. చట్టాలు ప్రజలను మభ్యపెట్టేందుకే తప్పా ప్రజారక్షణకు లేకుండాపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. షాహిదా ఘటనలో నిందితుడు రఘుపై బాధిత కుటుంబసభ్యులు ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటన్నారు. కళ్యాణదుర్గం రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే షాహిదా హత్య కేసు తప్పుదోవ పట్టిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన పోలీస్‌ అధికారిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ పాలనలో రాజ్యాంగ పరిరక్షణకు తావులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాజమండ్రి, నంద్యాల, రాజమహేంద్రవరం, చాపిరి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనల పరంపర కొనసాగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. చాపిరి ఘటనపై డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేసును నీరుగార్చేందుకు చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. షాహిదా తల్లి సతాన్‌బీ మాట్లాడుతూ తాను పేదరాలిని కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని బోరున విలపించారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు కూడా జరగకూడదన్నారు. నిందితులను ఉరితీసిన రోజే నాబిడ్డకు ఆత్మశాంతి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ మౌలానాముస్తాక్‌ అహమ్మద్‌, సీపీఎం నాయకులు  ఇంతియాజ్‌, నాగేంద్రకుమార్‌, ముస్కిన్‌, కసాపురం ఆంజినేయులు, ఆవాజ్‌ నాయకులు వలీ, మసూద్‌, బాబు, స్థానిక టీడీపీ నాయకులు దొడగట్టనారాయణ, బిక్కి గోవిందప్ప, మాదినేని మురళి, రామరాజు, గోళ్ల రమేష్‌, తలారి సత్యప్ప, రాజశేఖర్‌చౌదరి, శివన్న, శ్రీరాములు, అమరబిందు, నిర్మల, రమాదేవి, తాషాబద్రిన్‌, తులసమ్మ, తిమ్మోజమ్మ, పద్మ, రమణ, హనుమంతరెడ్డి, న్యాయవాది రామాంజినేయులు,  టీకేబీ ఇస్మాయిల్‌, రోషన్‌, నూర్‌మహమ్మద్‌, నాగరాజు, బ్రిజేస్‌, మధు, విరుపాక్షి, తిమ్మప్ప పాల్గొన్నారు.  


హంతకులను కఠినంగా శిక్షించాలి

గుంతకల్లు టౌన్‌ : షాహిదాను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా పట్టణ అధ్యక్షురాలు జ్యోతి డిమాండ్‌ చేశారు. ఐద్వా, ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం నిరసన చేపట్టారు. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి దారుణంగా హత్యచేశారన్నారు.నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో నాయకులు రంగమ్మ, లావణ్య, గాయత్రి, దాసరి శ్రీనివాసులు, జగ్గిలి రమేష్‌, మారుతీప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T05:42:36+05:30 IST