Abn logo
Sep 7 2021 @ 12:23PM

వైకాపా ప్రభుత్వం పన్నుల రూపంలో దాడులు చేస్తోంది: శైలజనాధ్

విజయవాడ: రోజురోజుకు వైకాపా ప్రభుత్వం ప్రజలపై రకరకాలుగా పన్నుల రూపంలో దాడులు చేస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాధ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక్కరోజు కూడా ప్రజలకు మేలు చేసే ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదన్నారు. అప్పు వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి సాగిలా పడుతుందన్నారు.


రైతులకు విద్యుత్ మీటర్లు పెడుతున్న దుర్మార్గపు ప్రభుత్వం ఇదని శైలజనాధ్ మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడం లేదని ఆరోపించారు. కనిపించే చార్జీలు కొన్ని... కనపడని ఛార్జీలు మరి కొన్ని అని, ఎందుకు విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయో అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నెల 13 తేదీన వైకాపా విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. ఒక విధానం కానీ.. పరిపాలన లేని ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తున్నామన్నారు. మంత్రి బుగ్గన చెప్పే నీతి కధలు, వాళ్ళ మనవళ్ళకు చెప్పుకోవాలని సూచించారు. ప్రజల ఆస్తులను అమ్ముకుని రోజువారీ ఖర్చులు పెట్టుకున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూస్తున్నామన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు, ప్రజలను పిండే పన్నులను వెనక్కి తీసుకోవాలని శైలజనాధ్ డిమాండ్ చేశారు.