చినుకుపడితే వణుకే!

ABN , First Publish Date - 2021-09-03T05:37:59+05:30 IST

ఏటా వరదలు వచ్చే సమయంలో గుర్తుకొచ్చే గ్రామం దబ్బపాడు. ఎల్‌ఎన్‌పేట మండలంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే కడపల గెడ్డ దాటాల్సి ఉంటుంది.

చినుకుపడితే వణుకే!
ఇటీవల వర్షాలకు రోడ్డుపై ప్రవహిస్తున్న కడపల గెడ్డ


చిన్నపాటి వర్షాలకే ఉప్పొంగుతున్న కడపల గెడ్డ

 దబ్బపాడు వాసులకు బయట ప్రపంచంతో సంబంధాలు కట్‌

ఎన్నికల హామీగా మిగులుతున్న వంతెన నిర్మాణం

 దశాబ్దాలుగా నెరవేరని కల! 

(ఎల్‌.ఎన్‌.పేట)

ఏటా వరదలు వచ్చే సమయంలో గుర్తుకొచ్చే గ్రామం దబ్బపాడు. ఎల్‌ఎన్‌పేట మండలంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే కడపల గెడ్డ దాటాల్సి ఉంటుంది. చిన్నపాటి వర్షాలకే ఈ గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. వరదలు వచ్చే సమయంలో చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వరద నీరు తెగే వరకూ గ్రామస్థులు జల దిగ్బంధంలో ఉండాల్సిందే. గెడ్డ వద్ద రహదారిపై వంతెన నిర్మిం చాలని గ్రామస్థులు దశాబ్దాలుగా కోరుతూ వస్తున్నారు.  మొక్కని అధికారులు లేరు..వేడుకోని ప్రజాప్రతినిధులు లేరు. కానీ ఎవరూ కనికరించడం లేదు. అలికాం-బత్తిలి రోడ్డు నుంచి తురకపేట జంక్షన్‌ మీదుగా దబ్బపాడుకు రహదారి ఉంది. వాడవలస, మిరియాపల్లి మీదుగా తిరిగి లక్ష్మీనర్సుపేటకు రహదారికి చేరుకుంటుంది. సుమారు 10 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిపై గతంలో శ్రీకాకుళం, పాలకొండ డిపోలకు చెందిన ఆర్టీసీ సర్వీసులు నడుస్తుండేవి. వంశధార ఇవతల గ్రామాల ప్రజలు శ్రీముఖలింగం వెళ్లాలంటే ఇదే ప్రధాన మార్గం. మిరియాబిల్లి నుంచి పడవల్లో నది దాటి శ్రీముఖలింగేశ్వరుడ్ని దర్శించుకుంటారు. ఏటా చక్రతీర్థ స్నానాలకు ఎక్కువ మంది ఈ మార్గం మీదుగా వెళ్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రోడ్డుపై కడపల గెడ్డ వద్ద బ్రిడ్జి నిర్మించాల్సి ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేకుంటే ఐదారు గ్రామాల ప్రజలు ఉద్యమించడానికి కార్యాచరణ చేపడుతున్నారు. 

అరచేతిలో ప్రాణాలు

వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతుంటాం. ప్రమాదకర స్థితిలో కడపల గెడ్డ దాటుతుంటాం. బ్రిడ్జి నిర్మించాలని దశాబ్దాలుగా కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. గతంలో ఆర్టీసీ బస్సులు సైతం నడిచేవి. ఇప్పుడు అవి కూడా లేవు. కనీసం వంతెన నిర్మించి కష్టాల నుంచి గట్టెక్కించాలి.

-ఎం.లక్ష్మణరావు, దబ్బపాడు




Updated Date - 2021-09-03T05:37:59+05:30 IST