నువ్వేం పని చేయొద్దు.. నేనే చేస్తా.. ఎక్కడికైనా వెల్దామా!

ABN , First Publish Date - 2021-11-16T04:33:34+05:30 IST

నారాయణ పేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ కార్యాలయ అధికారి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తు న్నాడని ఆరోపణలొస్తున్నాయి.

నువ్వేం పని చేయొద్దు.. నేనే చేస్తా.. ఎక్కడికైనా వెల్దామా!

నారాయణపేటలో మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్న ఓ అధికారి

వారి గురించి రహస్యంగా సమాచార సేకరణ

మాట వినకుంటే మెమోలుఇస్తానని బెదిరింపులు

డబల్‌ మీనింగ్‌ మాటలు.. వెకిలి చేష్టలు

లోలోపలే బాధను అనుభవిస్తున్న ఉద్యోగినులు

సదరు అధికారికి బ్రోకర్‌ గిరీ చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు


మహబూబ్ నగర్/నారాయణపేట: నారాయణ పేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ కార్యాలయ అధికారి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలొస్తున్నాయి. డబుల్‌ మీనింగ్‌ మాటలు, వెకిలి చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలుస్తోంది. పని ఒత్తిడి ఉన్నప్పుడు రాత్రి వరకు కార్యాలయంలోనే ఉంటూ, మహిళా ఉద్యోగులతో ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారని సమాచారం. వారిని తన చాంబర్‌కు పిలిపించుకొని టైంపాస్‌ మాటలు మాట్లాడతారని తెలుస్తోంది. ఆ ఫైల్‌ కావాలి, ఈ ఫైల్‌ కావాలి అంటూ మహిళా ఉద్యోగుల చుట్టే తిరుగుతారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కింది స్థాయి సిబ్బంది ఒకరితో మహిళా ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కార్యాలయ పనులు చేయకపోయినా ఫరవాలేదని, తాను చేయిస్తానని, మనం ఎక్కడికైనా వెళ్దామని మహిళా ఉద్యోగులతో అంటుండటంతో వారు ఇళ్లలో సైతం చెప్పుకోలేక లోలోపలే బాధను అనుభవిస్తున్నారని సమాచారం. కాదంటే మెమోలు ఇస్తానని బెదిరిస్తున్నారని, పని రాదంటూ రిపోర్టులు ఇచ్చి సస్పెన్షన్‌ చేయిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఆ అధికారికి ఇద్దరు సిబ్బంది బ్రోకర్లుగా మారి, మహిళా ఉద్యోగుల వివరాలను అతనికి చెబుతూ పబ్బంగడుపుతు న్నారని తెలుస్తోంది.


మాట వినని ఓ ఉద్యోగిని రికార్డులు పోయాయని వేధించి, వేరే మండలానికి డిప్యుటేషన్‌ వేశాడని, నాలుగు నెలలుగా వేతనం సైతం నిలిపేశాడని తెలిసింది. అతని వేధింపులు భరించలేక కొందరు మహిళా ఉద్యోగులు ఇతర కార్యాలయాలకు డిప్యూటేషన్‌ వేయించుకొని పని చేస్తుండగా, మరి కొందరు ఆ అధికారికి తెలియకుండా డిప్యుటేషన్‌ కోసం పైరవీలు చేస్తున్నా రని సమాచారం. అతనికి బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న సిబ్బందితో రికార్డులు మిస్‌ చేయించి, మిగతా వారిని అవి ఎక్కడికి పోయాయని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆ అధికారి మామూళ్ల వ్యవహారాన్ని కూడా సదరు బ్రోకర్లే చూస్తున్నట్లు తెలిసింది.


చర్యలు తీసుకోండి

మహిళా ఉద్యోగినులను వేధిస్తున్న సదరు అధికారిపై జిల్లాలోని ఓ ఉన్నత అధికారి దృష్టికి తీసుకెళ్లగా, అతనిచ్చే మామూళ్లకు ఆశపడి విచారణ చేయించకుండానే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి, సదరు అధికారిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయా లని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. లేదంటే ఆ అధికారిని, అతనికి సహకరిస్తున్న బ్రోకర్లను రోడ్డుకు లాగి తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-11-16T04:33:34+05:30 IST