Abn logo
Sep 14 2021 @ 19:18PM

మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో.. ఆలయ మాజీ చైర్మన్లకు అవమానం

చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా పుంగనూరులోని బోయకొండ ఆలయ మాజీ చైర్మన్లకు అవమానం జరిగింది. చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయానికి చైర్మన్లుగా పని చేసిన దంపతులు ఎస్కే రమణారెడ్డి, రతీదేవికి ఈ చేదు అనుభవం ఎదురైంది. వారు మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులంతా కలిసి బోయకొండ ఆలయానికి వెళ్లామన్నారు. అయితే వీఐపీ, దర్శన  క్యూలైన్లు, ప్రత్యేక దర్శనాల క్యూలైన్ల గేట్లకు తాళాలు వేసి మూసేశారని రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


దీంతో అతి కష్టంపై సామాన్య భక్తులు వెళ్లే క్యూలో వెళ్లి దర్శనం చేసుకున్నామన్నారు. అధికార బలంతో కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. తాము దర్శనానికి వస్తున్న విషయం తెలుసుకుని.. అధికారులు, సిబ్బంది మొత్తం గేట్లన్నీ మూసేసి దాక్కున్నారని చెప్పారు. ఎక్కడా మాజీ చైర్మన్లకు ఇలాంటి ఘటన ఎదురై ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గం టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నాననే ఉద్దేశంతోనే వైసీపీ పెద్దలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.