సిగ్గుపడాలి

ABN , First Publish Date - 2020-10-02T06:12:02+05:30 IST

మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ పుట్టినరోజున, ఈ నూటాయాభయ్యవ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా జాతి మాట్లాడుకోవలసి వచ్చిన విషయం...

సిగ్గుపడాలి

మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ పుట్టినరోజున, ఈ నూటాయాభయ్యవ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా జాతి మాట్లాడుకోవలసి వచ్చిన విషయం మన ఘనచరిత్రకు ఏమంత తగినది కాదు. ఒక శక్తివంతమైన దేశాన్ని నిర్మిస్తున్నామని, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నామని పెద్ద పెద్ద డాంబికాలు చెప్పే నాయకులకు ఇప్పుడు, తమ శిరస్సులను సిగ్గుతో ఎక్కడ భద్ర పరచుకోవాలో తెలియని స్థితి. దురహంకారంతో, పశుత్వంతో హింసించి హింసించి జీవచ్ఛవంలా మార్చి వదిలేస్తే, పదిహేను రోజులు చావుతో పోరాడి కన్నుమూసింది ఉత్తరప్రదేశ్‌ హథ్రస్‌ అమ్మాయి. అత్యాచారం జరగలేదని చెప్పడానికి పోలీసులకు ఎందుకంత ఉత్సాహం? ఫోరెన్సిక్‌ నివేదికలో ఏ ఆధారమూ దొరకలేదనడానికి ఎందుకంత సంబరం? నగ్నంగా, రక్తస్రావంతో చావుబతుకుల మధ్య కనిపించిన ఆ బాధితురాలికి వెంటనే అవసరమైన పరీక్షలు చేశారా? జరిగిన దుర్మార్గం గురించి ప్రాథమిక ఫిర్యాదు తీసుకోవడానికి ఎంత ఆలస్యం చేశారు? ఇప్పుడు ఇన్ని రోజుల తరువాత ఫోరెన్సిక్‌ నివేదికలో ఏ ఆధారం దొరుకుతుంది? దొరికినా దొరకలేదని మాయ చేయగల దొరతనం ఉన్నప్పుడు, ఆర్తనాదం అరణ్యరోదనమే అవుతుంది. 


మెడ ఎముక మాత్రమే కాదు, వెన్నెముక కూడా విరిగింది. హత్య జరిగింది. దారుణంగా జరిగింది. అది చాలదా బాధితత్వానికి? అత్యాచారం జరగలేదనే నమ్ముదాం పోనీ, తక్కినది మాత్రం తక్కువా? ఏ సవర్ణులను, ఠాకూర్లను రక్షించడానికి ఈ కుతంత్రం? పోలీసులు, ప్రభుత్వం చెబుతున్న దానిలో మోసం లేకపోతే, అర్ధరాత్రి పూట బాధితురాలి అంత్యక్రియలు ఎందుకు? జిల్లా కలెక్టర్‌ వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం ఎందుకు? ‘‘మీడియా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, మేం ఎప్పటికీ ఉంటాం’’ – అన్నది హెచ్చరికా, భరోసానా? కావాలనుకుంటే ఫిర్యాదును మార్చుకోవచ్చునన్నది సూచనా, ఆదేశమా? ఒకపక్కన దేశమంతా ఈ విషయమై భగ్గుమంటుండగా, ఉత్తరప్రదేశ్‌లో బలరాంపూర్‌ జిల్లాలో మరొక దళిత మహిళపై సామూహిక అత్యాచారం, హత్య జరిగాయి. ఆ రాష్ట్రంలో హింస, అత్యాచారం వ్యవస్థీకృతంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి నేరంపై పోరాడుతున్నానని చెబుతున్నదంతా పాక్షికమేనని ఈ వరుస సంఘటనలు నిరూపిస్తున్నాయి. సంపన్నులకు ఇబ్బంది కలిగించే, వసూళ్లు చేసే, ముఠాలు కట్టే, తమ పార్టీకి చెందని అసాంఘిక శక్తుల మీద పోలీసు లాఠీ ఝళిపిస్తున్నారు కానీ, వూడలుదిగి ఉన్న సామాజిక నేరస్థుల మీద ఎటువంటి చర్యా ఉండడం లేదు. ఇక బలహీనులకు భద్రత ఎక్కడ? 


జిల్లా పాలనాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు అందరూ ఒకే పాట పాడుతున్నప్పుడు సాధారణ పోలీసులు మాత్రం భిన్నంగా ఎందుకుంటారు? జరిగిన ఘోరాన్ని చూసి, బాధితులకు ధైర్యం ఇవ్వడానికి వచ్చేవారు వారికి శత్రువులుగా కనిపిస్తారు. ఎంత పెద్ద రాజకీయ నేతను అయినా, తమ వారు కానప్పుడు చొక్కాపట్టి ఈడ్చేస్తారు. కిందపడేసి తొక్కేస్తారు. రాహుల్‌గాంధీ చిన్న నాయకుడేమీకాదు కదా, సోదరి ప్రియాంక గాంధీతో కలసి హథ్రాస్‌కు ప్రయాణమైనప్పుడు, రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు ఆపేశారు. వాహనం దిగి, పాదయాత్రకు పూనుకోగానే, అడ్డుకోవడానికి తీవ్రంగా వ్యవహరించారు. ఇంత మాత్రం కాఠిన్యం నేరస్థుల మీద చూపవచ్చును కదా? రాజస్థాన్‌లో స్త్రీల మీద అత్యాచారాల సంగతేమిటి– అంటూ అరుపులు కేకలతో వార్తాకార్యక్రమాలను దద్దరిల్లజేసే న్యూస్‌రీడర్లు అడుగుతారు. ఈ పాపంలో కాంగ్రెస్‌ తక్కువదేమీ కాదు. యుపి ఇంకా ఇంత అనాగరికంగా ఉండడంలో ఆ పార్టీ చారిత్రక ద్రోహం చాలా ఉన్నది. కానీ, ఇప్పుడు వారు బాధితుల పక్షాన వచ్చారు. ప్రజలకు మరో గతి లేదు. వీరు తప్పు చేస్తే వారిని, వారు తప్పు చేస్తే వీరిని ఆశ్రయించాలి. ఇప్పుడు రాహుల్‌ గాంధీ మీద జరిగిన దౌర్జన్యం, న్యాయం కోరుతున్న బాధితులపైననే పడిన మరో దెబ్బ.


ఇటువంటి అరాచక వాతావరణంలో మరింత బాధాకరమైనది మాట్లాడే గొంతులు లేకపోవడం. భీమ్‌ ఆర్మీ చంద్రశేఖర్‌ ఆజాద్‌ తప్ప యుపి నుంచి వెంటనే స్పందించిన వారు లేరు. బెహన్‌ మాయావతి ఆలస్యంగా మేల్కొని, నొప్పించక తానొవ్వక అన్నట్టుగా ప్రకటన చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి నవనాడులూ కుంగిపోయినట్టున్నాయి. ఇక ప్రియాంక గాంధీ వచ్చి తమలో నూతనోత్తేజం కలిగిస్తుందని ఎదురుచూస్తూ నిష్ర్కియలో కూరుకుపోయిన యుపి కాంగ్రెస్‌లో ఏ చలనమూ లేకపోయింది. ఈ పరిస్థితి రేపు పొద్దున దేశమంతా కూడా రావచ్చు. మాట్లాడే కొద్ది గొంతులను జైళ్లలోకి కుక్కేసి, మాట్లాడగలిగినవారిని భయభ్రాంతులను చేసి, కొందరిని ప్రలోభపెట్టి లొంగదీసుకుంటే? ఆ పైన దేశాన్ని గద్దలకు, రాబందులకు వేస్తే? 


ఈ దేశం దుస్థితిలో ఉన్నదంటున్నది, నేరాల వల్ల కాదు. నేరాన్ని కాపాడడానికి, ప్రోత్సహించడానికి, నేర వాస్తవాన్ని నిరాకరించడానికి పాలకులు పడుతున్న తపన వల్ల ఈ దేశం దుస్థితిలో ఉన్నది. ‘‘నేరమై అధికారమై ప్రజలను నేరస్థులను’’ చేస్తున్నందుకు దుస్థితిలో ఉన్నది. సాటి మనుషులపై తీవ్ర హింసా దౌర్జన్యాలు జరుగుతుంటే, నిమ్మకు నీరెత్తినట్టున్న నడిమితరగతి ప్రజల మౌనం వల్ల దుస్థితిలో ఉన్నది. స్వాతంత్ర్యానంతరం ఏడు దశాబ్దాల తరువాత భారతదేశం ఇట్లా ఉంటుందని గాంధీ కలలో కూడా ఊహించి ఉండరు. గాంధీ హంతకులకు గౌరవం పెరుగుతున్న సమాజంలో, మానవ విలువలకు మాత్రం ఏమి ఉనికి ఉంటుంది?

Updated Date - 2020-10-02T06:12:02+05:30 IST