షమిపై ట్రోలింగ్‌

ABN , First Publish Date - 2021-10-26T08:16:20+05:30 IST

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా పరాజయం తర్వాత పేసర్‌ మహ్మద్‌ షమిని దారుణంగా ట్రోల్‌ చేయడాన్ని సచిన్‌,....

షమిపై ట్రోలింగ్‌

దుబాయ్‌: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా పరాజయం తర్వాత పేసర్‌ మహ్మద్‌ షమిని దారుణంగా ట్రోల్‌ చేయడాన్ని సచిన్‌, సెహ్వాగ్‌ సహా పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఖండించారు. ఆటకు, మతాన్ని ముడిపెట్టడాన్ని ఆక్షేపించారు. షమికి మద్దతుగా నిలిచారు. జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా షమిపై దూషణలను ఖండిస్తూ అతడికి అండగా నిలిచారు. పాక్‌తో ఓడిన ఆ మ్యాచ్‌లో  భారత బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. 3.5 ఓవర్లు వేసిన షమి 43 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో షమిని టార్గెట్‌ చేసిన కొందరు సోషల్‌ మీడియాలో అతడిని దూషిస్తూ ట్వీట్లు చేశారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రతి ఆటగాడికి మేం మద్దతు ప్రకటిస్తామని సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేయగా... ‘ఆన్‌లైన్‌ వేదికగా షమిని అసభ్యంగా దూషించడం షాక్‌కు గురి చేసింది. పాకిస్థాన్‌-భారత్‌ క్రికెట్‌ సమరాల్లో నేనూ పాలుపంచుకున్నా. అప్పట్లో మేం కూడా ఓడిపోయాం.కానీ మమ్మల్ని పాకిస్థాన్‌ వెళ్లిపోవాలని ఎవరూ అనలేదు. షమి నీకు మేమంతా అండగా ఉన్నాం. వచ్చే మ్యాచ్‌లో నీ ప్రతాపం చూపు’ అని సెహ్వాగ్‌ పోస్ట్‌ చేశాడు. 

Updated Date - 2021-10-26T08:16:20+05:30 IST