శాంతి - భ్రాంతి

ABN , First Publish Date - 2021-12-06T05:45:20+05:30 IST

నువ్వూ నేను ఒంటరివాళ్ళమని ఎవరి యుద్ధాలు వారివేనని చెప్పినా ఎవ్వరూ నమ్మరు! మనిద్దరి మధ్యన జరగాల్సిన యుద్ధాల కోసం...

శాంతి - భ్రాంతి

1. 

నువ్వూ నేను ఒంటరివాళ్ళమని

ఎవరి యుద్ధాలు వారివేనని చెప్పినా

ఎవ్వరూ నమ్మరు!

మనిద్దరి మధ్యన

జరగాల్సిన యుద్ధాల కోసం

జట్టు కట్టి

చెట్టాపట్టాలేసుకోమంటారు!

వేవ్‌ లెంగ్త్‌ పొడవుల్లోనో

దాహాల ఘనపరిమాణాల్లోనో

ఇరువురిని ఒక్కటిగా వెతుక్కుని మరీ...


2. 

ఒకే పీఠం వేసుకుని

నాలుగు కాళ్ళతో నడవటం

ఒక్కటే చూపు కోసం

నాలుగు కళ్ళను ఒక్కటి చేయటం

ఎంత భారం!

ఇరకాటంలో పెట్టైనా సరే

దేహాలను నియంత్రించి

ఒక ఆత్మను తొడగాలి


3. 

ఊరకే ఉండలేక

సూది మొనంత సందు చేసుకుని

కాలో చెయ్యో పెట్టి చొచ్చుకొచ్చి

ఒంటబట్టించుకున్న లౌకికంలో

రచ్చకి ఉసిగొల్పి

ఆ తర్వాత రాజీ మార్గంలో

ఆవలించే నిరాసక్తతని

నిట్టూర్చే నెమ్మదిని అలవరచి

రొటీన్‌ రోడ్డెక్కాలి


4. 

మళ్ళీ కొత్త యుద్ధం మొదలవ్వదని కాదు

మధ్య మధ్యలో

భ్రాంతిలో శాంతి సందేశమొకటుంటుంది!

శమింపజేసి

ఉద్వేగాల సరంజామాని సర్దుకుంటూండాలి!

రాళ్ళబండి శశిశ్రీ

74163 99396


Updated Date - 2021-12-06T05:45:20+05:30 IST