టాటాలతో వేగడం ఇక కుదరదు

ABN , First Publish Date - 2020-10-30T06:38:55+05:30 IST

టాటా గ్రూప్‌తో పూర్తి తెగతెంపులు చేసుకునేందుకు షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ సిద్ధమైంది. సుప్రీంకోర్టుకు కూడా ఇదే విషయం తెలిపింది...

టాటాలతో వేగడం ఇక కుదరదు

  • మా వాటా మాకు ఇప్పించండి
  • వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు
  • సుప్రీంకోర్టుకు తెలిపిన ఎస్‌పీ గ్రూప్‌ 

న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌తో పూర్తి తెగతెంపులు చేసుకునేందుకు షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ సిద్ధమైంది. సుప్రీంకోర్టుకు కూడా ఇదే విషయం తెలిపింది. టాటాలతో ఇక ఏమాత్రం కలిసి ఉండలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ వాటా తమకు విడగొట్టాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు గురువారం తెలిపింది. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ.. టాటా సన్స్‌ ఈక్విటీలో తమకు ఉన్న 18.37 శాతం వాటా ప్రస్తుత విలువ రూ.1.75 లక్షల కోట్లు ఉంటుందని తెలిపింది.


రెండు గ్రూప్‌ల కంపెనీ 

టాటా సన్స్‌.. రెండు పారిశ్రామిక గ్రూప్‌ల కంపెనీ అనే విషయాన్ని ఎస్‌ఈ గ్రూప్‌ గుర్తు చేసింది. ఈ లెక్కన టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీల్లో తమకు వాటా ఉందని తెలిపింది. టాటా గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీల్లో దామాషా పద్దతి (ప్రో రేటా)లో తమ వాటా విలువ లెక్కించాలని కోరింది. ఇందుకు ఆయా కంపెనీల షేర్ల విలువతో పాటు,ఆయా కంపెనీల బ్రాండ్‌ల విలువనూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. 


టీసీఎస్‌ వాటా విలువ రూ.1.35 లక్షల కోట్లు 

దామాషా ప్రకారం టీసీఎస్‌ ఈక్విటీలో టాటా గ్రూప్‌నకు ఉన్న 72 శాతం వాటాలో 13.22 శాతం ఎస్‌పీ గ్రూప్‌నకు వస్తుంది. ప్రస్తుతం టీసీఎస్‌ షేరు మార్కెట్‌ ధర ప్రకారం ఈ 13.22ు వాటా విలువే రూ.1.35 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో నమోదు కాని టాటా గ్రూప్‌ కంపెనీల విలువ లెక్కింపును రెండు గ్రూప్‌ల ఆమోదంతో మూడో పార్టీకి అప్పగించాలని కోరింది. 


Updated Date - 2020-10-30T06:38:55+05:30 IST