Abn logo
Jun 17 2021 @ 23:46PM

షరామామూలే..

కరోనా కేసులు తగ్గడంతో రోడ్లపైకి భారీగా జనం

కిక్కిరిస్తున్న వాహనాలు

వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదన్న విషయాన్ని విస్మరించొద్దంటున్న వైద్యులు

మూడో వేవ్‌ హెచ్చరికలను గమనంలోకి తీసుకోవడం అవసరం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో మళ్లీ నిర్లక్ష్యం పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తున్నారని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నా... పెడచెవిన పెడుతున్నారంటున్నారు. ఇది అత్యంత ప్రమాద కరమంటున్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయే తప్ప... వైరస్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరిన్నారు. 


రహదారులు కిటకిట

ఉదయం పూట నగరంలో రోడ్లన్నీ వాహనదారులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వన్‌టౌన్‌, డాబాగార్డెన్స్‌, జగదాంబ, ద్వారకా నగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్‌, గోపాలపట్నం, గాజువాక తదితర ప్రాంతాల్లో అయితే రోడ్లపై ఇసుకేస్తే రాలనంత జనం ఉంటున్నారు. వాహనాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇవన్నీ మరోమారు వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదముందని వైద్యులు అంటున్నారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నాం కాబట్టి..తమకు వైరస్‌ సోకదన్న భావనలో చాలామంది ఉంటున్నారని, అయితే, ఇది వాస్తవం కాదంటున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా వైరస్‌ సోకవచ్చునని చెబుతున్నారు. ఇంకా బయట నుంచి కరోనా వైరస్‌ను ఇంటిలోకి తీసుకువెళ్లడం వల్ల ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు వైరస్‌ బారినపడితే ప్రమాదమన్న విషయాన్ని దృష్టి లో వుంచుకుని వ్యవహరించాలని సూచిస్తున్నారు. 


వ్యాక్సిన్‌ తీసుకున్నా మాస్క్‌ తప్పనిసరి

- డాక్టర్‌ పీవీ సుధాకర్‌, కొవిడ్‌-19 ప్రత్యేక అధికారి

కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కొందరు మాస్క్‌ ధరించడం మానేశారు. ఇంకొంత మంది వ్యాక్సిన్‌ తీసుకున్నాం కాబట్టి...వైరస్‌ సోకదన్న ధైర్యంతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. అటువంటి వారికి కరోనా సోకినా, సోకకపోయినా వైరస్‌ వ్యాప్తికి దోహదపడతారు. బయట నుంచి వైరస్‌ను తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు అంటిస్తారు. దీనివల్ల ఇంట్లోని వారు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. కాబట్టి, మరికొన్నాళ్లపాటు అందరూ  జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్క్‌ ధరించడంతోపాటు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. త్రిముఖ సూత్రంతోనే వైరస్‌ నుంచి రక్షణ

- డాక్టర్‌ ఎం.మధుసూదన్‌బాబు, ప్రముఖ వైద్య నిపుణులు

ముఖానికి మాస్క్‌, సామా జిక దూరం, చేతులను ఎప్పటిక ప్పుడు శుభ్రం చేసుకోవడం...ఈ మూడే వైరస్‌ నుంచి రక్షణ కల్పించే మార్గాలు. ఈ విష యంలో ఎవరూ నిర్లక్ష్యం ప్రద ర్శించవద్దు. వ్యాక్సిన్‌ తీసుకున్న ప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా థర్డ్‌ వేవ్‌పై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావడంతోపాటు ముందస్తు చర్యలను ప్రారంభించాయి. ఇది వైరస్‌ ఇంకా మన నుంచి పోలేదనడానికి సంకేతంగా భావించాలి. చిన్నారులు వున్న ఇళ్లల్లోని వ్యక్తులు మరో ఐదారు నెలలపాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా కుటుంబం మొత్తం ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది.