పరమ్‌బీర్ సింగ్ ఆరోపణలు తీవ్రమైనవే : శరద్ పవార్

ABN , First Publish Date - 2021-03-21T20:52:49+05:30 IST

నగర మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఎన్‌సీపీ చీఫ్

పరమ్‌బీర్ సింగ్ ఆరోపణలు తీవ్రమైనవే : శరద్ పవార్

ముంబై : నగర మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మౌనం వీడారు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని, వీటిపై దర్యాప్తుకు ఆదేశించే విషయంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సంపూర్ణ అధికారం ఉందని చెప్పారు. ఈ విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి జూలియో రిబీరో సహకారం తీసుకోవాలన్నారు. 


ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు పరంబీర్ సింగ్ శనివారం రాసిన లేఖలో రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ తన అధికారిక నివాసానికి పోలీసు అధికారులను గత కొన్ని నెలల్లో అనేకసార్లు పిలిపించుకున్నారని పేర్కొన్నారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి, తనకు ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. ఈ సొమ్మును వసూలు చేసి, తనకు ఇవ్వాలని సస్పెండయిన ఏపీఐ సచిన్ వాజేను అనిల్ ఆదేశించారని తెలిపారు. 


హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఎన్‌సీపీకి చెందిన నేత. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన పరంబీర్ సింగ్‌పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. 


ఈ నేపథ్యంలో శరద్ పవార్ ఆదివారం మాట్లాడుతూ, అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవేనన్నారు. ముఖేశ్ అంబానీ నివాసం వద్ద కారు బాంబు కేసు దర్యాప్తులో క్షమించరాని పొరపాట్లు చేసిన పరంబీర్ సింగ్‌ను ముంబై నగర పోలీసు కమిషనర్‌ పదవి నుంచి తప్పించడంతో, ఆయన ఇటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అరెస్టయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేను పునరుద్ధరించాలని గత ఏడాది నిర్ణయించినవారిలో పరంబీర్ సింగ్ ఒకరని చెప్పారు. రాష్ట్రంలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని విలేకర్లు అడిగినపుడు శరద్ పవార్‌ స్పందిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయో, లేదో తనకు తెలియదని చెప్పారు. అయితే ప్రభుత్వంపై ఈ ఆరోపణల ప్రభావం ఏమీ ఉండదని చెప్పగలనని తెలిపారు. 


సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముఖేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలు ఉన్న ఓ కారుకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్టు చేశారు. 


Updated Date - 2021-03-21T20:52:49+05:30 IST