పవార్ ఓ రిమోట్ కంట్రోల్ : నానా పటోలే

ABN , First Publish Date - 2021-07-15T01:24:19+05:30 IST

మహారాష్ట్రలో జరిగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే విషయంపై పార్టీ అధిష్ఠానం..

పవార్ ఓ రిమోట్ కంట్రోల్ : నానా పటోలే

ముంబై: మహారాష్ట్రలో జరిగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే విషయంపై పార్టీ అధిష్ఠానం మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2014లో ఒంటరిగా పోటీ చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) కూడా నిర్ణయం తీసుకుందని, ఆ ప్రకారమే కాంగ్రెస్ పార్టీకి కూడా సొంత వ్యూహం ఉంటుందని చెప్పారు. శరద్ పవార్ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ అని అన్నారు. అయితే, ఆయనను తాము గౌరవిస్తామని, ఆయనతో తమకెలాంటి విరోధం లేదని పేర్కొన్నారు. పొత్తులపై కాంగ్రెస్ నేతల బృందంతో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడిన మరుసటి రోజే నానా పటోలే తాజా వ్యాఖ్యలు చేశారు.


''రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు పెరుగుతోంది. 2014లో వంచనకు గురయ్యాం. మళ్లీ ఆ పరిస్థితి పునరావృతం ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈసారి పూర్తి సన్నద్ధంగా ఉండాలనుకుంటున్నాం'' అని పటోలే చెప్పారు. దీనికి ముందు, కాంగ్రెస్ ప్రతినిధుల బృందం మంగళవారంనాడు పవార్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కాంగ్రెస్ నేషనల్ అబ్జర్వర్ హెచ్‌కే పాటిల్, మంత్రి బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే చేయవచ్చని, అయితే ప్రస్తుతం ఉన్న పొత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పవార్ సూచించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి నానా పటోలే దూరంగా ఉండిపోయారు.




కాగా, పవార్ సమావేశానికి తాను హాజరుకాకపోవడాన్ని నానా పటోలే సమర్ధించుకున్నారు. ''ఓబీసీ, మరాఠా రిజర్వేషన్ల అంశాలపై పవార్‌తో చర్చించాల్సి ఉండటంతో ఇద్దరు మంత్రులు, మా జాతీయ నేతలు పవార్‌ను కలుసుకున్నారు. అవసరమైతే నేను కూడా పవార్‌ను కలుసుకుని మాట్లాడతాను. ఆయనంటే మాకు గౌరవం ఉంది. ఆయనతో మాకెలాంటి విరోధం లేదు'' అని అన్నారు.

Updated Date - 2021-07-15T01:24:19+05:30 IST