నితిన్ గడ్కరీపై శరద్ పవార్ ప్రశంసలు

ABN , First Publish Date - 2021-10-03T00:26:35+05:30 IST

అభివృద్ధి కోసం అధికారాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని

నితిన్ గడ్కరీపై శరద్ పవార్ ప్రశంసలు

పుణే : అభివృద్ధి కోసం అధికారాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రశంసించారు. శంకుస్థాపన చేసిన కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభమయ్యేలా ఆయన కృషి చేస్తున్నారన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిరువురు శనివారం పాల్గొన్నారు. 


అహ్మద్ నగర్‌లో చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దోహదపడే ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ ప్రారంభిస్తున్నారని, ఈ కార్యక్రమానికి తాను హాజరు కావాలని ఆయన కోరుకున్నారని శరద్ పవార్ చెప్పారు. ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన తర్వాత పనులు జరగకపోవడం మనం తరచూ చూస్తూ ఉంటామన్నారు. కానీ గడ్కరీ శంకుస్థాపన చేసే  ప్రాజెక్టుల విషయంలో అలా కాదన్నారు. శంకుస్థాపన జరిగిన కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభమవుతుండటం మనం చూస్తున్నామన్నారు. 


దేశాభివృద్ధి కోసం ఓ ప్రజా ప్రతినిధి ఏ విధంగా పని చేయగలరనేదానికి గడ్కరీ గొప్ప ఉదాహరణ అని తెలిపారు. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ బాధ్యతలను గడ్కరీ చేపట్టడానికి ముందు దాదాపు 5,000 కిలోమీటర్ల పని జరిగిందన్నారు. ఆయన ఈ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇది 12,000 కిలోమీటర్లు దాటిందన్నారు. 


నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో రోడ్డు ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టడానికి ముందు స్థానిక నదులు, ప్రవాహాల్లో పూడికను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) తొలగించిందని చెప్పారు. అహ్మద్ నగర్ జిల్లాలో నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని మహారాష్ట్ర గామీణాభివృద్ధి మంత్రి హసన్‌కు సూచించారు. 


Updated Date - 2021-10-03T00:26:35+05:30 IST