Abn logo
Jul 27 2021 @ 04:21AM

ఒక్క విజయమే..

  • టీటీలో మూడో రౌండ్‌కు  శరత్‌ కమల్‌
  • షూటింగ్‌, బాక్సింగ్‌, ఆర్చరీలో పరాజయాలు


ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత్‌కు కఠినంగా సాగింది. సోమవారం కూడా భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శన కొనసాగగా.. టేబుల్‌ టెన్ని్‌స స్టార్‌ శరత్‌ కమల్‌ ఒక్కడే విజయం రుచి చూపించాడు. మరో టీటీ కెరటం మనికా బాత్రా సంచలన షో ముగిసింది. అటు ఆర్చర్ల గురి తప్పగా.. షూటింగ్‌లోనూ లక్ష్యం చెదిరింది. స్విమ్మింగ్‌లోనూ వేగం సరిపోలేదు. బాక్సర్‌ ఆశిష్‌ కుమార్‌ పంచ్‌లోనూ పవర్‌ లేకపోవడంతో తిరుగుముఖం పట్టిన మూడో భారత బాక్సర్‌ అయ్యాడు. టెన్నిస్‌, ఫెన్సింగ్‌లోనూ నిరాశే ఎదురైంది.


టేబుల్‌ టెన్నిస్‌ 

టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఆచంట శరత్‌ కమల్‌ అద్భుత పోరాటాన్ని ప్రదర్శించాడు. టియాగో అపోలోనియా (పోర్చుగల్‌)తో జరిగిన మ్యాచ్‌లో శరత్‌ 4-2 (2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9)తో గెలిచి మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. తొలి సెట్‌ను కోల్పోయిన శరత్‌ ఆ తర్వాత రెండు సెట్లను గెలుచుకుని పైచేయి సాధించాడు. అయితే నాలుగో సెట్‌లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా ఒత్తిడి తట్టుకుంటూ చివరి రెండు సెట్లను కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగే తదుపరి రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ మ లాంగ్‌ (చైనా)ను శరత్‌ ఎదుర్కోనున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. మూడో రౌండ్‌లో మనికా బాత్రా 0-4తో సోఫియా పొల్కనోవా (ఆస్ట్రియా) చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌ కేవలం 27 నిమిషాల్లోనే ముగిసింది. అంతకుముందు జరిగిన రెండో రౌండ్‌లో సుతీర్థ ముఖర్జీ 0-4తో ఫు యు (పోర్చుగల్‌) చేతిలో పరాజయం పాలైంది.


ఆర్చరీ

పురుషుల ఆర్చరీ జట్టు మరోసారి కొరియా గండం దాటలేక క్వార్టర్స్‌తోనే ప్రస్థానం ముగించింది. అతాను దాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌లతో కూడిన భారత బృందం ప్రీక్వార్టర్స్‌లో కజకిస్థాన్‌ను 6-2తో ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. కానీ ఇక్కడ డిఫెండింగ్‌ చాంపియన్‌ కొరియా ఎదురుపడడంతో మన ఆర్చర్లు నిలవలేకపోయారు. ఫలితంగా భారత జట్టు 0-6తో ఓటమిపాలైంది. ఇక, ఆర్చర్ల ఆశలన్నీ వ్యక్తిగత విభాగాల్లోనే. బాక్సింగ్‌

తొలిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన బాక్సర్‌ ఆశిష్‌ చౌధరికి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. మిడిల్‌ వెయిట్‌ (69-75 కేజీ) తొలి రౌండ్‌లో ఆశిష్‌ 0-5తో చైనా బాక్సర్‌ ఎర్బీక్‌ చేతిలో ఓడాడు.  


ఫెన్సింగ్‌ 

ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారత ఫెన్సర్‌గా పేరు తెచ్చుకున్న భవానీ దేవికి నిరాశే ఎదురైంది. సోమవారం జరిగిన మహిళల వ్యక్తిగత సబ్రే తొలి రౌండ్‌లో భవానీ 15-3 తేడాతో నడియా బెన్‌ అజీజి (ట్యునీషియా)పై గెలిచింది. ఆ తర్వాత జరిగిన రెండో రౌండ్‌లో మాత్రం 7-15తో బ్రూనెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలైంది. షూటింగ్‌ 

భారత షూటర్ల నుంచి ఆశించిన ప్రదర్శన కనిపించడం లేదు. పురుషుల స్కీట్‌ షాట్‌గన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్లో అంగద్‌ వీర్‌సింగ్‌ బజ్వా 18వ.. మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ 25వ స్థానంలో నిలిచి నిరాశపరిచారు. 


స్విమ్మింగ్‌ 

పురుషుల 200మీ. బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో సజన్‌ ప్రకాశ్‌ సెమీ్‌సకు అర్హత సాధించలేకపోయాడు. హీట్‌-2లో అతడు 1:57.22 సెకన్లతో 24వ స్థానంలో నిలిచాడు. ఇందులో టాప్‌-16 మాత్రమే సెమీ్‌సకు వెళతారు.


బ్యాడ్మింటన్‌ 

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ జోడీకి తమ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో చుక్కెదురైంది. వరల్డ్‌ నెంబర్‌వన్‌ సుకముల్జో-గిడెయిన్‌ (ఇండోనేసియా) చేతిలో 13-21, 12-21తో ఓటమిపాలైంది. గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానంలో ఉండడంతో వీరికి క్వార్టర్స్‌ వెళ్లే అవకాశాలు ఇంకా ఉన్నాయి. అయితే మంగళవారం తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో బ్రిటన్‌ జోడీపై నెగ్గాలి.


టెన్నిస్‌ 

సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సుమిత్‌ నగాల్‌ 2-6, 1-6తో మెద్వెదేవ్‌ (రష్యా) చేతిలో ఓడాడు.
మహిళల హాకీ 

భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. పూల్‌ ‘ఎ’లో జర్మనీతో ఆడిన రాణీ రాంపాల్‌ బృందం 0-2తో ఓడింది. సెయిలింగ్‌

పురుషుల లేజర్‌ ఈవెంట్‌ రెండో రేసులో విష్ణు శరవణన్‌ 20వ స్థానంలో.. మూడో రేసులో 25వ స్థానంలో నిలిచాడు. మహిళల లేజర్‌ రేడియల్‌లో నేత్రా కుమనన్‌ మూడో రేసులో 21, నాలుగో రేసులో 28వ స్థానంలో నిలిచింది.


నేటి భారత షెడ్యూల్‌


సోనీ,  దూరదర్శన్‌, డీడీ స్పోర్ట్స్‌లో 


షూటింగ్‌: ఉ. 5.30 -10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ తొలి అర్హత రౌండ్‌ (సౌరభ్‌ చౌధరి, మనూ బాకర్‌, అభిషేక్‌ వర్మ, యశస్వినీ దేశ్వాల్‌), ఉ. 6.15 -10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ రెండో అర్హత రౌండ్‌, ఉ. 7.30 -10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ మెడల్‌ రౌండ్లు, ఉ. 9.45 -10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ తొలి అర్హత రౌండ్‌ (మౌద్గిల్‌, పన్వార్‌, వలవరిన్‌, దీపక్‌), మ. 10.30 -10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ రెండో అర్హత రౌండ్‌, ఉ. 11.45 -10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ మెడల్‌ రౌండ్లు

హాకీ: ఉ. 6.30 -పురుషుల పూల్‌-ఎ (భారత్‌-స్పెయిన్‌)

బ్యాడ్మింటన్‌: ఉ. 8.30 -పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌ (సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి)

టేబుల్‌ టెన్నిస్‌: ఉ. 8.30 -పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ (శరత్‌ కమల్‌)

సెయిలింగ్‌: ఉ. 8.35 -మహిళల లేజర్‌ రేడియల్‌ ఐదో రేసు (నేత్రా కుమనన్‌), ఉ. 8.45 -పురుషుల లేజర్‌ రేడియల్‌ నాలుగో రేసు (విష్ణు శరవణన్‌), ఉ. 9.35 మహిళల లేజర్‌ రేడియల్‌ ఆరో రేసు (నేత్రా కుమనన్‌), ఉ. 9.45 -పురుషుల లేజర్‌ రేడియల్‌ 5-6 రేసులు (విష్ణు శరవణన్‌), ఉ. 11.20 - పురుషుల సెయిలింగ్‌ 49ఈఆర్‌ తొలి మూడు రౌండ్లు (కేసీ గణపతి, వరుణ్‌ ఠక్కర్‌)

బాక్సింగ్‌: ఉ. 10.57 -మహిళల వెల్టర్‌ వెయిట్‌ - రౌండ్‌ 16 (లవ్లీనా బోర్గాహైన్‌)

గమనిక: తుఫాను హెచ్చరిక కారణంగా షెడ్యూల్‌ ప్రకారం నేడు జరగాల్సిన రోయింగ్‌, ఆర్చరీ పోటీలు రద్దయ్యాయి.