Abn logo
Oct 17 2020 @ 04:05AM

నట్టేట ముంచేసింది

Kaakateeya

నాలుగు రోజులుగా నీటిలోనే పొలాలు

రాంబిల్లి రైతుల గగ్గోలు

ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ పెట్టుబడి

అంతా పోయినట్టే

ఇప్పుడు నీరు తగ్గినా పంట చేతికి రాదు

అప్పులే మిగుల్తాయి...ఎలా తీర్చాలోనని ఆందోళన

శారదా నది వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందిగా వేడుకోలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):శారదా ఆయకట్టు రైతులమని మురిసిపోవాలో...అదే నది ఏటా మమ్మల్ని ముంచేస్తోందని బావురుమనాలో తెలియడం లేదు...వరి తప్ప మరో పంట ఇక్కడ పండదు. నీటికి కొదవలేదని అప్పు చేసి మరీ నాట్లు వేస్తే...వరద ముంచేస్తోంది. కనీసం...వేసవిలో మరో పంట వేద్దామంటే...నీరుండదు. నీటి కోసం బోరు తీస్తే పది అడుగుల్లోనే ఉప్పునీరు వస్తోంది. నాకు ఆరు ఎకరాలు ఉంది.  ఎకరాకు 20 నుంచి 25 వేల పెట్టుబడి పెట్టా. మొత్తం రూ.1.25 లక్షలు అయ్యింది. అయితే వరద తీవ్రతకు పొలం మొత్తం నాలుగు రోజుల నుంచి నీటిలోనే ఉండిపోయింది. ఇంకెన్ని రోజులు వుంటుందో తెలియదు. నీరు తగ్గినా పంట కుళ్లిపోతుంది. ఈ ఏడాది అప్పులే మిగులుతాయి.


శారదా వరద నుంచి మమ్మల్ని కాపాడాలి... కాపుశెట్టి సూర్యనారాయణ, కుమ్మరాపల్లి, రాంబిల్లి మండలం

...ఈ వేదన ఒక్క సూర్యనారాయణదే కాదు. రాంబిల్లి మండలంలో సుమారు 13 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులది. ఏటా శారదా నది వరద ఉధృతికి వేల ఎకరాల్లో పంట మునిగిపోయి కళ్లెదుటే కుళ్లిపోతుంది. ఏటా రెండు నుంచి రెండున్నర వేల ఎకరాల్లో పంట పోతుంటుంది. ఈ ఏడాది వరద తీవ్రతకు నాలుగున్నర వేల ఎకరాలు నాలుగు రోజుల నుంచి నడుంలోతు నీటిలో ఉంది. నీరు తగ్గిన తరువాత పంట ఎందుకు పనికాదని రైతులు బావురుమంటున్నారు. 


బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు చెరువులు, గెడ్డలు, రిజర్వాయర్ల నుంచి నీరు శారదా నదిలో చేరడంతో వరద పోటెత్తింది. రాంబిల్లి మండలంలో సుమారు నాలుగున్నర వేల ఎకరాల పంటను ముంచేసింది. ఇప్పటికీ వేలాది ఎకరాలు నీటిలోనే ఉంది. పొలాల్లో నీరు బయటకు వెళ్లకపోవడంతో ఏంచేయాలో పాలుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి శుక్రవారం మండలంలోని రజాల, దిమిలి, మర్రిపాలెం, కుమ్మరాపల్లి గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లినప్పుడు పలువురు రైతులు వరదలు, ప్రభుత్వ వైఫల్యం, నేవీ అధికారుల తీరుతో పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. వరదలతో పడుతున్న ఇబ్బందులు రైతుల మాటల్లో...


శారదా నదికి రాంబిల్లి మండలం చివరి ప్రాంతం. నదిలో వరద ప్రవాహం పెరిగితే పొలాల్లోకి నీరు చొచ్చుకు వచ్చేస్తోంది. ఒక్కొక్కసారి ఒకటి, రెండు రోజులు వుండి తగ్గుతుంది. అటువంటప్పుడు లోతట్టు ప్రాంతంలో వున్న పొలాలు తప్ప మిగిలిన పొలాల్లో 10 నుంచి 30 శాతం పోయినా మిగిలిన పంట చేతికొస్తుది. వర్షాలు ఎక్కువగా వుంటే సగం పంట పోతుంది. ఒక్కొక్కసారి అది కూడా రాదు. 


ఎకరాలో వరి సాగుకు 20 నుంచి 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అయితే డిసెంబరు వచ్చేసరికి పంట చేతికొస్తోందో లేదో తెలియదుగానీ...అప్పులు మిగలడం మాత్రం ఖాయం. వరి తరువాత పెసర, మినుము మాత్రం కొంతమేర ఫర్వాలేదు. రబీ వరికి సంబంధించి అన్ని గ్రామాలకు నీరు ఇవ్వరు. వేసవిలో పంటలు వేద్దామంటే...నీరు ఉండదు. బోరు తీస్తే పది అడుగుల్లో ఉప్పునీరు వస్తుంది. అందుకే వరి తప్ప మరో పంట వేయలేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతూనే వున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శారదా నది వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే రైతుల ప్రధాన డిమాండ్‌. 


శారదా ఆయకట్టుదారులమే..

శారదా నది ఆయకట్టు కింద రాంబిల్లి మండలం ఉంది. 50 ఏళ్ల క్రితం ఏటా జూన్‌/జూలైలో నీరు వచ్చేది. అక్టోబరులో పంట చివర దశకు వచ్చినప్పుడు...వర్షాలు పడినా కొంతవరకైనా చేతికి వచ్చేది. అయితే రైవాడ ఆనకట్ట నిర్మాణం తరువాత ఆయకట్టు చివరినున్న రాంబిల్లికి నీటి సరఫరా నిలిచిపోయింది. రైవాడ నీటిని విశాఖ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసి...నదిలోకి  నీరు చేరిన తరువాత ఆలస్యంగా వరి నాట్లు వేయడం అలవాటైపోయింది. 


 నేవీ గోడ వల్ల పంట నీట మునిగింది..సమ్మెర్ల పెరుమాళ్లరావు, మర్రిపాలెం

ఏటా వరద వచ్చి రెండు, మూడురోజులుండి తగ్గిపోయేది. ఈ ఏడాది వరద పెరిగింది. రజాల వద్ద గండితో మా ఊళ్లో ఇళ్లల్లోకి నీరు వచ్చింది. పొలంలో చేరిన వరద సముద్రంలోకి వెళ్లకుండా బంగారమ్మపాలెం వద్ద నేవీ నిర్మించిన గోడ అడ్డుకుంది. వేసిన పంట చేతికి వస్తుందనే నమ్మకం పోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

Advertisement
Advertisement