టీఆర్‌ఎస్ టార్గెట్‌గా రంగంలోకి షర్మిల

ABN , First Publish Date - 2021-04-10T19:59:14+05:30 IST

తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలనే సంకల్పంతో వైఎస్ షర్మిల ఉన్నారు. ఇప్పటికే పార్టీని స్థాపించేందుకు ఆమె సమీకరణలు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్ టార్గెట్‌గా రంగంలోకి షర్మిల

హైదరాబాద్‌: తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలనే సంకల్పంతో వైఎస్ షర్మిల ఉన్నారు. ఇప్పటికే పార్టీని స్థాపించేందుకు ఆమె సమీకరణలు చేస్తున్నారు. పలు జిల్లాలో వైఎస్ అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. శుక్రవారం ఖమ్మంలో వేలాది మంది సాక్షిగా సంకల్ప సభను నిర్వహించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇప్పటివరకు పార్టీ నిర్మాణం కోసం కసరత్తు చేస్తున్న.. షర్మిల ఇక ప్రత్యక్ష కార్యరంగంలోకి దిగేందకు సన్నద్దమవుతున్నారు. ఈ నెల 15 నుంచి ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష చేస్తున్నట్లు ఆమె అనుచరులు ప్రకటించారు. 15వ తేదీ నుంచి మూడురోజులు పాటు షర్మిల దీక్ష చేయనున్నారు. లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.


ఖమ్మంలో సంకల్ప సభ.. టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గానే జరిగింది. సభ ప్రారంభం నుంచి చివరివరకు ఆసాంతం సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై షర్మిల విమర్శలు గుప్పించారు. సభ ప్రారంభానికి ముందు కొద్దిసేపు సాధారణంగా సాగిన సభ కాస్తా.. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు కఠినం చేయడం, వాహనాలను నిలిపేయడం లాంటి చర్యలకు దిగడంతో టీఆర్‌ఎస్‌పై షర్మిల పార్టీ నేతల టార్గెట్‌ మొదలైంది. సభలో షర్మిల సుమారు 40 నిమిషాలపాటు ప్రసంగించగా.. అందులో కాంగ్రెస్‌, బీజేపీల గురించి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. మిగతా సమయం మొత్తం సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. 

Updated Date - 2021-04-10T19:59:14+05:30 IST