షర్మిల పార్టీ ఖాయం!

ABN , First Publish Date - 2021-01-31T08:34:24+05:30 IST

‘వైసీపీలో రెండో పవర్‌ పాయింట్‌ ఉండకూడదన్న ఉద్దేశంతోనే షర్మిలతోపాటు ఇతర కుటుంబ సభ్యులను ప్రభుత్వ కార్యకలాపాలకు సీఎం జగన్‌ దూరంగా ఉంచారు.

షర్మిల పార్టీ ఖాయం!

  • ఇప్పటికే రిజిస్టర్‌ కూడా చేశారు..
  • వైఎస్‌ సన్నిహితులతో అనిల్‌ మంతనాలు
  • 2014 నుంచే జగన్‌-షర్మిల మధ్య అగాథం
  • రెండో పవర్‌ సెంటర్‌ ఉండకూడదనే షర్మిలతో దూరం
  • విశాఖ నుంచి ఎంపీగా ఆమే పోటీ చేయాల్సి ఉంది
  • ఎస్‌ఈసీతో గొడవపై గవర్నర్‌ జోక్యం తప్పదు: సబ్బం హరి


విశాఖపట్నం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీలో రెండో పవర్‌ పాయింట్‌ ఉండకూడదన్న ఉద్దేశంతోనే షర్మిలతోపాటు ఇతర కుటుంబ సభ్యులను ప్రభుత్వ కార్యకలాపాలకు సీఎం జగన్‌ దూరంగా ఉంచారు. 2014 ఎన్నికల్లోనే జగన్‌-షర్మిల మధ్య అగాథం ఏర్పడింది. అన్నతో పెరిగిన దూరం వల్లే షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రిజిస్టర్‌ కూడా చేశారు. ముహూర్తం కూడా ఖరారైంది. వైఎస్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన కొందరితో షర్మిల భర్త అనిల్‌ సంప్రదింపులు జరుపుతున్నారు’ అని మాజీ ఎంపీ సబ్బం హరి తెలిపారు. శనివారం సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో నిర్వహించిన ‘బిగ్‌ డిబేట్‌’లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పలు అంశాలపై మాట్లాడారు. ‘‘వైసీపీ పెట్టిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా మొదట షర్మిలను నిలబెట్టాలని భావించినా, అనివార్య కారణాల వల్ల విజయమ్మను బరిలో నిలిపారు. అప్పటి నుంచే అన్నా, చెల్లెలి మధ్య అగాథం ఏర్పడింది. రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబం గురించి గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఎంతోమంది.. వైసీపీ అధికారంలోకి వచ్చాక పదవులు అనుభవిస్తుంటే, పార్టీ కోసం కష్టపడిన, తన బిడ్డ షర్మిలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించకపోవడం పట్ల విజయమ్మ ఆగ్రహంగా ఉన్న మాట వాస్తవమే. అన్నపై ఆగ్రహంగా ఉన్న షర్మిల ఇప్పటికే పార్టీని రిజిస్టర్‌ చేయడంతోపాటు ప్రకటించేందుకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. అయితే, కుటుంబం పరువు రోడ్డున పడకుండా ఉండేందుకు మధ్యే మార్గంగా విజయమ్మ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది’’ అని హరి అన్నారు. 


రాజ్యాంగ వ్యవస్థలపైనే దాడి!

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పట్ల ప్రభుత్వం, ప్రభు త్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు పై విద్యావంతుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. నిమ్మగడ్డపై చేస్తున్న వ్యాఖ్యలను రాజ్యాంగ వ్యవస్థలపై దాడిగానే పరిగణించాలి. గతంలో జగన్‌ను, వైఎస్‌ కుటుంబాన్ని దుర్భాషలాడిన ఎంతోమంది ఇప్పుడు వారిపై ఈగ వాలనీయబోమన్నట్టు మాట్లాడడం విడ్డూరం. భారతంలో అత్యంత రాక్షస మనస్తత్వం కలిగిన ‘కేలనేము’ మాదిరిగా ఈ ప్రభుత్వ పెద్ద తయారయ్యాడు. స్థానిక ఎన్నికల విషయంలో, అదీ రమేశ్‌కుమార్‌ చేతిలో ఓడిపోయే పరిస్థితి రావడంతో జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. జీతం, అటెండర్‌ లేకుండా చేసినా.. నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించడాన్ని సహించలేకపోతున్నట్టు ప్రభుత్వ పెద్దల మాటలతో అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు.


శిశుపాలుడి తప్పులు లెక్కించినట్టు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలపై కేంద్రానికి స్పష్టమైన అవగాహన ఉందని సబ్బం హరి పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా కాళ్లు పట్టుకుని.. వాళ్లు తమతో బాగుంటున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దేశంలో మోదీ హవా ఎలా ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ బలంగా లేకపోవడంతో వాళ్లు నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా మోదీ, షా సైలెంట్‌గా ఉన్నారంటే రాజకీయ వ్యూహం దాగి ఉంటుంది. బీజేపీ పెద్దలు.. రాష్ట్రానికి ఒక స్కీమ్‌ వేసి ఉంటారు. తిరుపతి ఎన్నికల్లో అది బయటపడుతుంది. అప్పటి వరకు శిశుపాలుడి తప్పులు లెక్కించినట్టు జగన్మోహన్‌రెడ్డి తప్పులను కేంద్ర పెద్దలు లెక్కిస్తుంటారు’’ అని హరి వ్యాఖ్యానించారు. 


అహంకారంతో దిగజారుడే!

ఏదైనా అనివార్య కారణాల వల్ల శశికళ మాదిరిగా జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళితే.. సీఎం కుర్చీలో కూర్చోడానికి తహతహలాడుతున్న వారి సంఖ్య వైసీపీలో ఎక్కువగానే ఉందని సబ్బం హరి తెలిపారు. ‘‘జగన్మోహన్‌రెడ్డి అహంకారమే అధికారాన్ని పోగొట్టే స్థితికి తీసుకువెళుతోంది. జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లి, బీజేపీ జెండా ఊపితే మినహా రాష్ట్రంలో రాక్షస, రాజకీయ క్రీడకు ముగింపు లేదు’’ అని సబ్బం స్పష్టం చేశారు.


ఎస్‌ఈసీపైకాదు.. వీరిపైనే చర్యలు

ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ మాటలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని, అయి తే, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్న మంత్రులపైనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ ఫిర్యాదు చేయడం తప్పెలా అవుతుందని సబ్బం హరి ప్రశ్నించాన్నారు. ‘‘పెద్దల సభకు చెందిన విజయసాయిరెడ్డి.. ఎస్‌ఈసీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు. రాజ్యసభకు వెళ్లినంత మాత్రాన మేధావులు, గొప్పవాళ్లుగా భ్రమించాల్సిన అవసరం లేదు. మచ్చలేని రమేశ్‌కుమార్‌ గురించి మచ్చలున్న నాయకులు మాట్లాడడం దారుణం. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వైఫల్యం చెందడంతోపాటు రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తోందని గవర్నర్‌ రాస్తే ఈ ప్రభుత్వం పని అయిపోయినట్టే. ప్రభుత్వానికి సోమవారం గవర్నర్‌ దిశానిర్దేశం చేసే అవకాశముంది. గవర్నర్‌ జోక్యం చేసుకోకపోతే.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సబ్బం హరి విశ్లేషించారు. 

Updated Date - 2021-01-31T08:34:24+05:30 IST