రేపే ఖమ్మంలో షర్మిల సంకల్ప సభ

ABN , First Publish Date - 2021-04-08T08:11:31+05:30 IST

ఇప్పటిదాకా లోట్‌సపాండ్‌లో సమావేశాలకు పరిమితమైన షర్మిల.. శుక్రవారం జనం ముందుకు వెళ్లనున్నారు.

రేపే ఖమ్మంలో షర్మిల సంకల్ప సభ

  • హాజరు కానున్న వైఎస్‌ విజయలక్ష్మి.. 600 కార్లతో ర్యాలీగా ఖమ్మానికి 
  • కొవిడ్‌ నేపథ్యంలో 6 వేల మందితో సభకు పోలీసుల అనుమతి

హైదరాబాద్‌/ఖమ్మం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : ఇప్పటిదాకా లోట్‌సపాండ్‌లో సమావేశాలకు పరిమితమైన షర్మిల.. శుక్రవారం జనం ముందుకు వెళ్లనున్నారు. ఆ రోజున ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న సంకల్ప సభకు ఆమె హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టేందుకు తాను సంకల్పం ఎందుకు తీసుకున్నారో ప్రజలకు ఆమె వివరించనున్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి సభలో పాల్గొంటున్నారు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నా సంకల్ప సభకు షర్మిల తల్లి హోదాలో, బిడ్డకు ఆశీస్సులు ఇవ్వడానికి ఆమె వస్తున్నారని పార్టీ ముఖ్య నేత ఇందిరా శోభన్‌ వెల్లడించారు. ఖమ్మం సంకల్ప సభకు షర్మిల భారీ కారు ర్యాలీ నిర్వహించనున్నారు.


శుక్రవారం సుమా రు 600 కార్లతో లోటస్‌ పాండ్‌ నుంచి ప్రారంభం కానున్న ర్యాలీ లకిడీకాపూల్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, హయత్‌నగర్‌, చౌటుప్పల్‌, నకిరేకల్‌, సూర్యాపేట్‌, నాయకన్‌గూడెం మీదుగా ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్స్‌కు చేరుకోనుంది. వాస్తవానికి లక్షన్నర మందితో సభను ఏర్పాటు చేసి ప్రజల ముందుకు రావాలని షర్మిల భావించారు. అయితే కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో కేవలం ఆరు వేల మందితో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహణకు ఖమ్మం పోలీసులు అనుమతి ఇచ్చారు. వలంటీర్లను పెట్టుకుని జనాన్ని నియంత్రిస్తూ కొవిడ్‌ నిబంధనల మేరకు సభను నిర్వహించుకోవాలని సూచి స్తూ పోలీసులు అనుమతి ఇచ్చారని షర్మిల పార్టీ వర్గాలు తెలిపాయి.  


షర్మిలతోనే వైఎస్‌ రాజ్యం: కొండా రాఘవరెడ్డి

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణం గా సంకల్ప సభను నిర్వహిస్తున్నామని సభ నిర్వాహక ఇన్‌చార్జి కొండా రాఘవరెడ్డి తెలిపారు. పార్టీ నేతలతో కలిసి సభ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైఎస్‌ సంక్షేమ రాజ్యం షర్మిలతోనే సాధ్యమవుతుందని, షర్మిలను ఆశీర్వదించేందుకు తెలంగాణ ప్రజానీకం తరలిరాబోతోందని అన్నారు. 

Updated Date - 2021-04-08T08:11:31+05:30 IST