Abn logo
Oct 22 2021 @ 03:44AM

షారుక్‌, అనన్య పాండే ఇళ్లలో ఎన్సీబీ సోదాలు

విచారణకు హాజరైన నటి

అనన్య మొబైల్‌, ల్యాప్‌టాప్‌ సీజ్‌

ఆర్యన్‌తో అనన్య వాట్సాప్‌ చాట్‌!

కరణ్‌ జోహార్‌ పార్టీపైనా నజర్‌?

జైల్లో ఆర్యన్‌ను కలిసిన షారుక్‌

భోజనం బాలేదని చెప్పిన ఆర్యన్‌!

బెయిలు పిటిషన్‌పై 26న విచారణ 

‘క్రూయిజ్‌ నౌ క’ డ్రగ్స్‌ కేసులో కొత్త మలుపు!



ముంబై, అక్టోబరు 21: క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు రోజురోజుకూ సీరియ్‌సగా మారుతోంది. ఓవైపు ఆర్యన్‌ ఖాన్‌కు ప్రత్యేక కోర్టు బెయిలు నిరాకరించగా.. మరోవైపు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు దూకుడు పెంచారు. గురువారం షారుక్‌ నివాసం ‘మన్నత్‌’లో సోదాలు నిర్వహించారు.  బాలీవుడ్‌ నటి అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆమె మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టా్‌పను సీజ్‌ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యకు నోటీసులిచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అనన్య తన తండ్రి చుంకీ పాండేతో కలిసి ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 6.15 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారు. ఆర్యన్‌తో చాటింగ్‌ చేసింది అనన్యేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.  


ఆర్యన్‌ ఖాన్‌ బెయిలు పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ జరుపుతామని బొంబాయి హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని గురువారం ఆర్యన్‌ తరఫు న్యాయవాది సతీశ్‌ మాన్‌షిండే కోరారు. కాగా, ఆర్యన్‌సహా 8మంది జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 4 నుంచి దీపావళి పండగ సెలవులు ఉండడంతో కోర్టు కస్టడీ గడువును 9 రోజులు మాత్రమే పొడిగించింది. 


కరణ్‌ జోహార్‌ ‘పార్టీ’పైనా నజర్‌?

2019లో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇంట్లో జరిగిన పార్టీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పార్టీలో చాలా మంది బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీలో డ్రగ్స్‌ వాడారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ వీడియోపై ఎన్సీబీ అధికారులు విచారణ జరిపారు. కానీ, అప్పట్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తనపై వచ్చిన ఆరోపణలను కరణ్‌ తిరస్కరించారు. ఎన్సీబీ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు. తాజా డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో ఎన్సీబీ.. నాటివీడియోపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేపై ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌  విమర్శనాస్త్రాలు సంధించారు. సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియాని ఎన్సీబీ కావాలనే తప్పుడు కేసులో ఇరికించిందన్నారు. 


నాన్నా.. తింటున్నావా!?

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ ముంబైలోని ఆర్థర్‌ రోడ్డు జైల్లో ఉన్న తన కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను కలుసుకున్నారు. అరెస్టయిన తర్వాత ఒకసారి అతనితో వీడియోకాల్‌లో మాట్లాడిన షారుక్‌.. ఎట్టకేలకు గురువారం నేరుగా కలుసుకున్నారు.  కుమారుడితో దాదాపు 20 నిమిషాలు మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. షారుక్‌ ఆధార్‌ కార్డు, ఇతర పత్రాలను పరిశీలించిన తర్వాత టోకెన్‌ ఇచ్చి లోపలికి పంపారు. సాధారణ సెల్‌లో ఉన్న ఆర్యన్‌తో షారుక్‌ ఇంటర్‌కామ్‌లో మాట్లాడుకున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. ‘సరిగ్గా తింటున్నావా.. అని షారుక్‌ ఆర్యన్‌ను అడగ్గా.. జైలు భోజనం బాగా లేదని చెప్పాడు. ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు’ అని వెల్లడించాయి. తన కుమారుడికి ఇంటి నుంచి భోజనం పంపొచ్చా అని షారుక్‌ జైలు అధికారులను అడగ్గా.. కోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పారు. షారుక్‌ రాకతో ఆయన అభిమానులు, మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు.