వాటర్‌ వారియర్‌

ABN , First Publish Date - 2020-03-12T06:22:53+05:30 IST

‘‘ఒక గృహిణినైన నేను ప్రధాని మోదీజీ దృష్టిలో పడ్డానంటే... నేను చేస్తున్న జల సంరక్షణే దానికి కారణం. పట్టణ నీటి వనరులపై చేస్తున్న కృషి ఆయన్ను ఆకట్టుకుందనుకుంటున్నా. నిజాయితీగా చెప్పాలంటే...

వాటర్‌ వారియర్‌

చుక్క నీటి బొట్టు కూడా వృథా పోకుండా ఒడిసిపట్టుకుంటారామె. ప్రతి ఒక్కరూ యుద్ధప్రాతిపదికన జల పరిరక్షణకు పూనుకోవాల్సిన అత్యవసర సమయం వచ్చింది అంటారు. ‘రీఛార్జ్‌, రీయూజ్‌, రీసైకిల్‌’ ఆమె జల సంరక్షణ మంత్ర. మహిళా దినోత్సవంనాడు ప్రధాని మోదీ సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణను  ఏడుగురు స్ఫూర్తిమంతమైన మహిళలకు అప్పగించారు. వారిలో ఆమె కూడా ఒకరు. ఆమే ‘వాటర్‌ వారియర్‌’గా పేరు తెచ్చుకున్న కల్పనా రమేష్‌. 


ఆమె అంతరంగం ఇది... 

‘‘ఒక గృహిణినైన నేను ప్రధాని మోదీజీ దృష్టిలో పడ్డానంటే... నేను చేస్తున్న జల సంరక్షణే దానికి కారణం. పట్టణ నీటి వనరులపై చేస్తున్న కృషి ఆయన్ను ఆకట్టుకుందనుకుంటున్నా. నిజాయితీగా చెప్పాలంటే ప్రధాని సోషల్‌ మీడియా అకౌంట్ల నిర్వహణకు నేను ఎంపిక అవుతానని అస్సలు ఊహించలేదు.


ఆర్కిటెక్ట్‌ను... కానీ...

మాది ఒంగోలు. హైదరాబాదులో స్థిరపడ్డాం. వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్‌ను. ఇంటీరియర్‌ డిజైన్‌ ఆర్కిటెక్చర్‌ అంటే    ఇష్టం. అదే చేశా. ఇంటీరియర్‌ స్టూడియో కూడా నిర్వహిస్తున్నా. అమెరికాలో కొన్నేళ్లు ఉన్న తర్వాత భారత్‌కు వచ్చాం. ఇక్కడ నా అడుగులు నీటి సంరక్షణ వైపు పడడానికి కారణం నాకు ప్రకృతి అన్నా, పచ్చదనం అన్నా చాలా ఇష్టం. బాల్యం నుంచి సమాజానికి నా వంతుగా ఏదైనా సేవ చేయాలనే తపన  బాగా ఉండేది. ‘బి ఎ వాటర్‌ ఉమన్‌, ‘బి యువర్‌ ఓన్‌ ఫార్మర్‌’ అని  మహిళలకు చెప్తుంటా. 


నీటి సంరక్షణ అంటే... వర్షపునీటిని సంరక్షించడం, భూగర్భ జలాలు పెంచడం, ప్రకృతిని పరిరక్షించడం. దీన్ని మా ఇంటి నుంచే ప్రారంభించా. నీటి సంరక్షణ విధానాన్ని డిజైన్‌ చేసుకున్నా. రీఛార్జ్‌, రీసైకిల్‌, రీయూజ్‌ పద్ధతితో నీరు వృథా కాకుండా చూడాలనుకున్నా. అలాగే చెరువుల రక్షణకూ పూనుకున్నా. ఒకప్పుడు వందల చెరువులకు నిలయం హైదరాబాద్‌. కానీ నేడు అవి కనిపించని పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది నన్ను బాగా ఆలోచింపచేసింది. నీటి సంరక్షణ పట్ల అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది. అధిక సంఖ్యలో స్త్రీలను ఇందులో భాగస్వాములను చేస్తే మరింత మార్పు వచ్చి, జల కళ సంతరించుకొంటుందనేది  అనుభవపూర్వకంగా నాకు అర్థమైంది.  


గ్రీన్‌ హౌస్‌తో ప్రారంభం...

మంచి ఎనర్జీ ఉండే ఇంటిని కట్టుకోవాలనుకున్నా. అందుకోసం గ్రీన్‌ హౌస్‌ ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం. వర్షపు నీటిని ఇంటి డాబా మీద సంరక్షిస్తాం. వినియోగించిన నీరు వృథాపోకుండా రీఛార్జ్‌, రీయూజ్‌, రీసైకిల్‌ పద్ధతిని మా ఇంట్లో అనుసరిస్తున్నాం. అందుకే మా ఇల్లు గానీ, మా చుట్టుపక్కల గానీ చల్లదనం, ఆకుపచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే 2016లో అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ తీవ్ర నీటి ఎద్దడి ఉండేది. రోజూ ట్యాంకర్‌ తె ప్పించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఆ నీళ్లను పరీక్షిస్తే... అందులో హానికర పదార్థాలున్నాయి. దాంతో మా పిల్లలకు సురక్షిత నీటిని అందివ్వాలనుకున్నా. అందులో భాగంగా ఇల్లు కట్టేటప్పుడే నీటి సంరక్షణకు ఏర్పాట్లు చేశాం. 


మళ్లీ ట్యాంకర్‌ రాలేదు... 

ఆనాటి నుంచి ఒక్కరోజు కూడా మేము నీటి ట్యాంకర్‌ తెప్పించుకోలేదు. ఎప్పుడూ సమృద్ధిగా మా ఇంట్లో నీళ్లు ఉంటాయి. దాంతోపాటు లక్షల్లో డబ్బు వృథా కాకుండా చూసుకున్నాం. ఎప్పుడైతే మా ప్రయత్నాలు విజయవంతయ్యాయో... మా కాలనీవాసులు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. అది నా తొలి విజయం. ఆ క్షణమే అనుకున్నా... జల సంరక్షణపై మరింత అవగాహన కల్పించి, సమాజానికి నా వంతు సాయం చేయాలని! వాటర్‌ రీసైక్లింగ్‌పై జనాల్లో అవగాహన పెంచాను. మా టెర్రస్‌ మీద ఆర్గానిక్‌ గార్డెన్‌ కూడా పెంచుతున్నాం. 


ఒక్కరితో కాదు... 

ఏదైనా మార్పు రావాలంటే అది ఏ ఒక్కరివల్లో కాదు... అందరూ భాగస్వాములు కావాలి. నీటి నిల్వలను కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది. అదే నేను బస్తీ, పట్టణ ప్రజలకు చెబుతున్నా. హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట కారణంగా వందల చెరువులు కాంక్రీట్‌ జంగిల్‌లో కలిసిపోయాయి. పట్టణ నిర్వహణ సరిగా లేక మరికొన్ని అదృశ్యమయ్యాయి. ఇక భూముల ఆక్రమణల వల్ల ఇంకొన్ని. 


ఇక్కడ మీకు నేను చేసిన ఒక ప్రయత్నం చెప్పాలి. గోపీనగర్‌ అనే మురికివాడ సమీపంలోని చెరువులో చెత్తాచెదారం డంప్‌ చేయడంతో ఆ ప్రాంతమంతా కాలుష్యమయంగా మారింది. దానివల్ల సమీప మురికివాడల్లోని ఇరుకు ఇళ్లల్లో నివసించే పేద ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా పరిసరాలను చెత్తతో ముంచెత్తకుండా, పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారికి చెప్పాను. దానికి వాళ్లు... ‘మా ఇళ్లే చిన్నవి. ఇక చెత్తను ఎక్కడ వేయమంటారు’ అని అన్నారు. దీంతో వాళ్లందరికీ చెత్త డబ్బాలు కొనిచ్చాను. దీని కోసం స్త్రీలను బృందాలుగా, స్ట్రీట్‌ లీడర్లుగా నియమించా. అప్పటి నుంచి వాళ్లే చెరువలోంచి తీసిన చెత్తను ఆటోల్లో తరలించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో స్పందించారు. పది రోజుల్లోనే ఆ చెరువును పరిశుభ్రంగా మార్చేశారు. ఈ చైతన్యం అందరిలోనూ వచ్చి... చెరువుల సంరక్షణకు పూనుకొంటే మనకు నీటి కరువే ఉండదు. నీటి సంరక్షణలో సమస్యలు తలెత్తినప్పుడు అవుటాఫ్‌ ద బాక్స్‌ ఆలోచించి, మెరుగైన నిర్ణయాలు తీసుకుంటా. నా వ్యూహం ఒకటే... గొడవలకు తావులేకుండా, పాజిటివ్‌ అవుట్‌లుక్‌తో ప్రశాంతంగా పనిచేసుకుపోవాలి.   

 

ఆ బావులపై అధ్యయనం... 

తెలంగాణలో స్టెప్‌ వెల్స్‌ చాలా ఉన్నాయి. అవి చారిత్రక ప్రాధాన్యం గల బావులు. వాటిపై అధ్యయనం చేసి తొలివిడతగా 15 బావులపై పుస్తకాన్ని ప్రచురించబోతున్నాం. వీటిని మన పూర్వికులు ఎంతో సైంటిఫిక్‌గా నిర్మించారు. మెట్లు ఉన్న చోట వాటర్‌ బాడీస్‌ పొటెన్షియల్‌ ఎక్కువ ఉండడం మా పరిశోధనలో గమనించాం. నీటి పెరుగుదల ప్రమాణాలను తెలియజేసేందుకు మెట్లు కట్టారు. కొన్ని మెట్ల బావుల్లో స్నానం చేస్తే శరీరం ఎంతో శుభ్రంగా ఉంటుంది. కారణం ఆ బావి చుట్టూ ఔషధ మొక్కలు ఉండడం. వాటి వల్ల ఆ నీళ్లు పోసుకున్నప్పుడు శరీరం ఎంతో ఎనరీగా ఉండేది. చర్మం బాగుండేది. అందుకే ‘వెల్స్‌ ఆర్‌ ది లైఫ్‌లైన్‌’.  


నీటి రక్షణ వైపు నా ప్రయాణం సాగడానికి మరో ఘటన కూడా చెప్పాలి. ఒకసారి మా స్నేహితులతో కలిసి గండిపేట వెళ్లాను. అందరం అక్కడ కూర్చున్నాం. కానీ ఒకప్పడు హైదరాబాద్‌ నగరం మొత్తానికి నీటిని అందించిన గండిపేట చెరువు నేడు డ్రై బెడ్‌గా ఉండడం నా మనసును కలిచివేసింది. నీటి కోసం మంజీర, సింగూర్‌ ప్రాజెక్టులు కట్టాం. అవీ ఎండిపోయాయి. దాంతో నీళ్ల కోసం చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీనికి కారణం మనకు సరిపడా నీటి నిల్వలు లేకపోవడమే. మరోవైపు జనాభా పెరిగిపోతోంది. ఉన్న నీటి వనరులు సరిపోవడం లేదు. వర్షపు నీటిని భద్రం చేసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. అంతా ప్రభుత్వమే చేయాలనుకోకుండా ఎవరికి వారుగా ఈ పని చేపడితే దీర్ఘకాలంలో వచ్చే మార్పు అనూహ్యం. మన బలం జనం కాబట్టి జనాభాను మన అవసరాలకు నిర్మాణాత్మకంగా వాడుకోవాలి. ఆ ఆలోచనతోనే చెరువుల చుట్టూ కమ్యూనిటీలను అభివృద్ధి చేయడం మొదలెట్టా. 


పది రోజుల్లోనే...

  ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. కాలుష్య కాసారంలా ఉన్న కుడికుంట చెరువును అక్కడి స్థానికులతో కలిసి బాగు చేయాలనుకున్నా. లేకపోతే ఆ మురికినీరు బోర్లల్లో చేరి జబ్బులు వస్తాయని చెప్పా. ప్రతి ఒక్కరూ వాటర్‌ వారియర్‌ కావాలని కోరాను.  చెరువు చుట్టూ గ్రూపులు ఏర్పడ్డాయి కాబట్టి అవగాహన పెరిగి ఉంటుందని భావించాం. తీరా పని ప్రారంభించిన రోజున ఒక్కరు రాలేదు. నేను, నాతోపాటు వచ్చిన ఒక వ్యక్తి   ఆ పని మొదలెట్టాం. అలా మెల్లగా మిగతావాళ్లు కూడా మాతో కలిశారు. అందరం కలిసి చెరువు నుంచి పది రోజుల్లోనే 110 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాం. 


ఇదే నా పోరాటమంత్రం... 

నేను చెరువులను శుభ్రం చేయాలనుకున్నప్పుడు చాలామంది అనుమానించారు. నాకేదో ప్రయోజనం ఉందన్నారు. ‘మీ ఏరియాలో ఉండక ఇక్కడకు వచ్చి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు’ అంటూ ప్రశ్నించారు. అపుడు బాధేసింది. కానీ అలాంటి సందర్భాలలో నా భర్త రమేష్‌ ఇచ్చిన సలహాలు, మద్దతు నన్ను దృఢంగా చేశాయి. అలా ‘లివ్‌ ది లేక్స్‌ ఇనిషియేటివ్‌’ను ప్రారంభించా.  


  చెరువుల రెయిన్‌ హార్వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను బ్లాక్‌ బై బ్లాక్‌ చేయలనుకున్నాం. తర్వాత యాదగిరి గుట్ట చేస్తాం. అక్కడ అభిషేకం జలాల్ని గ్రే రీసైకిల్‌  చేస్తే ఆ నీళ్లను గుడిలో వాడొచ్చు. బస్సుల్లో మొబైల్‌ వాటర్‌ మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా నీటి సంరక్షణ గురించి పిల్లలకు   చెప్పాలనుకుంటున్నాం. నీరు  మనిషి ప్రాథమిక హక్కు.   ‘సొసైటీ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎండీవర్‌’   ద్వారా నీటి నిల్వపై అవగాహనతో పాటు అపార్ట్‌మెంట్స్‌, ఆఫీసెస్‌కు అండగా నిలుస్తున్నా. పాడైన బోర్లను బాగు చేసేందుకు 10కె బోర్స్‌ ఇనిషియేటివ్‌ని చేపట్టా. ఇంటి ఆవరణలోనే రీచార్జ్‌ పిట్‌ లు పెడుతున్నాం. జీహెచ్‌ఎంసీ, కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నాం. నగరంలోని చెరువుల పరిరక్షణకు  ఏర్పాటు చేసిన ‘సిటీ లేక్‌ యాక్షన్‌ కమిటీ టు కన్‌సర్వ్‌ లేక్స్‌’లో ఉన్నా’’.

  

కుటుంబం అండ ఎంతో...

నేను చేసే పనిలో నా కుటుంబ తోడ్పాటు ఎంతో ఉంది. ముఖ్యంగా నా భర్త, మా అమ్మ నాకు స్ఫూర్తి. మా అమ్మకు సోషల్‌ వర్క్‌ అంటే చాలా ఇష్టం. నేను సమాజానికి ఒక మంచి ఉదాహరణగా నిలవాలని అమ్మ ఎప్పుడూ అనేవారు. ఎప్పుడూ ప్రకృతిని గౌరవించాలని చెప్పేవారు. అలాగే  ఏ సమస్యకైనా ఒంటరిగా పోరాటం చేయడానికి వెనకడుగు వేయని గాంధీజీ నాకు స్ఫూర్తి. ఆయన బాట నాకు బలం. వేదాంతం ప్రభావం, ఆథ్యాత్మికత కూడా నాలో ఎక్కువే. నేను చేసే ఈ పని నుంచే వాటినీ పొందా. అందువల్లే నేను చేసిన పనులు నావిగా అనుకోను. ‘మనం సాధించినవి’గా భావిస్తా.

  • - నాగసుందరి 
  • ఫోటోలు: అశోకుడు

Updated Date - 2020-03-12T06:22:53+05:30 IST