అనాథల భావోద్వేగాలే ఆమె లఘుచిత్రాలు

ABN , First Publish Date - 2020-08-12T05:36:03+05:30 IST

బిడ్డ ఏడిస్తే అమ్మ గుండెలకు హత్తుకుంటుంది. నాన్న ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. మరి అనాథ పిల్లల పరిస్థితి? అలాంటి దృశ్యాలు చూసినప్పుడల్లా ఓదార్పు కోసం వారి చిన్ని హృదయం ఎంతగానో పరితపిస్తుంది...

అనాథల భావోద్వేగాలే ఆమె లఘుచిత్రాలు

బిడ్డ ఏడిస్తే అమ్మ గుండెలకు హత్తుకుంటుంది. నాన్న ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. మరి అనాథ పిల్లల పరిస్థితి? అలాంటి దృశ్యాలు చూసినప్పుడల్లా ఓదార్పు కోసం వారి చిన్ని హృదయం ఎంతగానో పరితపిస్తుంది. ఎవరికీ పట్టని అనాథల బాధను అర్థం చేసుకుని... వారి భావోద్వేగాలను లఘుచిత్రాలుగా మలిచి మన ముందుంచుతున్నారు  పెరల్‌ గంటా. అభాగ్యుల అభ్యున్నతి కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్న ఈ మహిళా పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త అంతరంగం ‘నవ్య’కు ప్రత్యేకం...


అది 1997. కంబోడియా దేశంలో అక్కడి ‘కిల్లింగ్‌ ఫీల్డ్స్‌’పై డాక్యుమెంటరీ తీస్తున్నాం. దానికి నేను ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ని. గ్యాంగ్‌లు, ఏకే-47 తుపాకులతో షూటింగ్‌. నా తొలి డాక్యుమెంటరీ కూడా అదే! ఓ ఉత్కంఠభరిత అనుభూతి. ఆ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ప్రముఖుల ప్రశంసలు లభించాయి. ఇవన్నీ నాలో వాస్తవిక చిత్రాల నిర్మాణానికి ప్రేరణ కలిగించాయి. నాడు మొదలైన నా ఈ ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ‘ఆడపిల్లవి. నీవల్ల ఏమవుతుంది? నీ పరిధిలో నువ్వుండు’ అంటూ అవహేళన చేసినవారున్నారు. వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడూ నేను నిరుత్సాహపడలేదు. ఎందుకంటే ఎంచుకున్న మార్గంపై నాకు స్పష్టత ఉంది. నిజానికి చదువుకునే రోజుల్లోనే ఈ రంగంపై నాకు ఆసక్తి. మా స్కూల్లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమా షూటింగ్‌ జరిగింది. ఏదైనా విషయాన్ని చెప్పడంలో సినీ మాధ్యమం ప్రభావవంతంగా పనిచేస్తుందని నెమ్మదిగా అర్థమైంది. ఇక అప్పటి నుంచి చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే తపన మొదలైంది. 




కంబోడియా నుంచి నగరానికి... 

నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. రిలీజియన్‌ అండ్‌ ఫిలాసఫీలో ఎంఏ పట్టభద్రురాలిని. ఆ తరువాత ఎంబీఏ పూర్తిచేశా. స్కూలు, కాలేజీల్లో నాటకాలకు స్ర్కిప్ట్‌ రాసేదాన్ని. దర్శకత్వం వహించేదాన్ని. చిత్ర నిర్మాణంపై ఆసక్తితోనే యానిమేషన్‌లో మాస్టర్స్‌ పూర్తిచేశా. అయితే పెళ్లయిన తరువాత మా ఆయన అలెక్స్‌తో కలిసి కంబోడియాకు మకాం మార్చాం. ఇద్దరం కలిసి అక్కడ పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునే వాళ్లం. 

ఆ సమయంలోనే అక్కడి గ్యాంగ్‌లపై తీసిన డాక్యుమెంటరీలో నేను భాగస్వామినయ్యా. అది నా ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేసింది. నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక అప్పటి నుంచి సామాజిక అంశాలపై దృష్టి పెట్టాను. ఆ క్రమంలో ఎన్నో సమస్యలు నా కంట పడ్డాయి. అనాథలు, అభాగ్యులు ఏ దిక్కూ లేక తల్లడిల్లుతున్నారు. వారి కోసం చేతనైంది చేయాలనుకున్నాను. ఆ ఆలోచనతోనే భారత్‌కు తిరిగివచ్చాను. 




ఆ నాలుగే ప్రధానం... 

ఏ దిక్కూ లేని చిన్నారుల అభివృద్ధి కోసం చాలామంది ప్రముఖులు, పలు సంస్థలను కలిశాను. మరో పక్క అనాథ బాలల సమస్యలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ప్రారంభించాను. అందులో భాగంగానే లఘు చిత్రాలు తీయాలని నిర్ణయించా. ఈ సందర్భంగా నాలుగు అంశాలతో నాలుగు లఘుచిత్రాలు చేస్తున్నా. మొదటిది... ప్రతి చిన్నారికీ కుటుంబం ఉండాలనే కోణంలో. రెండోది ఆరోగ్యవంతమైన వాతావరణం, మూడోది విద్యా హక్కు- బంగరు భవిష్యత్తు. ఆఖరిది తిండి, చదువు తదితరాల గురించి ఆందోళన లేని బాల్యం. వీటిలో తొలి అంశంపై ‘అప్నావో’ అనే హిందీ లఘుచిత్రం రూపొందించాను. ఓ కుటుంబంతో కలిసినప్పుడు భావోద్వేగాలకు లోనయ్యే అనాథాశ్రమంలోని ఓ బాలిక కథ ఇది. యూట్యూబ్‌లో లక్షల మంది వీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా దీన్ని ప్రదర్శించింది. దీనివల్ల ఒక్క అనాథకు మేలు జరిగినా సంతోషమే కదా! అందుకోసమే నేను, నా భర్త కలిసి ‘అప్నావో’ పేరిట స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాం. 


దృక్పథం మారాలి... 

ఈ సమాజంలో దత్తత అంటే పిల్లలు లేని జంటలు మాత్రమే ముందుకు వస్తున్నాయి. మిగిలినవారు అనాథలను ఎందుకు దత్తత తీసుకోకూడదు? ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అప్యాయతలు, అనురాగాలకు నోచుకోని చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. వారంతా కుటుంబ ప్రేమ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ దత్తత తీసుకోలేకపోతే వాళ్లకు చదువు చెప్పించవచ్చు. కడుపు నిండా భోజనం పెట్టించవచ్చు. వారి కోసం ఆటస్థలం ఏర్పాటు చేయవచ్చు. మనసుండాలే కానీ ఎన్నో మార్గాలున్నాయి. ఈ దిశగా నేను చేయగలిగింది చేస్తున్నా. ఆశ్రమాలకు, మురికివాడలకు వెళ్లి పిల్లలతో పాటు మహిళలకు కూడా ఫిలిమ్‌ మేకింగ్‌లో శిక్షణనిస్తున్నాం. సామాజిక అంశాలను పాఠ్యాంశాలుగా బోధిస్తున్నాం. ఒకసారి కోల్‌కత్తాలోని ఓ బస్తీ పిల్లలకు శిక్షణనిచ్చాం. వారికి డిజిటల్‌ కెమెరానే తెలియదు. కానీ శిక్షణ తరువాత వారు తమ కథలతో చక్కని చిత్రాలు రూపొందించి, ఆశ్చర్యపరిచారు. 


ఆరంభంలో అవస్థలెన్నో... 

ఇప్పుడంటే డాక్యుమెంటరీలు, లఘుచిత్రాలు సునాయాసంగా తీసేస్తున్నాను కానీ... మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. అప్పట్లో ఆడవాళ్లు ప్రొడక్షన్‌ విభాగం వైపు పెద్దగా వచ్చేవాళ్లు కాదు. వందమందిలో దాదాపు అంతా మగవాళ్లే ఉండేవారు. నన్ను తక్కువ చేసి, చులకనగా చూసేవారు. నేను అవేవీ పట్టించుకోలేదు. ఫిలిమ్‌ మేకింగ్‌లో భాగంగా అమెరికా, బ్రెజిల్‌, టోగో, ఉగాండా, కెన్యా, కంబోడియా తదితర 40కి పైగా దేశాలు తిరిగాను. వర్క్‌షాప్‌లు నిర్వహించాను. దీనివల్ల ప్రపంచమేమిటో తెలిసింది. దాంతో 2002లో ‘యువర్‌ విజన్‌ కమ్యూనికేషన్స్‌’ పేరిట నేనే సొంత మీడియా ప్రారంభించాను. అదే ఏడాది ‘డీడీ మెట్రో’ కోసం 54 ఎపిసోడ్స్‌తో ‘కిడ్స్‌ జిందాబాద్‌’ సీరియల్‌ చేశాం. 2010లో ‘అడ్వెంచర్స్‌ ఇన్‌ ఒడిస్సీ’ రూపొందించాం. ఇక మా ఆయన అలెక్స్‌ కూడా ఇదే బిజినెస్‌లో ఉన్నారు. ప్రస్తుతం నేను ‘రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ ఐకాన్స్‌’ అధ్యక్షురాలిగా ఉన్నా. మహిళా సాధికారిత విషయంలో మాటలకే పరిమితం కాకుండా, నా కంపెనీలో సింహభాగం వారినే నియమించి విజయం సాధించగలగడం సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది.  


ఆకాశమే హద్దు... 

అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ నా లక్ష్యం ఒక్కటే... సమాజ శ్రేయస్సు కోసం నిలబడే ఛేంజ్‌ మేకర్స్‌లా రాబోయే తరాలను తీర్చిదిద్దడం. గొంతు లేని వారి గొంతుకలయ్యే వారిని తయారు చేయడం. రేపటి పౌరులకు ఉన్నత విలువలున్న సమాజాన్ని అందించడం. దాదాపు మూడు దశాబ్ధాలుగా నా జీవితం వీటితోనే ముడిపడిపోయింది. ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదలతో శ్రమిస్తే మహిళలకు ఆకాశమే హద్దు అని నమ్ముతాను. 

-హనుమా 



వారికీ ఓ కుటుంబం కావాలి... 

దేశంలోని పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. వాటి తరుఫున ఒకసారి ఆఫ్రికాలో పిల్లలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించాం. వారి తెలివితేటలు చూసి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడకు వచ్చిన తరువాత అనాథాశ్రమంలో కొంతమంది బాలలను కలిశాం. ఎవరినీ కదిలించినా కన్నీరు. ఒక్కోరిదీ ఒక్కో గాథ. నా అనేవారు లేరన్న వ్యథ. వాళ్లకూ ఓ కుటుంబమంటూ ఉంటే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అనిపించింది. 



Updated Date - 2020-08-12T05:36:03+05:30 IST