వ్యాక్సిన్ కావాలంటూ పోస్ట్ పెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-02-25T17:53:37+05:30 IST

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వ్యాక్సిన్ కావాలంటూ పోస్ట్ పెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..

ఆస్టిన్, టెక్సాస్: అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీకా వేయించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. వయసు పైబడిన వారికి టీకా వ్యాక్సిన్ మరింత అవసరం. ఏదైనా శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే వైద్యులు కూడా ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ వేయించుకోమని సలహా ఇస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు అన్ని దేశాల్లో ప్రారంభమైనప్పటికి వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి రాలేదు. ఈ కారణంగా సర్జరీ, ఇతర ఆపరేషన్లు చేయించుకునే వారు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఓ మహిళ కూడా ఇటువంటి ఇబ్బందినే ఎదుర్కొనగా మరో మహిళ ఆమెకు తన వ్యాక్సిన్ డోస్‌ను విరాళంగా ఇచ్చింది. 


వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఎమ్లీ జాన్సన్(68) అనే మహిళ 17 సంవత్సరాలుగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతోంది. గత డిసెంబర్‌లో వ్యాధి తీవ్రత ఎక్కువ అవడంతో డాక్టర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆస్పత్రి ఒహాయో రాష్ట్రంలో ఉండటంతో ఎమ్లీ జాన్సన్ టెక్సాస్‌ నుంచి ఒహాయో రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సర్జరీ చేసే ముందు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా వైద్యులు ఎమ్లీకి సూచించారు. వయసు ఎక్కువగా ఉండటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికి ఎమ్లీ వెంటనే వ్యాక్సిన్ తీసుకునేందుకు అవకాశం లేదు. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ఆమె వ్యాక్సిన్ టీకా కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకపక్క సర్జరీ వెంటనే చేయించుకోవాల్సి ఉండటంతో వ్యాక్సిన్ ఎక్కడి నుంచి పొందాలనే ఆలోచనలో పడింది. సోషల్ మీడియాలో తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పుకొచ్చింది. 


‘‘నేను 68 ఏళ్ల వృద్ధురాలిని. ప్రస్తుతం నేను గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాను. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి అంతా సిద్ధమైంది. కానీ కరోనా టీకా తీసుకున్నాకే సర్జరీ చేస్తామని డాక్టర్ చెప్పారు. మీలో ఏవరైనా టీకాను నాకు ఇస్తే చాలా సంతోషిస్తాను. నా ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. నా పరిస్థితిని అర్ధం చేసుకుని సహృదయభావంతో ఎవరైనా ముందుకు వస్తారని ఆశిస్తున్నా’’ అని రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ కింద వందల కామెంట్లు వచ్చాయి. అందులో ప్రతి ఒక్కరు ఆమెకు సలహాలు ఇవ్వడమే కానీ, టీకా ఇస్తానంటూ ఎవరి నుంచి సమాధానం రాలేదు. కానీ ఒక రోజు తెలియని వ్యక్తి నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. ‘‘నేను మీకు టీకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదే నా ఫోన్ నంబర్’’ అంటూ ఓ అనామక వ్యక్తి నుంచి ఫోన్‌కు సందేశం వచ్చింది. 


జాన్సన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసింది. లూయిస్(50) అనే మహిళ మాట్లాడింది. ‘‘ఈ రోజు ఉదయం నేను టీకా తీసుకోవాల్సి ఉంది. మీకు ఓకే అయితే నా బదులు మీరు వ్యాక్సిన్ డోస్ తీసుకోండి’’ అని చెప్పింది. ఆమె మాటలు విని ఎమ్లీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. కానీ వారికి ఓ సమస్య వచ్చి పడింది. టీకా ఇవ్వడానికి లూయిస్ సిద్ధంగా ఉన్నప్పటికీ వ్యాక్సిన్ వేసే సిబ్బంది మాత్రం ఎవరి టీకా వారే వేయించుకోవాలని, దీనికి నిబంధనలు ఒప్పుకోవని తెగేసి చెప్పారు. ఆస్పత్రి సూపర్‌వైజర్‌కు ఎమ్లీ పరిస్థితి గురించి వివరించగా, లూయిస్ స్థానంలో వ్యాక్సిన్ డోస్ తీసుకునేందుకు ఎమ్లీకి అనుమతినిచ్చారు. ఇలా ఎమ్లీ వ్యాక్సిన్ డోస్ తీసుకోగలిగింది. ఫిబ్రవరి ఐదో తేదీన ఎమ్లీకి రెండో డోస్‌ను కూడా ఇచ్చారు. మరి కొద్ది రోజుల్లో ఆమె ఒహాయో వెళ్లి సర్జరీ చేయించుకోనుంది. అదృష్టవశాత్తు ఫిబ్రవరి 16న లూయిస్‌ కూడా వ్యాక్సిన్ డోస్‌ను తీసుకుంది. 

Updated Date - 2021-02-25T17:53:37+05:30 IST