Abn logo
Jul 29 2021 @ 00:00AM

పద్యాల ‘సాగుబడి’ ఈమె సొంతం

అరవై నాలుగేళ్ల వయసులో పద్యం నేర్చుకున్నారు. వ్యవసాయంపై తనకుండే ప్రేమను వ్యక్తపరుస్తూ.. పుస్తకరూపంలో ‘సాగుబడి’ అనే పుస్తకం ప్రచురించారు. ఆమే సంధ్య  గోళ్లమూడి . కేవలం సేద్యంమీదే కాదు.. సామాజిక సేవ పట్ల కూడా ఆమెకు అనురాగం ఉంది. చదువు, ఆరోగ్యం, పేదలకు సాయం చేయటమే లక్ష్యంగా ‘ప్యూర్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు.  తాను చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలనూ.. సంధ్య గోళ్లమూడి ‘నవ్య’తో పంచుకున్నారు. 


ఆరేళ్లకితం.. అమెరికాలో ఉన్నప్పుడు నాతోటి వారు తెలుగు చంధస్సు, పద్యాలు నేర్చుకుంటున్నారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కట్టపల్లి ప్రసాద్‌గారు నేర్పిస్తున్నారని తెల్సింది. మనదేశం వచ్చాక ఆసక్తితో ఆయన దగ్గర తెలుగు వ్యాకరణం నేర్చుకోవాలనుకున్నా. అట్లా సంధులు, సమాసాలతో పాటు లఘువు,గురువుల గణవిభజన నేర్చుకున్నా. ఆటవెలది, మత్తేభం, కందం.. ఇలా పద్యాలను వేగంగా రాసేదాన్ని. 64 ఏళ్ల వయసులో రామకోటి రాయకుండా.. ఈ పద్యాలేంటీ?అని ఎవరైనా అనుకున్నా పర్లేదు.


పద్యం నేర్చుకోవాలనే పట్టుదలతో కఠోర సాధన చేశా. శ్రమ, ఆసక్తి వల్ల పద్యం వొంటబట్టింది. చిన్నప్పటినుంచీ నాలో గూడుకట్టుకున్న, నేను చూసిన ఎన్నో జీవితానుభవాలమీద పద్యాలు రాసుకునేదాన్ని. సాంఘీక ఆలోచనలపై రాయాలనుకున్నా. అందులో భాగంగానే.. వ్యవసాయం గురించి పద్యాలు రాయడం ఆరంభించా. దాదాపు 110 పద్యాలు రాశాను. అరవై ఐదు పద్యాలతో ‘సాగుబడి’ పుస్తకాన్ని వేశా. 


‘సాగుబడి’ నేపథ్యమిదీ.. 

కథలు, సీరియళ్లు, నవలలు చదివే కాలం కాదిది. పద్యాలను అచ్చులో వేస్తే ఎవరు చదువుతారనేది నా ప్రశ్న. అయితే నేను పంట గురించి పద్యాలను రాశా. అది కూడా ఆటవెలదిలో. ఒకప్పుడు పల్లెల్లో పొలం పనులు చేస్తూ జానపదాలు పాడుకునేవారు. ఇపుడా పరిస్థితి లేదు. అంతెందుకూ పడవ నడిపేవాడు కూడా ‘హైలెస్సా’ అనటం మానేశాడు. అందుకే కష్టజీవులు పనులు చేస్తూ పాడుకునే ఆ జనపదాలను భద్రపరచాలనుకున్నా. మా వారు అగ్రికల్చర్‌ రంగంలో ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ సమయంలో రైతులను దగ్గరగా చూశా. వారితో మాట్లాడేదాన్ని. వారి బాధలు తెలిసేవి.


అలా కంది, పొద్దు తిరుగుడు, పెసర, వేరుశెనగ పంట.. ఇలా ఆ పంట విశేషాలతో పాటు దాని గుణాలు, అవి పండే ప్రాంతాలు, నేల స్వభావాలు, వాతావరణ పరిస్థితులను అన్నింటినీ పుస్తకంలో రాశా. ధాన్యపు గింజలతో పాటు మామిడి, సీతాఫలం, జామ..లాంటి పండ్లనూ.. పూలతోట సాగునూ.. కంచె-రక్షణ విశేషాలను ‘సాగుబడి’రూపంలో తీసుకొచ్చా. ఆటవెలది పద్యాలు కాబట్టి సులువుగా అందరికీ అర్థమవుతాయి. ఈ పుస్తకం నచ్చి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు, మన తెలంగాణ గవర్నర్‌ తమిళసైగారు ముందుమాట రాయటం నా అదృష్టం. 1200 కాపీలను ప్రచురించాం. వెయ్యి కాపీలు అయిపోయాయి. రైతులకోసమే మిగతా 200 కాపీలను భద్రపరిచా. 


మాది ‘ప్యూర్‌’ మనసు!

ఓసారి ఖమ్మంలోని మారుమూల తాండాకి వెళ్లాను. అక్కడ పిల్లలకు భోజనం లేక కడుపులోంచి వచ్చే శబ్ధాలను విన్నా. వారికి భోజనం సరిగా లేదనే విషయం తెలిసి కడుపులో దేవినట్లయింది. మా అమ్మాయితో మాట్లాడితే వారికి సాయం చేసింది. ఆ తర్వాత నేను హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లినపుడు ఎన్నో ఇబ్బందులను గమనించా. పిల్లలకు ఏదైనా చేయాలనే ఆలోచనతో 2016లో పుట్టిందే ‘ప్యూర్‌’ స్వచ్ఛంద సంస్థ. ప్యూర్‌ అంటే ‘పీపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌’ అబ్రివేషన్‌ ఇచ్చాం.


నేను దాదాపు 600 పల్లెలకు పైగా తిరిగా. దారి కూడా సరిగా లేని పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలలనుంచి హైదరాబాద్‌లో పరిధిలోని 64 ప్రభుత్వ పాఠశాలలకు మా వంతు సాయం చేస్తున్నాం. ముఖ్యంగా మంచినీటి వసతి, బెంచీలు, గ్రంఽథాలయాలు, టీవీలు, టాయ్‌లెట్స్‌, అమ్మాయిలకు ప్యాడ్స్‌.. ను దాతల సహకారంతో మా సంస్థ సాయం చేస్తోంది. బడిపిల్లలు బాధపడకూడదనేది మా సిద్దాంతం. 


రోడ్డుమీద పురుళ్లు కూడా పోశాం..

ప్యూర్‌ సంస్థకు ఫౌండర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నా కూతురు శైల తళ్లూరి. వైస్‌ ఛైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ను నేనే. పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు వారికి బట్టలు, షూలు, నోట్‌బుక్స్‌ ఇస్తున్నాం. శ్రీకాకుళం తుఫాను బాధితులకు, కేరళ వరద బాధితులకూ కనీస అవసరాలను అందించాం. అంతెందుకూ గతేడాది లాక్‌డౌన్‌లో మా సంస్థ చురుగ్గా పనిచేసింది. ఇలాంటి ఉత్పాతాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడే మా సంస్థ రెట్టింపు వేగంతో పనిచేయాలనే నిబంధన పెట్టుకున్నాం.


లాక్‌డౌన్‌లో రోడ్డు మీద నడిచి వెళ్తోన్న కార్మికులకు రాత్రిపూట భోజనాలు పెట్టాం. ఇందుకోసం నాలుగు కిచెన్‌లు ఏర్పాటు చేశాం. మూడు పురుళ్లు కూడా పోశాం. కరోనా సెకండ్‌వేవ్‌ను ముందే గుర్తించి వృద్ధాశ్రమాలు, పేదలకు మందులతో పాటు గ్రాసరీస్‌ కూడా ఇచ్చాం. హైదరాబాద్‌లోని సన్‌సిటీ ప్రాంతంలో రెండు కొవిడ్‌కేర్‌ సెంటర్లను నడిపాం. పాతబస్తీలోని ‘రాజస్థానీ హిందీ విద్యాలయ’లో ఓ కేర్‌సెంటర్‌ను ఏర్పాటు చేశాం. మేం ఎంత పనిచేసినా అది తక్కువే అనిపిస్తుంది. చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. నిజంగా అవసరమున్న చోటే.. మంచి మనసుతో ‘ప్యూర్‌’ నిలబడుతుంది. 

 మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం. వ్యవసాయం కుటుంబం. ముత్తాతల దగ్గరనుంచి అందరూ విద్యావంతులే. మెట్రిక్యులేషన్‌ చదివా. ‘సాగుబడి’ పుస్తకం రైతులకు, రాబోయే తరాలకు అందాలన్నదే నా ఆశయం. పతంజలి యోగా రీతులను కంద పద్యాల్లో రాశా. కూచిపూడి, భరతనాట్యం, మణిపురి నాట్యరీతులతో పాటు కర్రసాము, గుస్సాడి నృత్యం, ఉరుమువృత్తం, ఒగ్గుకథ, వీరముష్టులాట, కోలాటం, కప్పల కావిడి, తోలుబొమ్మలాట.. ఇలా అనేక విషయాలను తేటగీతి, ఆటవెలదిలో పద్యాలు రాశా. వాటినీ పుస్తకరూపంలో తీసుకురావాలనుంది.