ఖోఖో ప్లేయర్‌పై అత్యాచారం కేసు.. ఒళ్లు గగుర్పొడిచే ఆడియో క్లిప్ వెలుగులోకి!

ABN , First Publish Date - 2021-09-15T01:16:19+05:30 IST

బిజ్నోర్ రైల్వే స్టేషన్‌లో 24 ఏళ్ల జాతీయస్థాయి ఖోఖో ప్లేయర్‌పై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్యచేసిన వ్యక్తిని

ఖోఖో ప్లేయర్‌పై అత్యాచారం కేసు.. ఒళ్లు గగుర్పొడిచే ఆడియో క్లిప్ వెలుగులోకి!

లక్నో: బిజ్నోర్ రైల్వే స్టేషన్‌లో 24 ఏళ్ల జాతీయస్థాయి ఖోఖో ప్లేయర్‌పై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్యచేసిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి స్నేహితురాలు షేర్ చేసిన ఆడియో క్లిప్ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకోగలిగారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 10న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన.


ఓ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరైన బాధిత దళిత మహిళ తిరిగి వస్తుండగా, రైల్వే స్టేషన్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న నిందితుడు షాజాద్ అలియాస్ హదీమ్ ఆమెను చూశాడు. ఆమెను పట్టాలపైకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలు తన స్నేహితురాలితో ఫోన్‌లో మాట్లాడుతోంది. సాయం కోసం గట్టిగా అరిచింది. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు ఆమె దుపట్టాతోనే గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఫోన్‌లో ఆమె అరుపులు విన్న స్నేహితురాలు కాసేపటి తర్వాత ఆగిపోవడాన్ని గుర్తించింది. 


అత్యాచారం చేసి, హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె మొబల్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలిని గుర్తించిన స్థానికులు, ఆమె పళ్లు ఊడిపోవడాన్ని కూడా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. 


బాధితురాలి మొబైల్‌తో పరారైన నిందితుడు ఇంటికెళ్లి ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసుకున్నాడు. అయితే, ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా నిందితుడి నివాసాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు నిందితుడి చెప్పు, రెండు విరిగిపోయిన చొక్కా గుండీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చొక్కాకు రక్తం మరకలు అంటుకోవడంతో అతడి భార్య ఆ చొక్కాను ఉతికినట్టు పోలీసులు తెలిపారు. 


బాధితురాలు తనతో చివరిసారిగా మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్‌ను ఆమె స్నేహితురాలు పోలీసులకు అందజేసింది. తనను రక్షించమంటూ బాధితురాలు వేసిన కేకలు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తున్నాయి. కాగా, తనపై దాడి జరుగుతున్నప్పుడు బాధితురాలు నిందితుడి వీపును గోళ్లతో గట్టిగా గిచ్చినట్టు అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు ఉన్న ఆనవాళ్ల నమూనాలను పోలీసులు పరీక్షలకు పంపగా, అవి బాధితురాలి డీఎన్‌ఏతో సరిపోలాయి. 


నిందితుడికి పెళ్లయి ఓ పాప కూడా ఉందని పోలీసులు తెలిపారు. అతడు డ్రగ్స్‌కు బానిసైనట్టు గుర్తించారు. రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వస్తువులు దొంగిలించినట్టు అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-09-15T01:16:19+05:30 IST