Abn logo
Jun 23 2021 @ 03:40AM

కాల్పనికత ఎక్కువైంది!

న్యూస్‌మేకర్‌  

విద్యాబాలన్‌ నాయికగా ఈ మధ్య అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘షేర్నీ’ అటవీ నేపథ్యంలోని చిత్రాల్ని ఇష్టపడేవారిని అమితంగా ఆకర్షించింది. ప్రాణాంతకమైన ఒక ఆడ పులిని సజీవంగా పట్టుకోవడానికి... ఒక బృందంతో మహిళా అటవీ అధికారి చేసే సాహసోపేతమైన ప్రయత్నం, ఆ క్రమంలో ఎదురయ్యే అవరోధాలు ఈ చిత్రంలోని ప్రధానాంశం. కాగా ‘షేర్నీ’లో ప్రధాన పాత్రకు స్ఫూర్తిగా... ఒక మహిళా అధికారి పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతోంది.. ఇంతకీ ఆ అధికారి కథేమిటి? ’షేర్నీ’ గురించి ఆమె ఏం చెబుతున్నారు? 


‘‘మనం వెదురులా ఉండాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా, అంత కిందికి వంగగలగాలి’’ అంటారు కె.ఎం.అభర్న. 1980కి ముందు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీ్‌సలో మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. ఆ తరువాత పరిస్థితి మారింది. ఇప్పుడు సుమారు 284 మంది మహిళా అధికారులు ఉన్నారు. అయిదువేలకు పైగా మహిళా సిబ్బంది ముందు వరుసలో విధులు నిర్వర్తిస్తున్నారు. అడవులన్నా, పర్యావరణమన్నా ఎంతో ఇష్టపడే అభర్న తన ఆకాంక్షలకు తగిన రంగం అటవీ శాఖేనని చిన్ననాడే నిర్ణయించుకున్నారు. 2013 బ్యాచ్‌ ఐఎ్‌ఫఎస్‌ అయిన ఆమె అసోంలోని గోలాఘాట్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ దేర్‌గావ్‌ రేంజిలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారె్‌స్టగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలోని నలభై గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండేది.


తమ జీవనాన్ని దెబ్బతీస్తున్నాయనే ఆందోళనతో వాటిపై స్థానికులు హింసకు పాల్పడేవారు. అక్కడ పరిస్థితుల గురించీ, మనుషులకూ, వానరాలకూ మధ్య ఘర్షణను నివారించే మార్గాల గురించీ అభర్న ఒక నివేదికను తయారు చేశారు. దాని ఆధారంగా ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అలాగే,  కజిరంగా నేషనల్‌ పార్క్‌ సెంట్రల్‌ రేంజికి ఇన్‌ఛార్జిగానూ ఆమె పని చేశారు. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ఆ పార్కు పేరు పొందింది. వాటిని అక్రమంగా వేటాడి అమ్ముకొనే వాళ్ళు కూడా ఎక్కువే. నిరంతర నిఘా వేసి, స్థానికుల్లో చైతన్యం కలిగించి... ఖడ్గమృగాలకు పూర్తి స్థాయిలో ఆమె రక్షణ కల్పించగలిగారు. అలాగే, ఆ ప్రాంతంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశారు. 


ఎన్నో ఉద్రిక్తతల మధ్య... 

డిప్యూటీ కన్జర్వేటర్‌గా మహారాష్ట్రలోని పాంధార్‌కావ్డా డివిజన్‌కు అభర్న వచ్చేనాటికి అక్కడ పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. పులులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో... అవి మనుషుల మీద దాడి చేయడం సాధారణమైపోయింది. ముఖ్యంగా అవని అనే ఆడపులి వరుసగా గ్రామీణుల్ని పొట్టన పెట్టుకుంటూ ఉండడంతో... దాన్ని ఎలాగైనా మట్టుపెట్టాల్సిందేననే డిమాండ్లు పెరిగాయి. ఆ మరణాలకు బాధ్యత అటవీ శాఖదేనంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఒక దశలో అధికారులను కొట్టారు, రోడ్లు దిగ్బంధించారు. తమకు న్యాయం జరిగే వరకూ.... పులి దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు చెయ్యబోమంటూ పట్టు పట్టారు. దీంతో ఏంచెయ్యాలో తెలియని సందిగ్ధంలో అటవీ సిబ్బంది ఉన్నారు.


ఈ దశలో మహిళా ఫారెస్ట్‌ గార్డులతో తొమ్మిది బృందాలను అభర్న ఏర్పాటు చేశారు. మారేగావ్‌, పాంధార్‌కావ్డా ప్రాంతాల్లో వారు నిరంతరం గ్రామస్తులకు అందుబాటులో ఉండి, ప్రజలకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు రోజంతా అటవీ ప్రాంతాల్లో నిఘా పెట్టారు. గ్రిడ్ల వారీగా కెమెరాలు ఏర్పాటు చేశారు. అవనిని సజీవంగా పట్టుకోవడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు. 2018లో అవనిని అటవీ సిబ్బంది కాల్చి చంపాల్సి వచ్చింది. తాజాగా వచ్చిన ‘షేర్నీ’లో ప్రధాన కథాంశం చాలావరకూ ఇదే!

‘షేర్నీ’ సినిమా గురించి అభర్న మాట్లాడుతూ ‘‘నేను ఆగస్టు 2017లో బాధ్యతలు తీసుకున్నాను. అప్పటికే ఐదుమంది గ్రామీణుల్ని ఆ ఆడపులి చంపేసింది. ఆ తరువాత సరైన గుర్తింపు ప్రక్రియ, క్రమబద్ధమైన పర్యవేక్షణ మొదలైంది. కానీ సినిమాలో మాత్రం కథానాయిక పాత్ర బాధ్యతలు తీసుకున్నాకే... పులి మనుషుల్ని చంపడం మొదలైనట్టు చూపించారు. కథాగమనంలోనూ కాల్పనికత చాలా ఎక్కువగా ఉంది. దాంతో వాస్తవికత లోపించింది. ఆ సినిమాను మధ్యప్రదేశ్‌లో చిత్రీకరించడంలో... అడవిలోని పరిస్థితులు భిన్నంగా కనిపించాయి. మహారాష్ట్రలోని పాంధార్‌కావ్డాలోనే ఆ సినిమా తీసి ఉంటే... పులులు వాటి పిల్లలతో బతికే అడవి ఎలా ఉంటుందో ప్రేక్షకులకు బాగా అర్థమయ్యేది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. అటవీ శాఖ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల గురించీ, ల్యాండ్‌స్కేప్‌ మేనేజిమెంట్‌ గురించీ మొదటిసారి ఇంత లోతుగా చర్చించిన సినిమా ఇదే కావచ్చు’’ అని చెప్పారు.


ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర వెదురు పరిశోధన, శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా ఉన్నారు. ‘‘ఈ భూమి మనుషులు ఒక్కరిదే కాదు.. ప్రకృతితో, ఇతర జీవజాలంతో మనం సామరస్యంగా జీవించాల్సిందే. అడవులకు సమీపంలో బతుకుతున్న వారిలో ఈ అవగాహన కల్పించాలి. విచక్షణ లేకుండా అడవుల్ని నరకడం, నాశనం చెయ్యడం మానుకోవాలి. అప్పుడే పర్యావరణాన్ని కాపాడుకోగలం’’ అంటున్నారీ సాహస మహిళ.