ష్‌... గప్‌చుప్‌..!

ABN , First Publish Date - 2021-09-12T06:26:12+05:30 IST

కనిగిరిలో ప్రభుత్వ భూముల ఆక్రణమలపై విచారణ అంతలోనే ఆగిపోయింది. అక్రమ వెంచర్లపై రెండు మూడు రోజులు హడావుడి చేసిన అధికారులు ఆ తరువాత ‘ష్‌... అంతా గప్‌చిప్‌..!’ అంటూ మిన్నకుండిపోయా

ష్‌... గప్‌చుప్‌..!
కనిగిరిలోని ఓ అసైన్డ్‌ భూమి వద్ద మొక్కుబడిగా ఉంచిన నోటీసు బోర్డు

భూ బకాసురులపై చర్యలు నిల్‌ 

కనిగిరిలో అత్యధికంగా  అసైన్డ్‌ అక్రమాలు

రికార్డుల తారుమారులో వీఆర్వోలే కీలకం 

 మొక్కుబడిగా నోటీసులతో సరి

కనిగిరి, సెప్టెంబరు 11 : కనిగిరిలో ప్రభుత్వ భూముల ఆక్రణమలపై విచారణ అంతలోనే ఆగిపోయింది. అక్రమ వెంచర్లపై రెండు మూడు రోజులు హడావుడి చేసిన అధికారులు ఆ తరువాత ‘ష్‌... అంతా గప్‌చిప్‌..!’ అంటూ మిన్నకుండిపోయారు. ఇందుకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ భూ అక్రమాలపై తగిన ఆధారాలతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆగస్టు 2న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ కనిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల అన్యాక్రాంతం, అక్రమ, అనధికార వెంచర్లపై క్షేత్రస్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. దీంతో కదిలిన రెవెన్యూ అధికారులు ఆక్రణదారులకు నోటీసులతో సరిపెట్టడం ఆరోపణలకు తావిస్తోంది. 


ఏం జరిగిందంటే..

రెవెన్యూ రికార్డులను మాన్యువల్‌ నిర్వహణ నుంచి కంప్యూటరైజేషన్‌ చేసే క్రమంలో 2012లో కనిగిరి మండలంలో వివిధ విభజనల ద్వారా ఐదు అనుబంధాల్లో (అనెగ్జర్‌లలో) భూములను పొందుపరిచారు. అనెగ్జర్‌-1లో దాదాపు 28,160 ఎకరాల వరకు ఉంది. అనెగ్జర్‌-2లో ప్రభుత్వ భూమి 43,000 ఎకరాల వరకూ ఉంది. అనెగ్జర్‌-3లో దేవదాయ, అనెగ్జర్‌-4లో సీలింగ్‌ భూములు ఉన్నాయి. అయితే అనెగ్జర్‌-5లో చక్కల భూమి (డాటెడ్‌ ల్యాండ్‌) 4,165ఎకరాల వరకూ ఉంది. వీటిలో అనెగ్జర్‌-2లోని అసైన్డ్‌ భూమి, అనెగ్జర్‌-5లోని చుక్కల భూమి అధికంగా రికార్డుల్లో తారుమారైనట్లు ఆరోపణలున్నాయి. 


వీఆర్‌వోలే సూత్రధారులు 

ప్రభుత్వ భూమి పరిరక్షణ రెవెన్యూ అధికారుల చేతిలోనే ఉంటుంది. అయితే మండలంలోని ముగ్గురు వీఆర్వోలు ఆయా భూములను ఇష్టానుసారం బదలాయింపు చేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో రిటైర్మెంట్‌కు దగ్గర పడిన ఇద్దరు తహసీల్దార్‌లు, రాజకీయ నేతల ప్రమేయంతో అన్నీ తామై వ్యవహారం చక్కబెట్టినట్లు విమర్శలున్నాయి. రియల్‌ భూం ఎక్కువగా ఉండే పామూరు రోడ్డు, కందుకూరు రోడ్డు, గార్లపేట రోడ్డులలోనే సుమారు 100 ఎకరాలకుపైన భూ ఆక్రమణదారులకు అనుకూలంగా రికార్డులు తారుమారు చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఇవికాక వీరి కనుసన్నల్లోనే దాదాపు 1000 ఎకరాలకుపైగానే ప్రభుత్వ భూములు చేతులు మారి ఉంటాయని రెవెన్యూ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కనిగిరిలో గతంలో పని చేసిన ఓ తహసీల్దార్‌ ఉద్యోగ విరమణ చేసే కొద్ది కాలం ముందు 1600ఫైళ్లపై తన సంతకాలు చేసినట్లు సమాచారం. ఆయన ఒక్కో ఫైల్‌కు లక్ష నుంచి, రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక రియల్‌ వ్యాపారుల  నుంచి ఒక్కో ఫైల్‌కు రూ.5లక్షల పైగానే వసూలు చేసి దాదాపు రూ.3 కోట్ల వరకు అవినీతికి పాల్పడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే నాటి నుంచి నేటి వరకూ దానిపై విచారణ కరువైంది. 


ముఖ్యనేత ఒత్తిడితో మెత్తబడిన వైనం

ఈ అక్రమాలపై ఇటీవల ప్రతిపక్ష నేత డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్‌ కార్యాలయ రికార్డులు కదిలాయి. కలెక్టర్‌ ఆదేశాలతో తహసీల్దార్‌ పుల్లారావు 20మందికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల అందుకున్న వ్యక్తులు అక్రమాలకు పాల్పడిన భూముల్లోనూ బోర్డులు ఏర్పాటు చేశారు. 10 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హెచ్చరించారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడితో నోటీసు బలం మెత్తబడింది. అక్రమ వెంచర్లు వేసిన వారు సదరు ప్రజాప్రతినిధిని ఆశ్రయించడంతో ఆ నోటీసులు మొక్కుబడిగా మారాయి. అధికార పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు, మరో నాయకుడు సమష్టిగా డిగ్రీ కాలేజీ పక్కన వేసిన అసైన్డ్‌ భూమిలో వెంచరుకు నోటీసులు జారీచేయక పోవటం విమర్శలకు తావిస్తోంది. కలెక్టర్‌ ఆదేశాలు కూడా అమలుకాకపోవడంతో రెవెన్యూ ప్రతిష్ట మనసబారుతోంది. 


Updated Date - 2021-09-12T06:26:12+05:30 IST