ప్రధానమంత్రి సహాయనిధికి శిఖర్ ధవన్ విరాళం

ABN , First Publish Date - 2020-03-27T00:29:24+05:30 IST

కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం

ప్రధానమంత్రి సహాయనిధికి శిఖర్ ధవన్ విరాళం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌కు దూరంగా ఉండేందుకు ప్రజలు అంతా తమ ఇళ్లు వదలి బయటకు రావద్దని ఆయన అందరిని కోరారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో సమాజంలోని కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. వారిలో ఎక్కవశాతం పేద, మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకొనేందుకు, కరోనా వ్యాధికి చికిత్స అందించేందుకు గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా ప్రధానమంత్రి సహాయనిధికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్‌ కూడా ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాన్ని అందించాడు. 


‘‘అందరికి నమస్కారం, మీరు, మీ కుటుంబసభ్యుల సంక్షేమం కోసం దయచేసి ఇంట్లోనే ఉండండి. ప్రధానమంత్రి సహాయనిధికి నావొంతు సహాయాన్ని అందించాను. మీరు కూడా మీకు తోచిన మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని కోరుతున్నాను’’ అంటూ ధవన్ ట్వీట్ చేశాడు. దీంతో పాటు ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చే వెబ్‌సైట్‌ని కూడా అతను జత చేశాడు. అయితే తాను ఎంత మొత్తాన్ని విరాళంగా అందించాడనే విషయాన్ని ధవన్ గుప్తంగా ఉంచాడు. 


ధవన్‌తో పాటు మరికొందరు క్రీడాకారులు కూడా ఇప్పటికే తమ వంతు సహాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధులకు అందించారు. ప్రముఖ షట్లర్ పీవీ సింధు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధులకు రూ.5 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-03-27T00:29:24+05:30 IST